మధు యాష్కీ కాంగ్రెస్ లో ఉన్నారా ?
ఆ వరసలో మధు యాష్కీకి కూడా ఆశలు ఉండవచ్చు. ఆయన అయితే తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని కోరుకున్నారు.
By: Tupaki Desk | 26 Oct 2024 12:28 PM GMTమధు యాష్కీ కాంగ్రెస్ ద్వారా రాజకీయ అరంగేట్రం 2004లో చేశారు. ఆయన రెండు సార్లు ఎంపీగా అప్పట్లో గెలిచారు. ఆ తరువాత చూస్తే 2014లో బీఆర్ఎస్ మహిళా నేత కవిత చేతిలో ఓటమి పాలు అయ్యారు. ఇక ఆయన అధికారిక పదవుల విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ లో సీనియర్ నేతగా చలామణి అవుతూ వస్తున్నారు.
పదేళ్ల తరువాత కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీలో చాలా మందికి ఆశలు ఉన్నాయి. ఆ వరసలో మధు యాష్కీకి కూడా ఆశలు ఉండవచ్చు. ఆయన అయితే తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని కోరుకున్నారు. పార్టీ అధినాయకత్వం అయితే ఆయనకు ప్రచార కమిటీ ప్రెసిడెంట్ పదవిని కట్టబెట్టింది.
మరి ఈ విషయంలో ఆయనలో అసంతృప్తి ఏమైనా ఉందో ఏమో తెలియదు కానీ తాజాగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు చూస్తే పార్టీ వైఖరి మీద ఆయన ధోరణులను బయటపెట్టినట్లు అయింది అంటున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో కి వచ్చిన ఎమ్మెల్యేల వైఖరిని ఆయన తప్పు పడుతున్నారు. వారు ఆస్తులను కాపాడుకోవడానికి వచ్చారు తప్పించి కాంగ్రెస్ పైన ప్రేమతో కానే కాదని అంటున్నారు.
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వైఖరిని గమనిస్తున్నామని కూడా ఆయన అనడం విశేషం. అయితే కాంగ్రెస్ లో ఎవరు చేరాలన్నా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఆమోదం ముద్ర పడాల్సిందే. అలా చూస్తే కనుక వారిని గుర్తించి గౌరవించి అక్కున చేర్చుకున్నది కాంగ్రెస్ అధినాయకత్వం అని భావించాలి.
మరి జాతీయ నాయకత్వం చేర్చుకున్న వాళ్ళ విషయంలో మధు యాష్కీ ఈ వ్యాఖ్యలు ఎలా చేస్తారు అన్నదే ఇక్కడ ప్రశ్నగా ఉంది. అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదో డిసైడ్ చేసి బీఆర్ఎస్ లో ఉన్న వారిని కాంగ్రెస్ లో చేర్పించినట్లుగా మధు యాష్కీ మాటలు ఉన్నాయని అంటున్నారు.
మధు యాష్కీ చేస్తున్న ఈ కామెంట్స్ ఇండైరెక్ట్ గా హై కమాండ్ కే తగులుతాయని అంటున్నారు. ఆయన ఎవరినో టార్గెట్ చేయబోయి కాంగ్రెస్ హై కమాండ్ ని టార్గెట్ చేస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది. తనకు టీపీసీసీ చీఫ్ పదవి ఇవ్వలేదు అన్న అసంతృప్తితో ఆయన ఈ విధంగా పార్టీ హై కమాండ్ తీసుకున్న డెసిషన్ల మీద మీడియా ముందు మాట్లాడమేంటని తెలంగాణా కాంగ్రెస్ వాదులు అంటున్నారు.
ఇదిలా ఉంటే మధు యాష్కీ సొంత పార్టీ ప్రభుత్వంలోని పోలీసు అధికారుల మీద విపక్ష నేతల మాదిరిగా మాట్లాడుతున్నారు అని అంటున్నారు. జీవన్ రెడ్డి అనుచరుడు గంగిరెడ్డి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణం అని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ హత్య గురించి డీజీపీకి ఫిర్యాదు చేస్తామని కూడా అన్నారు.
మొత్తం మీద చూస్తే మధు యాష్కీ ఈ విధంగా చేసిన వ్యాఖ్యల పట్ల చర్చ అయితే సాగుతోంది. మరో నెలలో కాంగ్రెస్ తెలంగాణాలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి హై కమాండ్ తో పాటు రేవంత్ రెడ్డి రెక్కల కష్టం క్యాడర్ పనితనం ప్రధాన కారణాలుగా ఉన్నాయి.
ఇక కాంగ్రెస్ లో చూసుకుంటే ఎంతో మంది సీనియర్లు ఉన్నారు. వారంతా కూడా హై కమాండ్ చెప్పినట్లుగా పార్టీ లైన్ లో నడుస్తున్నారు. మధుయాష్కీ అయితే ఈ విధంగా కామెంట్స్ చేయడం ద్వారా ఏమి చేదామని అనుకుంటున్నారు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇంతకీ ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా ఉండే అలా మాట్లాడుతున్నారా అని కూడా అంటున్నారు.
పార్టీ నేత జీవన్ రెడ్డిని పరామర్శించడంతో తప్పు లేదు, పార్టీ న్యాయం చేస్తుంది అని భరోసా ఇచ్చేంతవరకూ అభ్యంతరం లేదు కానీ తమ ప్రభుత్వం మీద ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు అన్న భావన కనుక మరింతగా వ్యాపిస్తే అది కాంగ్రెస్ కే చేటు తెస్తుంది అని అంటున్నారు. ఏది ఏమైనా మధుయాష్కీ మాటలు వ్యాఖ్యలు అయితే చర్చనీయాంశం అవుతున్నాయని అంటున్నారు అంతా. చూడాలి మరి ఏమి జరుగుతుందో.