Begin typing your search above and press return to search.

కూటమిలో కొందరు మంత్రులు మాజీలు అవుతారా ?

మంత్రుల పనితీరు కూడా కూటమి ప్రభుత్వానికి కొలమానంగా ఉంటుంది.

By:  Tupaki Desk   |   6 Nov 2024 4:10 AM GMT
కూటమిలో కొందరు మంత్రులు మాజీలు అవుతారా ?
X

ఏపీలో టీడీపీ కూటమి ఏర్పడి ఈ నెల 12 నాటికి అయిదు నెలలు పూర్తి అవుతాయి. దాంతో పాటుగా ప్రభుత్వం మీద ప్రజలకు ఇప్పుడే ఒక అభిప్రాయం ఏర్పడుతోంది. ప్రభుత్వం అంటే మంత్రులు అని వేరేగా చెప్పాల్సింది లేదు. మంత్రుల పనితీరు కూడా కూటమి ప్రభుత్వానికి కొలమానంగా ఉంటుంది.

ఇదిలా ఉంటే కూటమిలో కొందరు మంత్రుల పనితీరు పట్ల ప్రభుత్వ పెద్దలు అసంతృప్తిగా ఉంటున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు సాగుతున్న ప్రచారం చూస్తే అవును అనే అంటున్నారు. పనితీరు మార్చుకోవాలని పదే పదే చెప్పినా కూడా కొందరి తీరు మారలేదు. దానికి తోడు కొన్ని శాఖల పట్ల ఇంకా అవగాహన పెంచుకోని మంత్రులు ఉన్నారని అంటున్నారు.

అదే విధంగా కొన్ని కీలక శాఖల నిర్వహణ తీరు పట్ల అటు ప్రభుత్వంలో ఇటు ప్రజలలో అసంతృప్తి ఉందని అంటున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయంలో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు వస్తున్నాయి. వరసబెట్టి అఘాయిత్యాలు నేరాలు మహిళల మీద పెరిగిపోతున్నాయి అదే సమయంలో జరుగుతున్న వాటి మీద సరైన రివ్యూ లేదని అంటున్నారు. దీని మీద ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను అంత తేలిగ్గా తీసుకోకూడదని అంటున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కొత్త ఏడాది అంటే 2025లోకి ప్రవేశించాక సంక్రాంతి పండుగ తరువాత కూటమి మంత్రులలో కొందరు మాజీలు అవుతారు అని ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. కనీసంగా నలుగురు అయిదుగురు మంత్రులను తప్పిస్తారు అని ఊహాగానాలు లాంటివి జరుగుతున్నాయి. ఆ మంత్రుల జాబితాలో హోం మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత ఉన్నారని అంటున్నారు. ఆమె విషయంలో పవన్ వ్యాఖ్యలు చేయక ముందు నుంచే ప్రభుత్వ పెద్దలు కొంత అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. శాఖల పట్ల మరింత ఫోకస్ పెట్టాల్సి ఉందని అంటున్నారు.

దాంతో అనితని తప్పిస్తారా లేక శాఖను మార్చి వేరే కొత్త శాఖ ఇస్తారా అన్న చర్చ కూడా ఉంది. ఆమె బలమైన గొంతుకగా పార్టీలో ఉన్నారు. పైగా ఒక కీలక సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు. అందువల్ల ఆమెని హోం శాఖ నుంచి తప్పించినా వేరే శాఖ ఇవ్వవచ్చు అని అంటున్నారు.

ఇక పక్కనే ఉన్న మరో జిల్లా విజయనగరంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా దూకుడుగా పనిచేయలేకపోతున్నారు అని అంటున్నారు. అక్కడ ఎంతో మంది సీనియర్లు ఉన్నారు, కూటమి నేతలుగా బలమైన వారు ఉన్నారు. అందరికీ కో ఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంది. అలాగే శాఖ పట్ల కూడా ఇంకా శ్రద్ధ చూపించాల్సి ఉంది అని అంటున్నారు. కొండపల్లి మొదటి సారి ఎమ్మెల్యే ఆ వెంటనే మంత్రి అయ్యారు. దాంతో ఆయన పనితీరు పట్ల కూడా అసంతృప్తి ఉంది అని అంటున్నారు. సో ఆయన మాజీ అవుతారా అన్న చర్చ ఉంది.

అదే విధంగా చూస్తే గోదావరి జిల్లాలకు చెందిన వాసంశెట్టి సుభాష్ విషయంలోనూ సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లుగా ఒక ఆడియో లీక్ అయింది. అందులో రాజకీయాల మీకు ఉండాల్సిన పట్ల సీరియస్ నెస్ లేదని సుభాష్ ని పెద్దాయన అన్నట్లుగా కూడా వచ్చింది. సో ఆయన పదవి మీద కూడా ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

ఇదే జాబితాలో రాయలసీమ జిల్లాకు చెందిన బీసీ జనార్ధనరెడ్డి, రాం ప్రసాద్ రెడ్డిల పేర్లు కూడా ఉన్నాయని అంటున్నారు. ఈ ఇద్దరూ కర్నూల్, కడప జిల్లాలకు చెందిన వారు. బలమైన రాజకీయం ఉన్న చోట అవసరమైన దూకుడు చూపించాల్సి ఉంది. అంతే కాకుండా వీరికి కీలకమైన శాఖలు లభించాయి. కానీ పనితీరు మీద కొంత పెదవి విరుపు ప్రభుత్వ పెద్దలలో ఉంది అని అంటున్నారు. మొత్తం మీద అరడజన్ మంత్రుల మెడ మీద వేటు కత్తి వేలాడుతోంది అన్నది అయితే పుకారుగా మొదలై బలమైన ప్రచారంగా మారుతోంది. ఇందులో వాస్తవాలు ఎంత అన్నది చూడాల్సి ఉంది.