''కేజ్రీవాల్ అవినీతిపరుడు.. కాదు, మోడీనే అవినీతిపరులకు అవినీతిపరుడు!''
అసలు ఈ దేశంలో అవినీతి పరులకు అవినీతి పరుడు మోడీనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 1 Feb 2025 2:30 AM GMTఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం కోటలు దాటుతోంది. నువ్వు అవినీతి పరుడివి.. అని ఒకరంటే.. కాదు, నువ్వే అవినీతి పరుడివి.. అంటూ ప్రత్యర్తులు కత్తులు దూసుకుంటున్నారు. ఒకరిని మించి ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా శుక్రవారం ప్రధాని మోడీ ఢిల్లీలోని ద్వారకలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి కౌంటర్‌గా కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. అసలు ఈ దేశంలో అవినీతి పరులకు అవినీతి పరుడు మోడీనే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
''నేను పదేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. ఇది ప్రజల ఆశీర్వాదం. కానీ, సొంతానికి ఒక ఇల్లు కాదు కదా.. ఒక్క గది కూడా నిర్మిం చుకోలేదు. కానీ, ఇక్కడ ఓ పెద్ద మనిషి(కేజ్రీవాల్) ఉన్నారు. ఆయన అనునిత్యం పేదల కోసం తపిస్తానని మాటలు చెబుతారు. పేదల పార్టీ, పేదల పక్షం అంటూ మాటల కోటలు కడతారు. కానీ, వెనుక చూస్తే.. తనకు సొంతగా ప్రజల కష్టంతో వచ్చిన ప్రభుత్వ సొమ్ముతో అద్దాల మేడ(శీష్ మహల్)ను నిర్మించుకున్నారు. ఆయన ఎంత అవినీతి పరుడు కాకపోతే.. ఇలా కట్టుకుంటారు. మాకు అధికారం ఇవ్వండి. తొలి అసెంబ్లీ సెషన్‌లోనే ఆయన అవినీతిని మీకు పరిచయం చేస్తాం. కాగ్ నివేదికను ప్రవేశ పెడతాం'' అని ప్రధాని మోడీ అన్నారు.
మోడీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా కేజ్రీవాల్ సైతం పదునైన విమర్శలు గుప్పించారు. ''దేశంలో పారిశ్రామిక వేత్తలను పోషిస్తున్న వారు.. ఎవరో ప్రపంచ స్థాయిలో దేశం పరువును తీస్తున్నవారు ఎవరో అందరికీ తెలిసిందే. ఆయన అవినీతి పరులకే అవినీతి పరుడు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాపై వేధింపులకు దిగుతున్నారు. ఈడీ, సీబీఐ,ఐటీ వంటి ఆయుధాలను మాపై ప్రయోగిస్తూ.. అవినీతి పరులను కాపాడుతున్నారు. ఆయనకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలి'' అని వ్యాఖ్యానించారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ రెండు పార్టీలపైనా ఉమ్మడిగా విమర్శలు గుప్పించడం విశేషం.
''ఇరు పార్టీల రంగు తేలిపోయింది. వారిద్దరూ అవినీతి పరులే. మేం 15 ఏళ్లపాటు ఢిల్లీని పాలించాం. ఎక్కడా రూపాయి అవినీతి జరగలేదు. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు రెండూ అవినీతి పార్టీలే. ఒకరు అద్దాల మేడ కట్టుకున్నారు. మరొకరు అవినీతి పరులైన స్నేహితులను పోషిస్తున్నారు. ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నారు'' అని కాంగ్రెస్ నాయకులు విమర్శలు గుప్పించారు. కాగా, మరో మూడు రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర పడనుంది. వచ్చే నెల 5న 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.