ద.కొరియా జీపీఎస్ ను జామ్ చేసి.. చిర్రెత్తించిన ఉ.కొరియా..విమానాలు, నౌకా సర్వీసులు బంద్
కాగా, కిమ్ ప్రభుత్వం కొన్నాళ్లుగా దక్షిణ కొరియాను కవ్విస్తున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 9 Nov 2024 9:30 AM GMTకొరియా ద్వీపకల్పం ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఓవైపు నియంత కిమ్ చేతిలోని ఉత్తర కొరియా.. మరోవైపు ప్రజాస్వామ్య దక్షిణ కొరియా.. అటువైపు దూకుడు.. ఇటువైపు డెవలప్ మెంట్.. రష్యాకు మద్దతుగా సైన్యాన్ని పంపే ఉత్తర కొరియా.. అమెరికానే నమ్ముకున్న దక్షిణ కొరియా.. అణు కవ్వింపులకు పాల్పడే కిమ్.. అణుకువగా ఉండే సియోల్.. ఇంత పరస్పర విరుద్ధ దేశాలు ప్రపంచంలో పక్కపక్కనే ఉండడం ఆశ్చర్యకరం. కాగా, కిమ్ ప్రభుత్వం కొన్నాళ్లుగా దక్షిణ కొరియాను కవ్విస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చెత్త బెలూన్లను ఆ దేశంలోకి పంపి విసిగించింది. తాజాగా మరో వివాదాస్పద చర్యకు దిగింది.
కిమ్ నిర్వాకం..
చెత్త బెలూన్లతో విసిగింపు.. సరిహద్దుల ధ్వంసం.. ఉక్రెయిన్ కు సైనికులను పంపడం.. ఇవీ ఉత్తర కొరియా అధినేత కిమ్ కవ్వింపులు. ఇప్పుడు ఆ దేశం దక్షిణ కొరియా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)ను తారుమారు చేసింది. దీంతో దక్షిణ కొరియా విమాన సర్వీసులు, ఓడల రవాణాలో సమస్యలు తలెత్తాయి. ఈ ఏడాది వేసవిలో దక్షిణ కొరియాలోకి వేలాది చెత్త బెలూన్లను పంపింది ఉత్తర కొరియా. అంతేగాక.. పొరుగు దేశంతో సరిహద్దును మూసివేసింది. రెండు దేశాలను కలిపే రహదారులు, రైల్వే మార్గాలను ఏకంగా బాంబులతో పేల్చివేసింది ఉత్తర కొరియా. సరిహద్దుల్లో నిఘా పెంచింది. వీటన్నిటి మధ్యన.. ఉక్రెయిన్ లోకి రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులను పంపింది. అన్ని పరిణామాలపైనా దక్షిణ కొరియా తీవ్రంగా స్పందించి. ఉక్రెయిన్ కు సైనికులను పంపడాన్ని గట్టిగా తప్పుబట్టింది. ఉత్తర కొరియా అణు పరీక్షలు చేస్తోందని ఆరోపిస్తోంది.
విమానాలు, నౌకా సర్వీసులు బంద్
దక్షిణ కొరియా జీపీఎస్ ను ఉత్తర కొరియా తారుమారు చేసింది. దీంతో విమానాలు, నౌకా సర్వీసులకు అంతరాయం కలిగిందిట. ఇలా రెండు రోజులుగా చేస్తున్నదని, 500 విమానాలు, వందలాది నౌకలు సమస్యలు ఎదుర్కొన్నాయని దక్షిణ కొరియా ఆరోపించింది. ఇలాంటి కవ్వింపు చర్యలు మానుకోవాలని కోరుతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే ఉత్తర కొరియాదే బాధ్యత అని హెచ్చరించింది. కాగా, మే 29-జూన్ 2 మధ్య ఉత్తర కొరియా చెత్త బెలూన్ల కారణంగా జూన్ నుంచి సియోల్ లోని రెండు విమానాశ్రయాల రన్ వేలను మూసివేశారు.