జగన్ కి హెల్ప్ చేస్తున్న పవన్ ?
కాంగ్రెస్ కోరుకున్నట్లుగా అందలం మీద నుంచి నేలకు వైసీపీ జారింది.
By: Tupaki Desk | 30 Sep 2024 4:01 PM GMTఏపీలో బలపడాలని కాంగ్రెస్ చూస్తోంది. అయితే కాంగ్రెస్ కి ఆ చాన్స్ ఇవ్వడం లేదు టీడీపీ జనసేన. నిజానికి 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పీసీసీ చీఫ్ షర్మిల సొంత అన్న జగన్ కి వ్యతిరేకంగా చేసిన విపరీత ప్రచారం వల్ల కూడా ఓటు బ్యాంక్ కొంత టర్న్ అయి కూటమి ఘన విజయానికి దోహదపడింది.
అలా ఏపీలో టీడీపీ కూటమి ఏర్పాటుకు తన వంతు పరోక్షంగా సహకరించిన షర్మిలకు కానీ కాంగ్రెస్ కి కానీ గడచిన నాలుగు నెలల కాలంలో ఏపీ రాజకీయాలో పైసా రాజకీయ వాటా కూడా దక్కలేదు అని అంటున్నారు.
ఏపీలో వైసీపీ ఓడింది. కాంగ్రెస్ కోరుకున్నట్లుగా అందలం మీద నుంచి నేలకు వైసీపీ జారింది. మరి వైసీపీలో ఉన్న నేతలను ఆ పార్టీ ఓటు బ్యాంక్ ని యధాతధంగా ఒడిసి పట్టుకోవాలని కాంగ్రెస్ వేసిన ఎత్తులు అయితే ఏ మాత్రం పారడం లేదు.
ఏపీలో కాంగ్రెస్ పని 2014లోనే అయిపోయింది అని ఈ రోజుకీ ఏపీలోని రాజకీయ సమాజం భావిస్తోందా అంటే దానికి తగినట్లుగానే పరిణామాలు జరుగుతున్నాయి. ఏపీలో కాంగ్రెస్ కి వైఎస్సార్ వారసురాలిగా షర్మిల ఉంటారని అందువల్ల ఆమె దూకుడుతో ఎంతో కొంత కూడదీసుకోవచ్చు అనుకున్న కాంగ్రెస్ కి మాత్రం ఆ ఆశలు ఏ కోశానా నెరవేరే అవకాశాలు కనిపించడం లేదు.
దానికి ముందే చెప్పుకున్నట్లుగా టీడీపీ జనసేన కారణం అని అంటున్నారు. ఏపీలో టీడీపీ తరువాత మరో రెండు పార్టీలు ఉన్నాయి. వైసీపీ జనసేన. అందులో వైసీపీ అధికారం చూసింది. జనసేన ఎప్పటికైనా అధికారం చూడాలని అనుకుంటోంది. దాంతో వైసీపీని ఎంత వీక్ చేస్తే తాను అంత బలపడవచ్చు అన్నది జనసేన ఆలోచన.
ఈ క్రమంలో వైసీపీ నుంచి నేతలను తెచ్చి గంపగుత్తగా తన పార్టీలోని పవన్ తీసుకుంటున్నారు.ఇటీవలనే వైఎస్సార్ కుటుంబానికి బంధువు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అలాగే సన్నిహితుడు అయిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సహా ఇతర కీలక నేతలను పవన్ జనసేనలోకి తీసుకున్నారు.
నిజానికి వీరంతా మొదట కాంగ్రెస్ లో ఉండేవారు. వైసీపీ అంటే విసుగు పుడితే వీరు తిరిగి వెళ్లాల్సింది సొంత గూటికే. కానీ అలా ఏపీలో జరగడం లేదు. జనసేనలోకి పోతున్నారు. అంటే వారికి కొత్త పొలిటికల్ ఆల్టరేషన్ గా జనసేన ఉంది అని అర్ధం అవుతోంది
టీడీపీలోకి వెళ్లలేని వారు ఆ పార్టీతో దశాబ్దాలుగా ఎదురు నిలిచి పోరాడిన వారు అంతా ఇపుడు జనసేనను ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. దాంతో కాంగ్రెస్ పార్టీలోకి ఒక్క నేత కూడా చేరడం లేదు. అలా కాంగ్రెస్ మరింతగా బక్క చిక్కిపోతోంది.
దాంతో పీసీసీ చీఫ్ గా షర్మిల ప్రభావం పెద్దగా ఏపీ రాజకీయాల్లో కనిపించడం లేదు అని అంటున్నారు.ఆమె రాక ముందు కాంగ్రెస్ ఎలా ఉందో ఇపుడు అలాగే ఉంది. దాంతో కాంగ్రెస్ నీరసిల్లిపోతోంది. ఆ పార్టీ కేంద్ర పెద్దలకు ఈ విషయం స్పష్టంగా అర్ధం అవుతోంది అని అంటున్నారు. దాంతో సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మరీ ఏపీకి వచ్చి సొంత అన్న మీద రాజకీయ సమరం చేస్తున్న షర్మిలకు ఎటువంటి అధికారిక పదవులు సమీప భవిష్యత్తులో దక్కే అవకాశాలు లేవు అని అంటున్నారు
ఇంకో వైపు చూస్తే జనసేనను వైసీపీ నేతలు ఎంచుకోఅవం ఒక విధంగా ఆ పార్టీకి మేలు చేసేదిగా ఉంది అని అంటున్నారు. సాటి ప్రతిపక్ష పార్టీ అందునా కాంగ్రెస్ ని చీల్చి వైసీపీని పెట్టినందున హస్తం పార్టీ బలపడితే వైసీపీ పుట్టె మునిగేది. అలా కాకుండా అధికార కూటమిలోకి నేతలు వెళ్తున్నారు.
ఇక ప్రతిపక్షంలో వైసీపీ మాత్రమే ఉంది. ఎంత కాదనుకున్నా అదే ఈ రోజుకీ ఆల్టర్నేషన్ గా ఉంది అని అంటున్నారు. దాంతో కాంగ్రెస్ పోటీగా వచ్చి వైసీపీని చీల్చలేకపోవడం ఎంతో ఉపశమనం అనే అంటున్నారు.అధికార కూటమి మీద వ్యతిరేకత వస్తే కచ్చితంగా ఆ యాంటీ ఇంకెంబెన్సీ వైసీపీకే నేరుగా వచ్చి లాభపడుతుంది. సో జనసేన పవన్ ఈ విధంగా వైసీపీకి జగన్ కి హెల్ప్ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.