పవన్ కూడా ఆ తానులో ముక్కేనా ?
చెగువీరా నుంచి స్పూర్తి పొంది జనసేనను స్థాపించాను అని పవన్ 2014లో చెప్పినపుడు ఆయన రాజకీయం ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నంగా ఉంటుందని అంతా అనుకున్నారు.
By: Tupaki Desk | 9 March 2025 12:00 AM ISTసంప్రదాయ రాజకీయాలు అంటే జనాలకు వెగటు. ఎందుకంటే అందులో అంతా పాత చింతకాయ ఉంటుంది. వారసత్వం తో కూడిన రాజకీయాలతో పాటు కుటుంబ పార్టీల రాజ్యం నడుస్తుంది. నిజానికి అభ్యుదయగాములు అయితే ఇలాంటివి కోరుకోరు. చెగువీరా నుంచి స్పూర్తి పొంది జనసేనను స్థాపించాను అని పవన్ 2014లో చెప్పినపుడు ఆయన రాజకీయం ట్రెడిషనల్ పాలిటిక్స్ కి భిన్నంగా ఉంటుందని అంతా అనుకున్నారు.
అయితే పవన్ 2019 ఎన్నికల్లో వామపక్షాలు బీఎస్పీ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని ఏపీలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కాదు ఆల్టర్నేటివ్ సెక్షన్లతో కూడిన పాలిటిక్స్ కి తెర తీశారు అని అనుకున్నారు. కానీ ఆ ముచ్చట మూడు నాళ్లే అయింది. ఓటమి పాలు కాగానే పవన్ 2020లో తిరిగి బీజేపీతో పొత్తుకు వచ్చారు. 2024 ఎన్నికలలో టీడీపీతో కలసి జనంలోకి వచ్చారు.
ఈ రెండు పార్టీలను 2017 నుంచి 2019 దాకా తాను తీవ్రంగా విమర్శించాను అన్నది కూడా ఆయన చాలా కన్వీనియంట్ గా మరచిపోయారు అని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ సమ సమాజం అందరికీ అవకాశాలు అని నినదిస్తూ వచ్చారు కానీ ఆయన రాజకీయాలు కూడా సామాజిక బంధాల నుంచి దాటి వెళ్ళలేదని ఎన్నికల్లో టికెట్ల పంపిణీ నుంచి అనేక అంశాలలో నిరూపించారని విమర్శలు ఉన్నాయి.
ఇక మంత్రి పదవులు చూస్తే జనసేనకు ముగ్గురు ఉంటే అందులో ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఇపుడు నాగబాబుని మంత్రిగా తీసుకుంటారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ముగ్గురు అవుతారు. పైగా వారసత్వ రాజకీయాలకు తావు ఇచ్చినట్లు అవుతుంది.
దీని మీద అపుడే వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కామెంట్స్ కూడా చేశారు. అన్నదమ్ములు తండ్రీ కొడుకుల కూటం ప్రభుత్వం అని కామెంట్స్ చేశారు. అంటే చంద్రబాబు నారా లోకేష్ అలాగే పవన్ నాగబాబులను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్స్ చేశారు. నిజానికి ప్రాంతీయ పార్టీలు మాత్రమే కాదు ఈ దేశంలో చాలా జాతీయ పార్టీలలో కుటుంబాల పెత్తనమే ఉంది.
ఏపీలో చూస్తే టీడీపీ వైసీపీ అలాగే ఉంటూ వచ్చాయి. కానీ జనసేన కొత్తరకం రాజకీయం చేస్తుందని అంతా ఆశిస్తున్నారు కానీ జరిగింది వేరుగా ఉంటోంది అని అంటున్నారు. జనసేనకు నాలుగో మంత్రి పదవి బీసీలకు ఇచ్చి ఉంటే ఆ పార్టీకి మరింత వన్నె చేకూరుతుందని అంటున్నారు. అలా కాకుండా నాగబాబుని మంత్రిగా చేస్తే మాత్రం జనసేనాని పవన్ కూడా ఆ తానులో ముక్కేనా అని అంటారు. మరి ఆ విమర్శలతో ప్రత్యర్ధులకు ఆయుధం ఇచ్చేందుకు జనసేన సిద్ధంగా ఉందా లేదా అన్నది కొద్ది రోజూల్లో తేలుతుంది అని అంటున్నారు.