వైసీపీని జనాలు పట్టించుకోవడం లేదా ?
పైగా అధికార పార్టీ కావడంతో జనం అంతా ఆ పార్టీ ప్రభుత్వం మీద ప్లస్ మైనస్ కోణాలలో చర్చించుకునేవారు.
By: Tupaki Desk | 4 Jan 2025 2:30 AM GMTఏపీలో వైసీపీ తీరు ఎలా ఉంది అన్నది ఒక చర్చగా సాగుతోంది. వైసీపీ 151 సీట్లతో అధికారం చలాయించే రోజులలో విపక్షాలు అన్నీ గట్టిగా టార్గెట్ చేసేవి. అలా వైసీపీ మీద పొలిటికల్ గా ఫుల్ ఫోకస్ ఉండేది. పైగా అధికార పార్టీ కావడంతో జనం అంతా ఆ పార్టీ ప్రభుత్వం మీద ప్లస్ మైనస్ కోణాలలో చర్చించుకునేవారు.
ఇక ఒక్కసారిగా 11 సీట్లతో పాతాళానికి రాజకీయ ప్రతిష్ట దిగజారి వైసీపీ వచ్చి పడిన తరువాత గడచిన ఏడు నెలలుగా చూస్తే ఆ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా ఉంది అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. ఏపీలో వైసీపీ అటు అసెంబ్లీలో తన వాణిని వినిపించడం లేదు.
దానికి కారణం వైసీపీ అధినాయకత్వం తీసుకున్న ఒక నిర్ణయం. ఇది పార్టీకి ఎంతవరకు మేలు చేస్తోంది అన్నది పక్కన పెడితే వైసీపీ వాయిస్ మాత్రం అసెంబ్లీలో ఎక్కడా వినిపించడం లేదు. ఇది ఒక విధంగా జనానికి దూరం చేసేదిగానే ఉంది అని అంటున్నారు.
ఇక జనంతో అయినా పార్టీ కనెక్ట్ అయి ఉందా అంటే ఎక్కడికక్కడ నేతలు సైలెంట్ అయ్యారు చాలా మంది కూటమి వైపు చూస్తున్నట్లుగా కూడా ప్రచారం సాగుతోంది. వీలు ఉంటే అక్కడ బెర్త్ కన్ ఫర్మ్ చేసుకుని వెళ్ళిపోతున్న వారు పోతున్నారు. లేని వారు ఉందిలే మంచి కాలం అని కూటమి లో జాయింగ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటున్నారు. టోటల్ గా చూస్తే వైసీపీ కోసం పనిచేసేవారు ఆ పార్టీని అట్టిపెట్టుకుని ఉండాలనుకునేవారు ఎంత మంది అన్నది మాత్రం లెక్కకు అందడం లేదు అని అంటున్నారు.
ఇక ఒకసారి వెనక్కి వెళ్తే 2014 నుంది 2019 మధ్యలో వైసీపీ విపక్షంలో ఉంది. ఆనాడు ఓటమి చెందినా డే వన్ నుంచే జగన్ జనంలో ఉంటూ వచ్చారు. అలాగే అసెంబ్లీలో కూడా బలమైన విపక్షంగా వైసీపీ నిలిచి నాటి టీడీపీ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ వచ్చింది. అప్పటికి జగన్ కి అసెంబ్లీ అనుభవం కానీ విపక్ష నేత పాత్ర కానీ కొత్త. దాంతో టీడీపీ పెద్దలు ఆయనను లైట్ తీసుకున్నా వారి అంచనాలను సైతం మించి ఖంగు తినిపించారు.
పదునైన వ్యూహాలతో పాటు ఉంటే అసెంబ్లీ లేకుంటే జనంలో నిరంతరం ఉంటూ రాజకీయ వేడి పుట్టించే వారు. పార్టీకి కూడా కొత్త ఉత్సాహం అందించేవారు. అయితే ఇపుడు చూస్తే సీన్ పూర్తిగా రివర్స్ అయింది అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీ ఘోరమైన ఓటమి తరువాత అధినేత జగనే ఈ రోజుకీ పూర్తిగా దానిని జీర్ణించుకోలేని పరిస్థితి అని అంటున్నారు
అంతే కాదు ఆయన ఉంటే తాడేపల్లి లేకుంటే బెంగళూరు అన్నట్లుగా షటిల్ సర్వీస్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. జగన్ ఏడు నెలల కాలంలో జనంలోకి వచ్చింది బహు తక్కువ అని కూడా అంటున్నారు. ఇక వైసీపీలో జగనే సర్వస్వం. ఆయన జనంలోకి వస్తేనే పార్టీ క్యాడర్ లీడర్లు రోడ్డు మీదకు వస్తారు.
జగన్ రాకపోతే పార్టీ కూడా ఫుల్ సైలెంట్ గా ఉంటోంది. మరో వైపు చూస్తే వైసీపీకి దక్కిన భారీ ఓటమి తరువాత పార్టీ చేస్తున్న రిపేర్లు ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది. అలాగే వైసీపీ సమీక్షలు ఆత్మ పరిశీలనలూ అన్నీ కూడా పూర్తిగా లోతైన తీరులో లేవు అని కూడా అంటున్నారు.
మోసపూరిత హామీలతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. మేము మళ్ళీ గెలుస్తామని వైసీపీ అధినాయకత్వం చెబుతోంది తప్ప వేరే విధంగా లాజిక్ కి అందేలా పార్టీకి బూస్టప్ ఇస్తూ క్యాడర్ ని ఉత్తేజం చేయలేకపోతోంది అని అంటున్నారు.
దాంతో ఎటు చూసినా కూటమి నేతలే హైలెట్ అవుతున్నారు. కూటమి అధికారంలో ఉండడంతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అంతా జనంలో ఉంటున్నారు. త్రిమూర్తులు మాదిరిగా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా ఏడు నెలల కాలంలో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ జనంలో కనిపిస్తున్నారు.
బలమైనది టీడీపీ కూటమి అన్న ఇంప్రెషన్ కలుగచేస్తున్నారు. ప్రభుత్వం ఏమి చేస్తోందో ప్రతీ రోజూ కొన్ని పదుల సంఖ్యలో టాప్ టూ బాటమ్ మీటింగ్స్ పెట్టి మరీ జనాలకు సమాచారం చేరవేస్తున్నారు. భవిష్యత్తు మీద రాష్ట్ర ప్రగతి మీద భరోసా ఇస్తున్నారు. దానికి తగినట్లుగా వైసీపీ ఒక ప్రధాన పక్షంగా రియాక్ట్ కాలేకపోతోంది.
ఏపీలో కాంగ్రెస్ కూడా పెద్దగా అలికిడి చేయడం లేదు. వామపక్షాలు అయితే తమదైన పోరాటాలు చేస్తున్నా కూటమికి ఆ నిరసనలు పెద్దగా తాకడం లేదు. బలమైన పార్టీగా వైసీపీ కూటమిని టార్గెట్ చేయడంలో పూర్తిగా వెనుకబడి పోయింది అని అంటున్నారు. నిజానికి కూటమి సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదు, విద్యుత్ చార్జీల పెంపుతో జనాలకు భారం అయింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి.
ఇలా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. వాటిని అసెంబ్లీ లోపలా బయటా చర్చకు పెట్టడంలో విపక్షంగా వైసీపీ విఫలం అయింది అని అంటున్నారు. దాంతోనే వైసీపీ ని జనాలు పట్టించుకోవడం లేదా అన్న చర్చ వస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ అయితే ప్రజలు వైసీపీని పట్టించుకోవడం లేదు అని ఘాటైన విమర్శ చేసారు. మరి దీనిని వైసీపీ సీరియస్ గా తీసుకుని ఏ విధంగా జనాల్లోకి వస్తుందో చూడాల్సి ఉంది.