Begin typing your search above and press return to search.

వ్యక్తుల్ని టార్గెట్ చేశారనే హరీశ్.. శ్రీతేజ్ ను పరామర్శించలేదేం?

ఒకవేళ.. అది నిజమే అని అనుకుందాం. ఆ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం మంచిదే.

By:  Tupaki Desk   |   25 Dec 2024 5:28 AM GMT
వ్యక్తుల్ని టార్గెట్ చేశారనే హరీశ్.. శ్రీతేజ్ ను పరామర్శించలేదేం?
X

రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. అంతమాత్రాన మానవత్వంతో స్పందించాల్సిన అవసరం లేదా? ఒక విషాద ఘటనకు సంబంధించి ఒక ప్రముఖుడి విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్న వాదనను బీఆర్ఎస్ నేతలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ.. అది నిజమే అని అనుకుందాం. ఆ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లటం మంచిదే. అదే సమయంలో.. బాధిత కుటుంబాన్ని పట్టించుకోకుండా.. కేవలం రాజకీయం చుట్టు మాత్రమే పరిమితం చేయటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న. ఇప్పుడు ఈ సందేహం హరీశ్ అండ్ కో వ్యవహారశైలిని చూస్తుంటే కనిపిస్తోంది.

పుష్ప 2 బెనిఫిట్ షో సందర్బంగా సంథ్య థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకోవటం.. ఆ సందర్భంగా రేవతి అనే మహిళ మరణించటం.. ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటం తెలిసిందే. ఈ ఉదంతంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తిన వేళ.. తమ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదన్న విషయాన్ని తెలియజేసే క్రమంలో.. పలు ఆధారాలు బయటకు రావటం.. దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ పై విమర్శలు చేయటంతో పాటు.. సినీ పరిశ్రమ వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టటం తెలిసిందే.

ఈ మొత్తం ఎపిసోడ్ మొదట్నించి.. అల్లు అర్జున్ కు సపోర్టుగా నిలిచారు బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్.. హరీశ్ రావులు. నిజంగానే రేవంత్ సర్కారు అల్లు అర్జున్ టార్గెట్ చేస్తున్న పక్షంలో బన్నీ తరఫు నిలబడి మాట్లాటం తప్పు కాదు. అదే సమయంలో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కానీ.. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు శ్రీ తేజ్ ను కానీ ఎందుకు పరామర్శించరు? అన్నది ప్రశ్న. నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు.. సీఎంను నిలదీసేందుకు ప్రస్తావించే అంశానికి సంబంధించిన కనీస పరామర్శ చేయని హరీశ్ తీరును ఏమనాలి? ఎలా చూడాలి?

నీతులు.. విలువల గురించి మాట్లాడటానికి ముందు.. వాటిని తాము అనురిస్తున్నామని.. వాటికి తాము గౌరవిస్తామన్నట్లుగా ఉంటే బాగుంటుంది. అందుకు భిన్నంగా మాటలు కోటలు దాటుతాయి కానీ.. చేతలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటే జనామోదాన్ని పొందే ఛాన్సు ఉండదు. అల్లు అర్జున్ ను వ్యక్తిగతంగా రేవంత్ సర్కారు టార్గెట్ చేస్తే,. నిలదీయాల్సిన అవసరం హరీశ్ రావుకు ఉంది. అదే సమయంలో బాధితులను పరామర్శించటం.. తాము సైతం అండగా ఉంటామని చెప్పటం కనీస ధర్మం కదా? మరి.. ఆ పని హరీశ్ రావు ఎందుకు చేయరు?