Begin typing your search above and press return to search.

సిద్ధరామయ్య సీటు కదులుతోందా ?

అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో సీఎంల సీటు చాలా ఈజీగా పోతూంటుంది అన్నది తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Jan 2025 4:14 AM GMT
సిద్ధరామయ్య సీటు కదులుతోందా ?
X

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీటుకు ఎసరు వస్తోందా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అవును అనే అంటున్నారు. రాజకీయాల్లో పదవులు ఎంత తొందరగా వస్తాయో పోవడం కూడా అలాగే ఉంటుంది. అంతే కాదు కాంగ్రెస్ పార్టీలో సీఎంల సీటు చాలా ఈజీగా పోతూంటుంది అన్నది తెలిసిందే.

ఇదిలా ఉంటే కర్ణాటకలో సీటు కోసం గతంలోనే పోటీ జరిగింది. కర్ణాటక శాసనసభకు 2023 మే 10న శాసనసభ ఎన్నికలు జరిగాయి. 2023 మే 13న ఫలితాలు వెల్లడించారు. ఆ తరువాత సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా నెగ్గారు. అయితే ఈ పదవికి గట్టి పోటీదారుగా నిలిచిన కర్ణాటక కాంగ్రెస్ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ ని ఉప ముఖ్యమంత్రిగా చేశారు. రెండేళ్ళ తరువాత ఆయనకు సీఎం సీటు ఇస్తారని ఆనాడు ఒప్పందం జరిగిందని ప్రచారంలోకి వచ్చింది.

ఆ గడువు చూస్తే ఇపుడు దగ్గరకు వచ్చేసింది. దాంతో కర్ణాటక సీఎం గా ఉన్న సిద్ధరామయ్య పదవికి గండం ఉందని అంటున్నారు. మరో వైపు చూస్తే సిద్ధరామయ్య మంత్రులతో ఎమ్మెల్యేలతో మాట్లాడుతూండడం భేటీలు వేయడంతో కర్ణాటక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

ఇంకో వైపు సీఎం పదవి విషయంలో డీకే శివకుమార్ ఏమీ తొందర పడటం లేదని ఆయన వర్గీయులు అనుచరులు చెబుతున్నారు. ఆయనకు పదవి న్యాయంగా రావాలసిన టైం లో వస్తుందని అంటున్నారు. సిద్ధరామయ్య పాలన చూస్తే అనుకున్నంతగా లేదని అంటున్నారు. కర్ణాటక లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ సీట్లు దక్కుంచుకుంది. బలపడింది.

ఇంకో వైపు ముడా కుంభ కోణం విషయంలో సీఎం సిద్దరామయ్య ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రమేయం ఉన్న ముడా కుంభకోణం కేసులో లోకాయుక్త విచారణపై స్టే ఎత్తివేసిన కర్ణాటక హైకోర్టు బుధవారం విచారణను కొనసాగించాలని ఆదేశించింది. జనవరి 27లోగా లోకాయుక్త నుంచి హైకోర్టు నివేదిక కోరింది. దాంతో పాటుగా ఇప్పటి వరకు సేకరించిన అన్ని పత్రాలను రేపటిలోగా సమర్పించాలని లోకాయుక్తను కోరింది.

దీంతో ఈ కేసులో చాలా సీరియస్ గానే అంతా సాగుతోంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా సిద్ధరామయ్య సీఎం సీటు మీద అనుమానాలు ముసురుకుంటున్నాయని అంటున్నారు. మరో వైపు మూడేళ్ళ కాలపరిమితితో డీకే శివ కుమార్ కి కర్ణాటక బాధ్యతలు అప్పగిస్తే ఆయన మళ్లీ పార్టీని ఒక గాటిన పెడతారు అని కాంగ్రెస్ అధినాయకత్వం ఆశిస్తోందని కూడా చర్చ సాగుతోంది.

ఇవన్నీ చూస్తూంటే సిద్ధరామయ్య మార్చి తరువాత తప్పుకుంటారని అంటున్నారు. మార్చి నెలలో బడ్జెట్ సెషన్ ఉంటుంది. అప్పటివరకూ ఆయన సీఎం గా ఉంటారని ఆ తరువాత డీకే ఆ సీటులోకి వస్తారని అంటున్నారు. మరో వైపు చూస్తే సీఎం సీటు విషయంలో మార్పుల గురించి ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దు అని కాంగ్రెస్ అధినాయకత్వం ఆదేశించినట్లుగా తెలుస్తోంది.