Begin typing your search above and press return to search.

ఖాళీగానే వచ్చేస్తున్న స్టార్‌ లైనర్‌.. వారిద్దరూ అంతరిక్షంలోనేనా?

జూన్‌ 5న వీరిద్దరూ బోయింగ్‌ కంపెనీకి చెందిన స్టార్‌ లైనర్‌ క్యాప్సూల్‌ లో అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లారు.

By:  Tupaki Desk   |   6 Sep 2024 9:22 AM GMT
ఖాళీగానే వచ్చేస్తున్న స్టార్‌ లైనర్‌.. వారిద్దరూ అంతరిక్షంలోనేనా?
X

అమెరికా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ అంతరిక్ష కేంద్రం (స్పేస్‌ స్టేషన్‌)లోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. జూన్‌ 5న వీరిద్దరూ బోయింగ్‌ కంపెనీకి చెందిన స్టార్‌ లైనర్‌ క్యాప్సూల్‌ లో అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లారు. తిరిగి అప్పటి నుంచి ఎనిమిది రోజుల్లో భూమికి తిరిగి వచ్చేయాల్సి ఉండగా స్టార్‌ లైనర్‌ వైఫల్యంతో సునీతా విలియమ్స్, బుల్‌ విల్మోర్‌ అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు.

కాగా సునీత విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ లను అంతరిక్ష కేంద్రానికి చేర్చడంలోనూ స్టార్‌ లైనర్‌ క్యాప్యూల్‌ తీవ్ర ఇబ్బందులు పెట్టింది. పలు సాంకేతిక సమస్యలు దాన్ని చుట్టుముట్టాయి. దీంతో సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో స్టార్‌ లైనర్‌ క్యాప్యూల్‌ ఒంటరిగానే అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగొచ్చేస్తోంది. అమెరికా కాలమానం ప్రకారం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెంబర్‌ 6 సాయంత్రం బయలుదేరుతుంది. దీంతో సునీతా విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ మరికొన్నాళ్లు అంతరిక్ష కేంద్రంలో ఉండక తప్పడం లేదు.

అంతరిక్ష కేంద్రం నుంచి తిరిగొస్తున్న స్టార్‌ లైనర్‌ క్యాప్సూల్‌ అంతా సవ్యంగా జరిగితే న్యూమెక్సికోలోని వైట్‌ సాండ్స్‌ మిస్పైల్‌ రేంజ్‌ లో దిగుతుంది. ఎవరూ లేకుండా ఆటో పైలట్‌ మోడ్‌ లో వెనక్కి తిరిగొస్తుంది.

పలు పరీక్షలు చేపట్టాక స్టార్‌ లైనర్‌ క్యాప్సూల్‌ సునీత విలియమ్స్, బుచ్‌ విల్మోర్‌ లను తీసుకురావడానికి అనుకూలం కాదని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నిర్ధారించింది.

ఈ క్రమంలో అంతరిక్ష కేంద్రంలోకి సెప్టెంబర్‌ ద్వితీయార్ధంలో స్పేస్‌ ఎక్స్‌ కు చెందిన డ్రాగన్‌ క్యాప్యూల్‌ వెళ్లనుంది. ఇందులో సాధారణంగా నలుగురు వ్యోమగాములు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. అయితే సునీత, విల్మోర్‌ లను తీసుకురావడానికి డ్రాగన్‌ క్యాప్సూల్‌ లో ఇద్దరినే పంపుతున్నారు.

ఈ నేపథ్యంలో డ్రాగన్‌ క్యాప్సూల్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీత, విల్మోర్‌ లను తీసుకొని వెనక్కి వస్తుంది. డ్రాగన్‌ ల్యాండ్‌ కావడానికి వీలుగా స్టార్‌ లైనర్‌ క్యాప్సూల్‌ ను అంతరిక్ష కేంద్రంలో ఖాళీ చేస్తున్నారు.

కాగా బోయింగ్‌ కు స్టార్‌ లైనర్‌ క్యాప్సూలే తొలి అంతరిక్ష ప్రయోగం కావడం గమనార్హం. ఇందులో థ్రస్టర్లు ఆగిపోయి చికాకు పెట్టడం, హీలియం లీక్‌ తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది రోజుల తర్వాత రావాల్సిన సునీత, విల్మోర్‌ అక్కడే చిక్కుకుపోయారు. వారిద్దరూ వచ్చే ఫిబ్రవరి వరకు భూమికి తిరిగొచ్చే అవకాశం లేకపోవడంతో వారి ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. ముఖ్యంగా సునీత ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది.