వైసీపీకి మరో 'మేడమ్' గుడ్ బై.. మంతనాలు షురూ!
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడిన దరిమిలా.. ఆమె వెళ్లిపోతారని అందరూ అనుకున్నారు.
By: Tupaki Desk | 24 Oct 2024 12:30 AM GMTవైసీపీ నుంచి నేతలు జారి పోతున్నారు. తమ దారితాము చూసుకుంటున్నారు. బుధవారం ఎవరూ ఊహించని విధంగా వైసీపీ సీనియర్ నాయకుడు, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపికి రాం రాం చెప్పారు. అయితే.. ఆమె కేవలం బయటకు రాలేదు. భారీ రాళ్లనే జగన్‌పైకి సంధించారు. సరే.. ఈ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు గుంటూరు జిల్లాకు చెందిన మరో కీలక నాయకురాలు, ఎస్సీసామాజిక వర్గానికి చెందిన నేత.. జగన్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడిన దరిమిలా.. ఆమె వెళ్లిపోతారని అందరూ అనుకున్నారు.
కానీ, ఎందుకో .. ఎక్కడో కొంత సమయం వేచి చూశారు. వేచి ఉన్నారు. కానీ, ఇప్పుడు సమయం చేరువైంది. పార్టీ మారేందుకు రంగం రెడీ అయింది. ఆమే.,. వైసీపీ ముఖ్య నాయకురాలు, జగన్ అంటే తమ కుటుంబానికి ఆరాధ్యదైవం అని కుటుంబ సమే తంగా మీడియా ముందుకు నొక్కివక్కాణించిన మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత. ఈమె కూడా వైసీపీకి గుడ్ బై చెప్పను న్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సుచరిత.. తర్వాత.. జగన్ వెంట నడిచారు. వారి ఇంట్లో ఒక మనిషిగా.. ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిగా కూడా మారారు.
ఈ విషయాన్ని సుచరిత కుటుంబమే అనేక సందర్భాల్లో చెప్పుకొంది. అయితే.. రాజకీయాలు రాజకీయాలే కాబట్టి..ఎవరికి ఉండే ప్రాధాన్యం వారికి ఉంటుంది.. కాబట్టి గత మూడేళ్లు గా కూడా.. జగన్‌పై ప్రేమ తగ్గుతూ వచ్చింది. తొలి హోం మంత్రిగా ఎస్సీ నాయకురాలిగా ఉన్న సుచరితకు జగన్ అవకాశం ఇచ్చారు. అయితే, రెండున్నరేళ్లకు ఆమెను తొలగించి.. మరో ఎస్సీ నాయకురాలికి ఇదే పదవి ఇవ్వడాన్ని సుచరిత జీర్ణించుకోలేక పోయారు. అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక, ఎన్నికల సమయానికి.. మరింత గ్యాప్ పెరిగింది.
ఏకంగా సుచరితను ఆమె సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు నుంచి గుంటూరులోని తాడికొండ నియోజకవర్గానికి మార్చారు. తొలుత అసలు టికెట్ తీసుకునేందుకు కూడా సుచరిత మొగ్గు చూపలేదు. ఆ సమయంలో ఓ కీలక పార్టీలోకి మారేందుకు ప్రయత్నించారు. అయితే.. భర్త సూచనలతో పార్టీలో కొనసాగారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సుచరిత ఘోరంగా ఓడిపోయా రు. తర్వాత నుంచి సుచరిత పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె ఓ కీలక పార్టీతో చర్చలు జరుపుతున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీ అధినేత, ప్రభుత్వంలో కీలక పాత్రలో ఉన్న నాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఆమె త్వరలోనే పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది.