అమరావతికి క్యూ కడుతున్న తాజ్, ఒబెరాయ్!
కూటమి సారథి,సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాత నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ప్రఖ్యాత సంస్థలు రాజధానికి వస్తున్నాయి.
By: Tupaki Desk | 11 Dec 2024 7:30 PM GMTదేశంలోనే అత్యంత ప్రఖ్యాతి పొందిన హోటళ్లు ఏవైనా ఉన్నాయంటే అవి తాజ్, ఒబెరాయ్ హోటళ్లే! ప్రపంచ ప్రఖ్యాత అధునాతన వసతులతో ఆతిధ్య రంగానికే తలమానికంగా నిలిచే ఈ హోటళ్లకు పెద్ద పేరేఉంది. అటువంటి హోటళ్లు.. ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతికి 'క్యూ' కడుతున్నాయి. కూటమి సారథి,సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాత నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ప్రఖ్యాత సంస్థలు రాజధానికి వస్తున్నాయి. ఇప్పటికే ప్రఖ్యాత విద్యాసంస్థలు, వైద్య సంస్థలు కూడా రాజధానిలో నిర్మాణాలకు రెడీ అయ్యాయి.
ప్రస్తుతం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతిని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉండడం.. ఈ పదవీ కాలంలోనే అమరావతి నిర్మాణాలను కంప్లీట్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రధాన సంస్థలు.. ఇప్పుడు రాజధానివైపు చూస్తున్నాయి. ఇప్పటికే రాజధాని నిర్మాణానికి 26 వేల కోట్ల రూపాయలు కేటాయించి నిర్మాణాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో పలు కంపెనీలను ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు.. ఇప్పటికే అమరావతిలో భూములు కేటాయించారు. ఈ పరంపరలో ఇప్పుడు మరికొన్ని టాప్ కంపెనీలు కూడా.. రాజధానిలో ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో తమకు కూడా భూములు కేటాయించాలని కోరుతున్నాయి. వీటిలో రైల్వే విభాగానికి చెందిన ఐఆర్ సీటీసీ, అదేవిధంగా భారత దేశంలో ఆతిథ్య రంగానికి తలమానికంగా ఉన్న ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(తాజ్ గ్రూప్), ఒబెరాయ్, అదేవిధంగా ప్రఖ్యాల రియల్ ఎస్టేట్ కంపెనీ రహేజా వంటివి ఉన్నాయి.
తాజ్ గ్రూప్‌నకు ఇప్పటికే విశాఖ పటనంలో ఒక హోటల్ ఉంది. ఈ క్రమంలో మరో పెద్ద హోటల్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న పనులను గమనిస్తున్న ఈ సంస్థ.. అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా మారుతుందని భావిస్తోంది. దీంతో తమకు కూడా ఇక్కడ స్థలం ఏర్పాటు చేయాలని కోరుతోంది. లగ్జరీ హోటల్‌ను నిర్మించేందుకు వీలుగా 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరినట్టు తెలిసింది.
అదేవిధంగా ఒబెరాయ్ హోటల్స్ కూడా.. అమరావతిపై ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలో తమకు కూడా 10 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరినట్టు తెలిసింది. ఒబెరాయ్ ఇప్పటికే కడప జిల్లాలో పర్యాటక ప్రాజెక్టును నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు తన సంస్థలను అమరావతి వరకు విస్తరించాలని భావిస్తోంది.
ఇక, నిర్మాణ రంగానికి చెందిన రహేజా గ్రూప్ కూడా అమరావతిపై ఆసక్తి చూపుతోంది. జాతీయ, అంతర్జాతీయ ప్రాజెక్టులతో రహేజా గ్రూప్ పేరు మార్మోగుతున్నవిషయం తెలిసిందే. అమరావతిలో తమకు 5 ఎకరాలను కేటాయించాలని.. ఈ నగరం నుంచి తమ కార్యకలాపాలను కొనసాగిస్తామని ఆ సంస్థ సర్కారుకు విన్నవించింది.
అదేవిధంగా ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్ సీటీసీ) కూడా తమకు 3 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరింది. ఈ క్రమంలో ఆయా సంస్థలకు భూములు కేటాయించేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ(సీఆర్ డీఏ) దృష్టి సారించినట్టు తెలిసింది.