గాలి మారుతోంది 'తంబి'.. హోరెత్తిన విజయ్ సభ.. 8 లక్షల మంది హాజరు
అయితే, జయ 2016లో చనిపోయాక అన్నాడీఎంకే వర్గ విభేదాలతో సతమతం అయింది.
By: Tupaki Desk | 28 Oct 2024 12:30 AM GMTతమిళనాడులో రాజకీయ మార్పు తథ్యమా..? మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో రాజకీయ వ్యాక్యూమ్ భారీగా ఉందా..? 50-60 ఏళ్లుగా రెండు పార్టీలను గెలిపిస్తూ..జాతీయ పార్టీలనూ దూరం పెడుతున్న తమిళ ప్రజలు అక్కడి పాలకుల పట్ల విసిగిపోయారా? తమిళుడి ఆలోచన మారుతోందా..? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమే వస్తోంది. 2016లో తప్ప వరుసగా రెండు సార్లు ఒకే పార్టీని ఆదరించని తమిళ తంబీలు.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను కనీసం దగ్గరకు కూడా రానీయని అరవ సోదరులు.. ఈసారి కొత్త ప్రాంతీయ పార్టీని నెత్తికోనున్నారా? అని అనిపిస్తోంది.
గాలి మారుతోందా?
తమిళనాడు అంటే డీఎంకే, అన్నాడీఎంకే. ఒకప్పుడు కరుణానిధి, జయలలిత ఈ రెండు పార్టీల ఐకాన్లు. అయితే, జయ 2016లో చనిపోయాక అన్నాడీఎంకే వర్గ విభేదాలతో సతమతం అయింది. ఇక 2018లో కరుణానిధి మరణంతో డీఎంకే పూర్తిగా ఆయన కుమారుడు స్టాలిన్ చేతిలోకి వచ్చింది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో స్టాలిన్ సీఎం అయ్యారు. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన కూటమి స్వీప్ చేసింది. పాలనాపరంగా పరిస్థితి ఎలా ఉన్నా.. స్టాలిన్ కుమారుడు ఉదయనిధి గత ఏడాది చేసిన సనాతన ధర్మం వ్యతిరేక వ్యాఖ్యలు మాత్రం చెడ్డపేరు తెచ్చాయి.
అన్నా డీఎంకే గమనం ఎటో?
తమిళనాట రెండో ప్రధాన పార్టీ అయిన అన్నాడీఎంకే ఇప్పుడు పన్నీర్ సెల్వం, పళని స్వామి మధ్యన నలిగిపోయింది. పార్టీపై ఎవరికి పట్టు ఉందో తెలియదు కానీ.. బీజేపీకి మాత్రం అన్నాడీఎంకేను గుప్పిట పట్టిందనే విమర్శలున్నాయి. కార్యకర్తలు, అభిమానుల బలం ఉన్నా.. డీఎంకేతో పోలిస్తే బలమైన నాయకత్వం లేకపోవడం అన్నాడీఎంకేకు ఉన్న బలహీనత.
మరి విజయ్ పార్టీ.. వస్తే
తమిళనాడులో సినిమాలకు-రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయ్ కాంత్, కమల్ హాసన్ తదితరులు సినీ రంగం వారేననే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళంలో విపరీతమైన అభిమానుల ఆదరణ ఉన్న హీరో విజయ్ కొత్త పార్టీని స్థాపించారు. ఆదివారం విల్లుపురం జిల్లాలో తన పార్టీ తమిళ వెట్రి కళగం (టీవీకే) తొలి బహిరంగ సభ నిర్వహించారు. దీనికి కనీవిని ఎరుగని రీతిలో 8 లక్షల మంది హాజరైనట్లు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో చూస్తే ఏ పార్టీ సభకూ ఇంతమంది రాలేదనే చెప్పాలి. మరోవైపు విజయ్ విక్రవండీ సభలో వ్యవహరించిన తీరు కూడా ప్రజలను ఆకట్టుకంది. అభిమానులు, కార్యకర్తల మధ్యలోకి వెళ్లేందుకు ర్యాంప్ లు ఏర్పాటు చేశారు. ప్రజలు పార్టీ కండువాలను విసిరేస్తుంటే విజయ్ వాటిని తీసి తన మెడలో వేసుకోవడం కనిపించింది. దీన్నిబట్టే అతడు తన పార్టీ పట్ల సీరియస్ గా ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
6 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు..
తమిళనాడులో 2025 ఏప్రిల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వ్యూహాత్మకంగా వీటికే ప్రాధాన్యం ఇచ్చిన విజయ్.. ఈ ఏడాది మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆదివారం జరిగిన పార్టీ తొలి బహిరంగ సభలో ఆయన పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. దీనిద్వారానే తమిళనాడు ఎన్నికల్లో వచ్చే ఏడాది సంచలనం జరగనుందా? అనిపిస్తోంది.