Begin typing your search above and press return to search.

ఏపీకి 30 జిల్లాలు... టీడీపీ కూటమి కెలుకుతోందా ?

పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలను వైసీపీ చేసినా అందరికీ సంతృప్తి పరచలేకపోయింది.

By:  Tupaki Desk   |   8 Oct 2024 3:59 AM GMT
ఏపీకి 30  జిల్లాలు... టీడీపీ కూటమి కెలుకుతోందా ?
X

ఉన్న సమస్యలు చాలవని కొత్త జిల్లాల వైపు టీడీపీ కూటమి ప్రభుత్వం చూస్తుందా అంటే జవాబు కాదు అనే వస్తుంది. కానీ సోషల్ మీడియాలో చూస్తే ఏపీకి కొత్త జిల్లాలు రాబోతున్నాయని ఉన్న జిల్లాలలో కొన్నింటిని రద్దు చేస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం 26 జిల్లాలు ఉంటే దానికి మరో నాలుగు కలిపి ముప్పయిగా చేస్తారు అని అంటున్నారు

ఏపీలో వైసీపీ ప్రభుత్వం 13 జిల్లాలను రెట్టింపు చేసింది. అయితే ఇందులో శాస్త్రీయత లోపించింది అని విమర్శలు వచ్చాయి. చాలా ప్రాంతాలను జిల్లాలుగా చేయాలని డిమాండ్లూ వచ్చాయి. అయితే వైసీపీ ప్రభుత్వం తాను చేయాలనుకున్నది చేసింది. కానీ అది సెంటిమెంట్ గా ఉంది కాబట్టి కొత్త జిల్లాల వ్యవహారం వైసీపీకి ప్లస్ చేయకపోగా మైనస్ అయింది.

ఇక ఈ రోజుకీ కొత్త జిల్లాలు అని చెప్పడమే కానీ వాటికి తగిన స్టాఫ్ కానీ మౌలిక సదుపాయాలు కానీ లేవు అని అంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలను వైసీపీ చేసినా అందరికీ సంతృప్తి పరచలేకపోయింది. అయితే అప్పట్లో టీడీపీ నేతలు హామీ ఇచ్చారు.

తాము అధికారంలోకి వస్తే ఆ లోపాలను సవరిస్తామని తాము సమగ్రమైన తీరులో జిల్లాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయింది కొత్త జిల్లాల విషయంలో కూటమి ఏమీ మాట్లాడటం లేదు. ఎందుకంటే అది కోరి ముట్టుకుంటే అగ్గి రాజుకుంటుంది అని తెలుసు.

ఎంత చేసినా ఎంత పద్ధతిగా విభజన చేసినా కూడా ప్రాంతం కంటే సెంటిమెంట్ వేరొకటి లేదు. అందువల్ల కొత్త జిల్లాల వ్యవహారం కూడా అలాంటిదే అని టీడీపీలోనూ ఉంది. పైగా కూటమి ఇపుడు అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఈ నేపధ్యంలో కొత్త జిల్లాలతో కోరి తనకే ఇబ్బందులు తెచ్చుకుంటుందా అన్న చర్చ ఉంది.

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఏపీకి ముప్పయి జిల్లాలు అని ప్రచారం చేస్తున్నారు. పాత జిల్లాలలో పోయేవాటిలో అనకాపల్లి ఉందని అంటున్నారు దాంతో అక్కడ ప్రజలు రాజకీయ నేతలు కూడా కలవరపడుతున్నారు.

కొత్తగా అయిదు జిల్లాలను ఏర్పాటు చేస్తారని రెండు జిల్లాలను రద్దు చేస్తారని అంటూ విపరీతంగా ప్రచారం సాగుతోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాలలో అమరావతి జిల్లా, మార్కాపురం జిల్లా, మదనపల్లి, హిందూపురం, అదోని జిల్లాలు ఉంటాయని అంటున్నారు. అనకాపల్లితో పాటు మరో జిల్లాను తీసేస్తారు అని కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు.

దీంతో ప్రభుత్వ వర్గాలు అప్రమత్తం అయ్యాయి. ఫ్యాక్ట్ చెక్ టీం స్పందిస్తూ ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు కానీ ఉన్న జిల్లాల రద్దు కానీ ఏదీ లేదని క్లారిటీ ఇచ్చింది. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలన్నది ఒక సామాన్యుడు ఇచ్చిన సలహాగా అది సోషల్ మీడియా పోస్టుగా ఉందని పేర్కొంది. ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదనలు అయితే లేవు అంది. మొత్తం మీద చూస్తే కొత్త జిల్లాల విషయంలో ప్రభుత్వం ఇప్పట్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయదని అంటున్నారు. అయితే రానున్న కాలంలో ప్రభుత్వం కొంత కుదుట పడిన తరువాత ఏమైనా ఆలోచన చేయవచ్చునేమో అన్నది కూడా ఉంది.