అయిన వారికి ఆకులా? రగులుతున్న తమ్ముళ్లు
ఇదేమీ ఆయన చాటుమాటున అనలేదు. బహిరంగంగా చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 8 Dec 2024 8:30 PM GMTరాజకీయాల్లో కోరింది దక్కాలి. కావాలనుకున్నది జరిగిపోవాలి. పార్టీలకు అతీతంగా ఏ నాయకులైనా కోరుకునేది ఇదే. దీనికి ఎవరినీ మినహాయించాల్సిన అవసరం లేనేలేదు. ఇప్పుడు టీడీపీ అయితే మాత్రం మినహాయింపు ఉంటుందా? ఇదీ.. ఇప్పుడు తమ్ముళ్ల మధ్య జరుగుతున్న చర్చ. అయిన వారికి ఆకుల్లో నూ.. కానివారికి కంచాల్లోనూ పదవులు వడ్డిస్తున్నారన్నది తమ్ముళ్ల మధ్య వినిపిస్తున్న డీటీఎస్ సౌండ్‌తో కూడిన విమర్శలు. విశ్లేషణలు కూడా!
''మేం పదవులు త్యాగం చేస్తాం.. వారు పీఠాలు ఎక్కుతారు'' ఇదీ.. రెండు రోజుల కిందట ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చేసిన వ్యాఖ్య. ఇదేమీ ఆయన చాటుమాటున అనలేదు. బహిరంగంగా చెప్పుకొచ్చారు. దీనికి కారణం.. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఆయనకు సీటును నిరాకరించి.. వేరే వారికి అందునా వైసీపీ నుంచి తెచ్చిపెట్టుకున్నవారికి కేటాయించడమే. పోనీ.. సీటు దక్కని నాయకుడిని సంతృప్తి పరిచే చర్యలు తీసుకున్నారా? అంటే.. అది కూడాలేదు.
ఇక, ఈ తమ్ముళ్ల ఆవేదన తలకోరకంగా ఉంది. అనంతపురంలో చూస్తే.. తమకు లేని ప్రాధాన్యం బీజేపీ నేతలకు ఇస్తున్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. ''ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఉండడో తెలియదు. టీడీపీ ఓడిపోగానే.. తుర్రుమంటూ. మరో పార్టీలోకి వెళ్లాడు. ఇప్పుడు పార్టీ నేతలు..ఆయనకు ఒత్తాసు పలుకుతున్నారు. ఇదీ.. మా పరిస్థితి'' అని ఓ ఫైర్ బ్రాండ్ నాయకుడు చేసిన వ్యాఖ్యలు ఇవి. కేవలం వ్యాఖ్యలతోనే ఆయన సరిపుచ్చలేదు. బహిరంగ లేఖే రాసుకొచ్చారు.
ఇక, ఉత్తరాంధ్రకు వస్తే.. పదవులు దక్కలేదన్న అక్కసు స్పష్టంగా కనిపిస్తోంది. పొరుగు పార్టీలకు ఎక్కువగా ఇచ్చారని చెబుతున్నారు. అయితే.. ఇది పాత ముచ్చటే కదా! అనే పెదవి విరుపు అక్కర్లేదు. తమకు ఏ పని కావాలన్నా.. జరగాల్సిందేనని పట్టుబడుతున్న కొందరు నాయకులు ఆ పనులు జరగకపోయేస రికి ఇలానే వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మహిళా నాయకురాలు చేస్తున్న దూకుడు రాజకీయాలు టీడీపీలోనే అంతర్గత కుమ్ములాటలకు దారి తీస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే.. అయిన వారిగా తమకు ప్రాధాన్యం దక్కడం లేదన్న ఆవేదన అయితే.. తమ్ముళ్లలో కనిపిస్తుండడం గమనార్హం.