టీడీపీలోకి తీన్మార్ మల్లన్న.!?
ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి కొత్త శక్తిని, యుక్తిని యాడ్ చేసి అక్కడా పార్టీని బలోపేతం చేసే దిశగా మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం.
By: Tupaki Desk | 25 Feb 2025 12:30 PM GMT‘రాజకీయాల్లో ఎవరిని ఎక్కడ వాడాలో చంద్రబాబుకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదని రాజకీయ వర్గాల్లో ఓ పెద్ద టాక్ ఉంది. అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు వేసే ఎత్తులు, వ్యూహాలు ప్రత్యర్థుల ఊహకు కూడా అందవు. అసలు తను అంటేనే పడని ఎన్టీఆర్ కూతురు, బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని కలుపుకొని పోయి గత ఎన్నికల్లో సీఎం సీటు సాధించినప్పుడే 'బాబు' గారి తెలివితేటలకు టీడీపీ క్యాడర్ సంతోషపడింది. అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఏమైనా చేయగల ఘనుడు బాబు గారి అని పేరుంది. ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి కొత్త శక్తిని, యుక్తిని యాడ్ చేసి అక్కడా పార్టీని బలోపేతం చేసే దిశగా మాస్టర్ ప్లాన్ వేసినట్టు సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తన సొంత పార్టీపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిణామాలు ఆయన భవిష్యత్తు రాజకీయ ప్రయాణంపై అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. దీంతో, ఆయన తదుపరి రాజకీయ అడుగులు ఎటువైపు ఉంటాయన్నది హాట్ టాపిక్‌గా మారింది.
- టీడీపీ వ్యూహకర్త ఎంట్రీ.. తీన్మార్ మల్లన్నకు ఆహ్వానం?
ఇటీవల, తెలంగాణలో తెలుగు దేశం పార్టీ (టీటీడీపీ) తన రాజకీయ పునరుద్ధరణ కోసం వ్యూహాలను సిద్ధం చేస్తోందని విశ్వసనీయ సమాచారం. ప్రత్యేకించి బీసీ వర్గాలపై టీడీపీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో బీసీ నాయకుడు ఆర్. కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా.. ఆ వ్యూహం పెద్దగా ఫలించలేదు. ఇప్పుడు అదే తరహాలో బీసీ నేత తీన్మార్ మల్లన్నను తెలంగాణ టీడీపీ పగ్గాలు అప్పగించాలని టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
- బీసీ ఉద్యమం.. టీడీపీ లెక్కలు
తెలంగాణలో బీసీ ఉద్యమం మరోసారి ఊపందుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు టీడీపీ ప్రత్యేక వ్యూహాన్ని రచిస్తోంది. బీసీ వర్గాల్లో టీడీపీకి కొంతమేర సానుభూతి ఉండటం, అదే అదనుగా తీసుకుని మల్లన్నకు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇవ్వాలనే ఆలోచన కూడా హైకమాండ్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇది ఎంత వరకు నిజం అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
- తీన్మార్ మల్లన్న రాజకీయ భవిష్యత్తుపై ఉత్కంఠ
తీన్మార్ మల్లన్న కాంగ్రెస్‌లో కొనసాగుతారా? లేదా కొత్త పార్టీ స్థాపిస్తారా? లేక టీడీపీలో చేరి భవిష్యత్తు రాజకీయ ప్రయాణం సాగిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మల్లన్న టీడీపీలో చేరితే అది తెలంగాణ రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి తెలంగాణలో బలపడేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు, పరపతి, బలం ఉంది. సో తీన్మార్ మల్లన్న ఓకే అంటే మాత్రం తెలంగాణలోనూ టీడీపీ బలోపేతం అవుతుంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా తీన్మార్ మల్లన్న రాజకీయ అడుగులు తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి.