టి ఫర్ టెస్లా.. రావమ్మా మా రాష్ట్రానికి.. మరి దేశంలో ఏ రాష్ట్రానికి?
అయితే, ఎట్టకేలకు భారత గడ్డపై అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతోంది టెస్లా.
By: Tupaki Desk | 1 March 2025 2:00 AM IST‘టెస్లా కారు'.. అమెరికాలో భారతీయులు అధికంగా ఇష్టపడే కారు.. అలాంటి సూపర్ కారు మరి నేరుగా భారత మార్కెట్లోకి ఎందుకు రావడం లేదు...? అనేది ఇప్పటివరకు సగటు భారతీయులను వేధించిన ప్రశ్న. అయితే, ఎట్టకేలకు భారత గడ్డపై అడుగుపెట్టేందుకు సిద్ధం అవుతోంది టెస్లా. దీనిపై ఇప్పటికే ఏపీలోని కూటమి ప్రభుత్వం పట్టుదలగా ఉంది.
శాటిలైట్ సాయంతో నడిచే సౌలభ్యం.. సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్.. సెల్ఫ్ పార్కింగ్ స్పెషాలిటీ.. తేలికైన డిజైన్ తోనే సూపర్బ్ గా కనిపించే తీరుతో టెస్లా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. విద్యుత్తు కార్ల దిగ్గజంగా ఎదిగింది.
భారత్ లో తయారీ అంటూ మోదీ ప్రభుత్వం నిబంధన విధించడంతో ఇన్నాళ్లూ టెస్లా భారత్ కు రాలేదు. ఇప్పుడు కాస్త మార్గం సుగమమైంది. దీంతో తాజాగా ముంబై, పుణెల్లో ఉద్యోగుల నియామకానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది.
మొదటగా కార్లు దిగుమతి చేసుకుని అమ్మి.. తర్వాత దేశంలో కార్ల అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటు టెస్లా ప్రణాళిక. సీకేడీ (కంప్లీట్‌లీ నాక్డ్ డౌన్) పద్ధతిలో విడిభాగాలు తెచ్చి, భారత్ లో అసెంబుల్ చేసి విక్రయిస్తుందని.. ఆ తర్వాత విడిభాగాలు సహా పూర్తిస్థాయిలో కార్లను భారత్ లోనే ఉత్పత్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన సంస్థ కావడంతో టెస్లా వస్తే ఆ కథే వేరు.. దీంతో టెస్లా రావమ్మా అంటూ భారత దేశంలోని రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.
ఒకవేళ టెస్లా యూనిట్ ఏర్పాటైతే.. ఆ రాష్ట్రానికి ఇతర విద్యుత్తు వాహన సంస్థలు, బ్యాటరీలు, విడిభాగాల ఉత్పత్తి సంస్థలు క్యూ కట్టడం ఖాయం. తద్వారా విద్యుత్తు వాహన రంగంలో కీలకంగా మారి, యువతకు భారీగా ఉద్యోగాలు వస్తాయి.
పారిశ్రామికంగా పేరుగాంచిన మహారాష్ట్ర, తమిళనాడు టెస్లా రేసులో ముందున్నాయని సమాచారం. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కూడా గట్టి పట్టుదలతో కనిపిస్తున్నాయి. టెస్లా రావాలంటే సముద్ర తీర ప్రాంతం ముఖ్యం. అందుకనే తీరం ఉన్న రాష్ట్రాలే రేసులో నిలస్తాయి.
- ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్. భారీ సముద్ర తీరం కలిగి ఉంది. ఇప్పటికే టాప్ సంస్థలను ఆకర్షించింది. ఈ రాష్ట్రంలో ముంద్రా పోర్టు ఉంది. విద్యుత్తు ఓకే అయినా మానవ వనరుల కొరత ఉంది.
-భారత సిలికాన్ వ్యాలీ బెంగళూరును కలిగిన కర్ణాటక కూడా టెస్లా రేసులో ఉంది. టయోటా, వోల్వో వంటి పెద్ద సంస్థలు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ ఉన్నాయి. మంగళూరు పోర్టులో పెద్దగా వసతులు లేకపోవడం మైనస్.
‘భారత డెట్రాయిట్ గా పేరున్న చెన్నైలో ఆటో మొబైల్ సప్లయర్ నెట్‌వర్క్ పెద్దది. అశోక్ లేలాండ్, ఫోర్డ్, రెనో- నిస్సాన్, హ్యుందాయ్.. తదితర కంపెనీల యూనిట్లు ఉన్నాయి.. మానవ వనరుల కొరత లేదు. చెన్నై, ఎన్నోర్ పోర్టుల ద్వారా దిగుమతులు చేసుకోవచ్చు.
మహారాష్ట్ర వంటి పారిశ్రామిక రాష్ట్రం వాహన పరిశ్రమకు సెంటర్ పాయింట్. ముంబై ఆర్థిక రాజధాని కాగా, పుణె ఆటోమొబైల్ కేంద్రం. ముంబై పోర్టు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు ప్లస్ పాయింట్లు కాగా.. భూముల ధర, కార్మిక వ్యయాలు మైనస్.
అతిపెద్ద తీరం ఉన్న ఏపీలో విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం వరకు నాలుగైదు పోర్టులు ఉన్నాయి. టెస్లా కోరుకున్న సదుపాయాలన్నీ అందిస్తే యూనిట్ ఏర్పాటు సులభమే. చెన్నై సమీపంలోని శ్రీసిటీ సెజ్‌లో ఇసుజు కార్ల కంపెనీతో పాటు విడిభాగాల సంస్థలు 15 ఉన్నాయి. చెన్నైలోని కార్ల కంపెనీలకు ఇక్కడి నుంచే విడిభాగాలు వెళ్తున్నాయి. ఈ సమీపంలోనే హీరో ప్లాంటు ఉంది.