ఏపీలో వ్యవస్థలు - అవస్థలు.. ఎందుకిలా..!
గత వైసీపీ హయాంలో వ్యవస్థలు భ్రష్టు పట్టాయని, వాటిని సరిచేస్తున్నామని ఆయన చెబుతు న్నారు.
By: Tupaki Desk | 28 Nov 2024 2:30 PM GMTరాష్ట్రంలో వ్యవస్థలు.. అవస్థలుగా మారాయి. ఈ మాట ఎవరో చెప్పిందికాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వ్యాఖ్యానిస్తున్న మాట. ఏ వ్యవస్థను నమ్మాలో కూడా తెలియడం లేదని ఆయనే చెబుతు న్నారు. గత వైసీపీ హయాంలో వ్యవస్థలు భ్రష్టు పట్టాయని, వాటిని సరిచేస్తున్నామని ఆయన చెబుతు న్నారు. అయితే.. దీనిపై ప్రజాస్వామ్య వాదులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఐడీ విషయం ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. వివాదానికి కూడా దారితీసింది.
తాజాగా మాజీ ఎంపీ, ప్రస్తుత ఉపసభాపతి కె. రఘురామకృష్ణరాజు వ్యవహారంలో పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు..అరెస్టు చేసి కస్టడీలో ఇబ్బందులు పెట్టిన మాజీఏఎస్పీ విజయ్‌పాల్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ప్రస్తుతం జైలుకు తరలించారు. అయితే.. ఈ విచారణలో పాల్ చెప్పిన వివరాల మేరకు.. సీఐడీ ఏకంగా రఘురామను అంత మొందించేందుకు ప్రయత్నించిందన్నది సంచలనం రేపుతున్న విషయం.
ఇది కనుక నిజమే అయితే.. ఒక వ్యవస్థ ఇంతగా దిగజారిపోతుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. సీఐడీ అనేది ప్రభుత్వంలో కీలక భాగం. ప్రజల రక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణకు పూనిక వహించాల్సిన ఈ విభాగం.. సర్కారు పెద్దల ఆశీస్సుల కోసం గాడి తప్పడం నిజంగానే ఆవేదన, ఆందోళన కలిగించే విషయం. ఇదే ఇప్పుడు చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. వ్యవస్థలు ఇలా దారుణ స్థితికి చేరుకోవడం అనేది రాష్ట్రంలో తొలిసారి కావడం.. దీనిని చక్కదిద్దడంచేతుల్లో లేకపోవడం వంటివి బాబును ఇబ్బందికి గురి చేస్తోంది.
ఇదిలావుంటే.. వాస్తవానికి దేశంలోనూ ఇలానే పరిస్థితి ఉండడం గమనార్హం. ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ (ఈడీ) నుంచి సీబీఐ, ఐటీ, కాగ్ సహా అనేక సంస్థలు కూడా గాడి తప్పుతున్నారు. వాస్తవానికి రాజ్యాంగ బద్ధమైన ఈ సంస్థలు తమ కర్తవ్యాలను నిష్కర్షగా పాటించాలి. కానీ, రాజకీయ నేతలు.. అధికారంలోఉన్నవారు చెబుతున్న ప్రకారం ఆడుతూ.. ఇబ్బందులకు గురి చేయడం..అక్రమ కేసులు పెట్టడం వంటివి ప్రజాస్వామ్య స్ఫూర్తికి.. రాజ్యాంగానికి కూడా విఘాతం కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఈ వ్యవస్థలను గాడిలో పెట్టే విషయంపై దృష్టి సారించడం పట్ల మేధావులు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు.