అధ్యక్ష ఎన్నికల వేళ.. ప్రతినిధుల సభకు మనోళ్లు 9 మంది పోటీ
ఇదే ప్రశ్నను ట్రంప్ నే నేరుగా మీడియా అడిగేయటంలోనే విషయం అర్థమవుతుంది
By: Tupaki Desk | 6 Nov 2024 4:23 AM GMTయావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఫలితం ఎలా ఉంటుందన్న టెన్షన్ బరిలో ఉన్న వారి నుంచి.. ఈ ఎన్నికలతో ఏ మాత్రం సంబంధం లేకుండా చూస్తున్న ప్రపంచ ప్రజల్లోనూ నెలకంది. ఎన్నికల పలితాల మీద ఇప్పటివరకు నెలకొన్న అంచనాలు చూస్తే.. ఫలితం మధ్య వ్యత్యాసం చాలా స్వల్పంగా ఉంటుందన్న మాట బలంగా వినిపిస్తోంది.
అదే సమయంలో ఈసారి ఎన్నికల్లో ట్రంప్ ఓటమి పాలైతే.. గత ఎన్నికల్లో మాదిరి హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటాయా? అన్నది పెద్ద చర్చే నడుస్తోంది. ఇదే ప్రశ్నను ట్రంప్ నే నేరుగా మీడియా అడిగేయటంలోనే విషయం అర్థమవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమెరికా ప్రతినిధుల సభకు జరుగుతున్న ఎన్నికలకు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి ఉంది.
ఈసారి ఈ ఎన్నికల బరిలో 9 మంది భారతీయ అమెరికన్లు పోటీలో ఉన్నారు. అంతేకాదు.. 36 మంది భారతీయ అమెరికన్లు రాష్ట్ర సెనెట్లు.. స్థానిక సంస్థల బరిలో ఉండటం కనిపిస్తుంది. ఇంతకూ ప్రతినిధుల సభకు పోటీ చేస్తున్న భారతీయ అమెరికన్లు చూస్తే..
- సుహాస్ సుబ్రమణియన్ (వర్జీనియా)
- అమీ బెరా (కాలిఫోర్నియా)
- ప్రమీలా జయపాల్ (వాషింగ్టన్)
- రాజా క్రిష్ణమూర్తి (ఇల్లినోయి)
- రో ఖన్నా (కాలిఫోర్నియా)
- శ్రీ థనేదార్ (మిషియన్)
- అమీశ్ షా (ఆరిజోనా)
- ప్రశాంత్ రెడ్డి (కాన్సాస్)
- రాకేశ్ మోహన్ (న్యూజెర్సీ)
ఇదిలా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి మరో ఆసక్తికర అంశాన్ని ఇక్కడ ప్రస్తావించాలి. అధ్యక్ష ఎన్నికల పోటీ హోరాహోరీగా ఉన్న వేళ.. స్వల్ప తేడాతో గెలిచే ప్రతి చోట.. ఫలితం వెల్లడి ఆలస్యం కానుంది. ఎందుకంటే.. స్వల్ప మెజార్టీ ఉన్న ప్రతి చోటా.. ఓడిన అభ్యర్థి రీకౌంటింగ్ కు వెళతారు. ఇక్కడ మరో ఆసక్తికర అంశం ఏమంటే.. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా రీకౌంటింగ్ ప్రొసీజర్ ఉంటుంది. మిషిగన్ లో 2 వేల కంటే తక్కువ తేడా ఉంటే రీకౌంటింగ్ కు ఓకే చెబుతారు. ఓడిన.. గెలిచిన వారి మధ్య ఓట్ల వ్యత్యాసం అర శాతం మాత్రమే తేడా ఉన్నా.. అంతకంటే తక్కువ ఉంటేనే ఆరిజోనాలో ఓడిన అభ్యర్థి అడగకున్నా.. రీకౌంటింగ్ చేస్తారు. పెన్సిల్వేనియాలోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తారు.
ఇక.. ఓడిన అభ్యర్థులు ఎవరైనా సరే.. ఏ పార్టీకి చెందిన వారైనా సరే.. ఎన్నికల పద్దతిని.. ఓటర్లను.. కౌంటింగ్ అధికారులు.. కోర్టుల వద్ద సవాలు చేస్తుంటారు. ఈ కారణంగా కూడా ఫలితం ఆలస్యం అవుతుంది. జార్జియాలో.. అభ్యర్థి కానీ అధికారులో అడిగితేనే రీకౌంటింగ్ కు వెళతారు. ఎక్కడైనా వివాదం చోటు చేసుకొని కోర్టులకు వెళ్లేందుకు వీలుగా.. తమ పార్టీకి సంబంధించిన ఆరు వేల మంది లాయర్లను ట్రంప్ ఎంపిక చోటు చేసుకొని రెఢీగా ఉండటం చూస్తే.. ఎన్నికల ఫలితాన్ని ట్రంప్ ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుంది.