Begin typing your search above and press return to search.

గెలిచినా సుఖమూ దక్కడం లేదట !

పాడేరులో విశ్వేశ్వర రాజు టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై 19,338 ఓట్ల మెజారిటీతో, అరకులో మత్య్సలింగం బీజేపీ అభ్యర్థి రాజారావుపై 31,877 ఓట్ల భారీ మెజారిటితో విజయం సాధించాడు.

By:  Tupaki Desk   |   10 Sep 2024 11:30 PM GMT
గెలిచినా సుఖమూ దక్కడం లేదట !
X

2019 ఎన్నికల్లో 151 శాసనసభ స్థానాలు, 21 లోక్ సభ స్థానాలు గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇటీవల ఎన్నికల్లో 11 శాసనసభ, 4 లోక్ సభ స్థానాలకు పరిమితమై అధంపాతాళానికి పడిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా 11 ఎమ్మెల్యే స్థానాలు గెలవగా అందులో విశాఖ జిల్లా నుండి పాడేరు ఎమ్మెల్యేగా విశ్వేశ్వర రాజు, అరకు ఎమ్మెల్యేగా మత్స్యలింగ్ వైసీపీ నుండి విజయం సాధించారు.

పాడేరులో విశ్వేశ్వర రాజు టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరిపై 19,338 ఓట్ల మెజారిటీతో, అరకులో మత్య్సలింగం బీజేపీ అభ్యర్థి రాజారావుపై 31,877 ఓట్ల భారీ మెజారిటితో విజయం సాధించాడు. అయితే ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచినా పార్టీ అధికారంలో లేకపోవడం, పార్టీ నుండి దిశానిర్దేశం లేకపోవడంతో ఏం చేయాలో తెలీక ఆందోళన చెందుతున్నారట.

సుధీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నా ఇద్దరూ తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో అధికారులతో ఏ పని ఎలా చేయించుకోవాలి ? ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించాలి ? అన్న అవగాహన లేకపోవడంతో ఎన్నికల్లో తమ చేతిలో ఓడిన ప్రత్యర్ధులే నియోజకవర్గంలో హవా చెలాయిస్తున్నారట. అసలు ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం పిలుపు కూడా ఉండడం లేదట.

అసలే గెలిచినా కూడా సుఖం లేదని ఈ ఎమ్మెల్యేలు బాధపడుతుంటే వైసీపీకి సంబంధించిన పార్టీ కార్యాకలాపాల గురించి కూడా వీరికి ఎలాంటి సమాాచారం ఉండడంలేదట. ఇటు ప్రభుత్వం నుండి సమాచారం లేక, పార్టీ నుండి నిర్దేశం లేక ఎమ్మెల్యేలుగా గెలిచాం కాబట్టి తిరగాలి అన్నట్లు అప్పుడప్పుడు ప్రజలను పలకరించి వస్తున్నారట.