Begin typing your search above and press return to search.

దారుణం... దీన్నే నెయ్యి అని చెప్పి అమ్మేస్తున్నారు!

ఈ సమయంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా వెలిసిన కల్తీ నెయ్యి తయారీకేంద్రాల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   24 Sep 2024 4:54 AM GMT
దారుణం... దీన్నే నెయ్యి అని చెప్పి అమ్మేస్తున్నారు!
X

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారనే ఆరోపణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా వెలిసిన కల్తీ నెయ్యి తయారీకేంద్రాల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వీటిలో కల్తీ నెయ్యి తయారీ ఎలా జరుగుతుందనేది తెలిసే ఒక్కసారిగా షాక్ తగలడం కన్ ఫాం అనే చెప్పాలి! కుళ్లిన జంతు వ్యర్థాలతో నెయ్యిలాంటి పదార్థాన్ని తయారు చేస్తూ, వాటిని డబ్బాలో ఫిల్ చేసి, వాటికి పెద్ద పెద్ద కంపెనీల స్టిక్కర్లు అంటించి మార్కెట్ లోకి వదులుతున్నారు. ప్రజల ప్రాణాలతో బంతాట ఆడుకుంటున్నారు!

అయితే ఇంత ఘోరం జరుగుతున్నా పోలీసులకు, అధికారులకూ తెలియదా? అనేది అంత సమాధానం చెప్పలేనంత పెద్ద ప్రశ్నేమీ కాకపోవచ్చు! ఎందుకంటే... ప్రపంచానికి తెలిసిన ఈ దందా వ్యవహారం అధికారులకు తెలియదని ఎలా చెప్పగలం? అయినప్పటికీ యదేఛ్ఛగా ఈ వ్యవహారం జరుగుతుంది!

అవును... జంతు వ్యర్థాలతో కల్తీ నెయ్యి, వంట నూనెలు తయారు చేస్తూ లక్షలాది మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు కొంతమంది వ్యక్తులు! పేరొందిన సంస్థలకు చెందిన నెయ్యిలో వీటిని కల్తీ చేసి పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కూడా ఈ దందా పెద్ద ఎత్తున జరుగుతోందని చెబుతున్నారు.

తయారీ ఇలా!:

జంతువ్యర్థాలను పెద్ద ఎత్తున సేకరించి, ఆ వ్యర్థాలను రెండు రోజుల పాటు అలాగే వదిలేస్తారట. దీంతో... అవి కుల్లిపోతాయి. అలా కుళ్లిన వ్యర్థాలను 3 నుంచి 4 టనుల బాండీల్లో వేసి సుమారు 2 నుంచి 3 రోజులపాటు రేయింబవళ్లు మరిగిస్తారు. దీంతో... ఆ వ్యర్థాల్లోని ఎముకలు, ఇతర పదార్థాలు కరిగి పేస్టు మాదిరిగా తయారవుతుంది.

దీన్ని చల్లార్చి డబ్బాల్లో పోస్తారు. ఆ డబ్బాలపై పేరొందిన కంపెనీల స్టిక్కర్లు అతికించి అమ్మకానికి పంపిస్తున్నారంట. వీటిని కొంతమంది వ్యాపారులు తీసుకుని.. పేరొందిన కంపెనీలు తయారు చేసిన నెయ్యిలో ఈ నకిలీ నెయ్యిని కొంత కలుపుతున్నారు. కల్తీ చేసినట్లు అనుమానం రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

దీంతో... ఈ విషయం తెలియక లక్షల మంది ప్రజానికం ఈ నూనెలు, నెయ్యి వాడుతున్నారు. తమ ఆరోగ్యాన్ని ఆస్పత్రిపాలు చేసుకుంటున్నారు. ఈ కల్తి నూనె, నెయ్యి అత్యంత ప్రమాదం అని ఈ సందర్భంగా వైద్యులు చెబుతున్నారు.

ఇందులో భాగంగా... ఈ కల్తీ నెయ్యి, నూనెలతో చేసిన పదార్థాలను తింటే హార్ట్ అటాక్, పక్షవాతం వంటి సమస్యలతో పాటు పెద్దపేగు క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు! శరీరంలో విష పదార్థాలను వడపోసే కాలేయాన్ని కూడా వీటిలో కలిపే రసాయనాలు దెబ్బ తీస్తాయని చెబుతున్నారు.

ఇవి కిడ్నీల ఫెయిల్యూర్ కి కారణమవుతాయని అంటున్నారు. అయితే ఈ కల్తీ నూనెలను ల్యాబ్ లలో పరీక్షించి మాత్రమే గుర్తించగలమని.. మామూలుగా గుర్తించలేమని చెబుతున్నారు. అందుకే ఏమాత్రం అవకాశం ఉన్నా.. రోడ్లపక్కన, పరిశుభ్రత లేని హోటల్స్ లో తినే అలవాటును మానుకోవాలని సూచిస్తున్నారు.