ప్రపంచంపై మరో 'ప్రపంచ యుద్ధం'.. ఇరాన్ పై ట్రంప్ గురి?
తైవాన్ జోలికి వస్తే సహించేది లేదనేది దాని సిద్ధాంతం.
By: Tupaki Desk | 13 Dec 2024 6:30 PM GMTఇప్పటికే దాదాపు మూడేళ్లుగా సాగుతోంది ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. దీంట్లోకి ఉత్తర కొరియా, యెమెన్ సైనికులు.. 14 నెలలుగా నడుస్తోంది హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం.. దీనికితోడు సిరియాలో ప్రభుత్వం మార్పు.. ఇజ్రాయెల్ పై ఇరాన్ దూకుడు.. తైవాన్ ప్రస్తావన తెచ్చినా చైనా సహించడం లేదు.. దాని చుట్టూ 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా విన్యాసాలు చేసింది.. తైవాన్ జోలికి వస్తే సహించేది లేదనేది దాని సిద్ధాంతం.
ఇవీ ప్రస్తుతం ప్రపంచం ముందున్న సవాళ్లు.. ఇలాంటి సమయంలో మరో యుద్ధం వస్తే..? అది ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం పొంచి ఉంటే..? యుద్ధం ఆపేస్తానని..
‘వారం రోజుల్లో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాన్ని ఆపేస్తా’.. ‘ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ముగించేలా చేస్తా’ ఇవీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు. కానీ, ఆయన గెలిచాక మాత్రం మాట మారుస్తున్నారా? అని అనిపిస్తోంది. తనను గెలిపించిన ‘శాంతి’ ప్రవచనాలను తానే ఉల్లంఘిస్తున్నారు.
ఇరాన్ అంటే రోగ్ కంట్రీ..
అమెరికాకు ఇరాన్ అంటే పడదు. దానిని రోగ్ (ధూర్త) దేశంగా అమెరికా అధ్యక్షులు నిందిస్తుంటారు. ఇక ఇరాన్ పూర్తిగా రష్యాకు మిత్ర దేశం. ఇప్పటికే ఇరాన్ పై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ తో భవిష్యత్తులో యుద్ధం జరిగే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు స్పందించిన ‘ఏదైనా జరగొచ్చు’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు.
టైమ్ మేగజీన్.. ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకు ఎంపిక అనంతరం ఆ మేగజీన్ కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరాన్ విషయంలో భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని.. పరిస్థితులు చాలా అస్థిరంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీ హత్య 2020లో ట్రంప్ హయాంలోనే జరిగింది. ఆయన ఇచ్చిన ఆదేశాలతోనే అమెరికా దళాలు వైమానిక దాడులకు దిగి సులేమానీని హత్య చేశాయనే ఆరోపణ ఉంది. దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్.. ట్రంప్ పై దాడులకు కుట్ర చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఎన్నికల సమయంలో హత్యాయత్నం వెనుక కూడా ఇరాన్ ఉందనే అనుమానాలు వచ్చాయి. దీంతో అమెరికా గట్టి హెచ్చరికలు చేసింది. ట్రంప్ నకు హాని తలపెట్టాలని చూస్తే.. దాన్ని యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా చూస్తామని స్పష్టం చేసింది.
ఇరాన్ జోలికెళ్తే రష్యా సహిస్తుందా?
ఇప్పటికే అమెరికా అంటే అగ్గి మీద గుగ్గిలం అవుతోంది రష్యా. ఇక చిరకాల మిత్ర దేశం ఇరాన్ జోలికివెళ్తే ఊరుకుంటుందా? అనేది చర్చనీయాంశం. బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్ కు దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించే అనుమతివ్వడమే పెద్ద తప్పు అనుకుంటే.. ట్రంప్ వచ్చి ఇరాన్ మీద యుద్ధానికి దిగితే అది ప్రపంచంపై మరో ‘ప్రపంచ యుద్ధం’ అవుతుంది.