కస్టడీలో వైఎస్. విజయమ్మ.. !
ఏ కొడుకు గెలుపుకోసం ప్రచారం చేశారో అదే కొడుకుకు వ్యతిరేకంగా కుమార్తెకు పరోక్షంగా సపోర్ట్ చేశారు.
By: Tupaki Desk | 27 Oct 2024 11:30 PM GMTవైఎస్. విజయలక్ష్మి... దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి సతీమణి.. భర్త బతికి ఉండగా ఆమె ఏనాడు బయటకు రాలేదు.. రోడ్డెక్కలేదు. అలాంటి మహిళ.. భర్త మరణాంతరం తన తనయుడిని ముఖ్యమంత్రిని చేసేందుకు రోడ్డెక్కి పదేళ్లపాటు ఎంతో కష్టపడ్డారు.. ఆమె కోరుకున్నట్టుగానే తనయుడు ముఖ్యమంత్రి అయ్యాడు... తర్వాత కుటుంబంలో విబేధాలు... చివరకు ఎవరు ఔనన్నా.. కాదన్నా విజయలక్ష్మి తనయుడిని కాదని.. తన కుమార్తె షర్మిల పక్షాన నిలబడ్డారు. ఏ కొడుకు గెలుపుకోసం ప్రచారం చేశారో అదే కొడుకుకు వ్యతిరేకంగా కుమార్తెకు పరోక్షంగా సపోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఆస్తుల కోసం అన్న, చెల్లి మధ్య జరుగుతున్న యుద్ధంలో విజయలక్ష్మి కస్టడీ అయిపోయారు.
తన తండ్రి చెప్పిన మాటకు... ఇచ్చిన హామీకు సైతం జగన్ బీటలు కొడుతున్నారని.. మాట తప్పుతున్నారని షర్మిల నొక్కి వక్కాణిస్తున్నారు. అటు వైసీపీ , జగన్ శిబిరం అయితే అసలు షర్మిల చెపుతోన్న మాటల్లో నిజం లేదు... ఆ వాదనలో పసలేదు అంటున్నారు. దీంతో ఈ ఆస్తుల ఎపిసోడ్‌లో ఎవరు చెపుతోంది నిజం.. ఎవరు అబద్ధం చెపుతున్నారు ? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. జగన్, షర్మిలలో ఎవరు తప్పు చేశారు ? లేదా ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు ? అన్నది మరో చర్చ.
అసలు దీనికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది ? అంటే షర్మిల, జగన్ ఇద్దరూ ఎవరి వాదనలు వారు వినిపిస్తారు. ఎవరికి వారు తాము చెప్పిందే నిజం అంటారు. కానీ వీరి తల్లి వైఎస్. విజయలక్ష్మికి అసలు నిజం తెలుసు.. ఆమె నోరు విప్పితే అసలు నిజాలు బయటకు వస్తాయి. కానీ ఇటు తనయ... అటు తనయుడు కావడంతో విజయలక్ష్మి నోరు విప్పడం లేదు. ఆమె మనసంతా కుమార్తె మీదే ఉంది.. కానీ నోరు విప్పలేని పరిస్థితి.
షర్మిల ఇప్పుడు ఫ్రీ మైండ్‌తోనూ.. ఫ్రీ హ్యాండ్‌తోనూ లేరు అన్నది వాస్తవం. ఆమె నోరు విప్పితే కుమార్తె షర్మిలకు అనుకూలంగా మాట్లాడాలి... జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే జగన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది.. ప్రతిపక్షాలకు మంచి విమర్శనాస్త్రం ఇచ్చినట్లవుతుంది.. అలా విజయలక్ష్మి తనకు తాను తెలియకుండానే కస్టడీలో కూరుకుపోయారు.