Begin typing your search above and press return to search.

గవర్నర్ గిరీ మీద విజయసాయిరెడ్డి ఆశలు ?

ఆయన చూపు గవర్నర్ పదవి మీద ఉంది అని ఢిల్లీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   28 Aug 2024 2:37 AM GMT
గవర్నర్ గిరీ మీద విజయసాయిరెడ్డి ఆశలు ?
X

కేంద్ర ప్రభుత్వం వద్ద విశేష పలుకుబడి ఉన్న వారిలో వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి ఒకరు. ఆయన తన పలుకుబడిని పార్టీ కోసం వాడేవారు. అయితే వైసీపీ ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యాక ఆయన కేంద్ర బీజేపీ పెద్దలతో మరింతగా టచ్ లోకి వచ్చారు అని అంటున్నారు. ఆయన చూపు గవర్నర్ పదవి మీద ఉంది అని ఢిల్లీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

విజయసాయిరెడ్డి వైసీపీ విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. అలాంటి విజయసాయిరెడ్డిని వైసీపీ అధికారంలో ఉన్నపుడు అయితే పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేదు. పైగా ఆయనకు ఇచ్చిన ఉత్తరాంధ్రా వైసీపీ ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పించారు.

సొంత పార్టీ వారు ప్రత్యర్ధి టీడీపీతో కలసి పన్నిన ఈ ప్లాన్ లో విజయసాయిరెడ్డిని కార్నర్ చేశారు అని ఆరోపణలు ఉన్నాయి. వైసీపీలో ఒకనాడు నంబర్ టూ గా ఉన్న విజయసాయిరెడ్డి తరువాత కాలంలో మాత్రం తగ్గినట్లే కనిపించారు. ఇక ఎన్నికల వేళ ఆయన నెల్లూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు.

ఆ తరువాత నుంచి ఆయన ఎక్కువగా ఢిల్లీ హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆ మధ్యన ఢిల్లీలో వైసీపీ ధర్నాలో కనిపించారు. ఆయన తాడేపల్లికి రావడం కూడా తగ్గించారు అన్న ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఒక వార్త అయితే జాతీయ స్థాయిలో చక్కర్లు కొడుతోంది. విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల పట్ల విరక్తిని పెంచుకున్నారు అన్నదే ఆ వార్త.

ఆయన రాజ్ భవన్ లోకి వెళ్లాలని అనుకుంటున్నారు అని టాక్. విజయసాయిరెడ్డి అందుకే కేంద్ర పెద్దలతో బాగా టచ్ లోకి వస్తున్నారు అని అంటున్నారు. ఆ మధ్యన వరసగా రెండు సార్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఆయన కలవడం వెనక కూడా ఇలాంటి విషయాలే ఉన్నాయని అంటున్నారు.

ఏపీలో వైసీపీ ఎటూ ఓటమి పాలు అయింది. అయిదేళ్ల తరువాత ఎవరి రాజకీయ జాతకం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. దాంతో పాటుగా విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి తనదైన కొత్త జీవితం గడపాలని అనుకుంటున్నారుట. నిజానికి చూస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభ పదవీ కాలం ఇంకా నాలుగేళ్లు పైగా ఉంది. ఆయన 2022లో రెండోమారు ఎన్నిక అయ్యారు.

ఆయనకు గవర్నర్ పదవి ఇస్తే ఏపీలో ఖాళీ అయ్యే ఆ సీటుని బీజేపీ నుంచి కీలక నేత ఒకరిని ఇప్పించుకోవచ్చు అన్నది కమలనాధుల ఆలోచనగానూ ఉందిట. దాంతో విజయసాయిరెడ్డి కూడా తనకు ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ పదవి ఇస్తే బాగానే ఉంటుందని భావిస్తున్నారుట.

ఆయన వైసీపీకి సంబంధించి పార్లమెంటరీ పార్టీ నాయకుడి పదవి నుంచి కూడా తప్పించబడ్డారు. ఆయన రాజ్యసభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గానే ఉంటున్నారు. దాంతో విజయసాయిరెడ్డి ఎవరినీ నొప్పించకుండా తన దారిలో తాను వెళ్ళాలని చూస్తున్నారు అని అంటున్నారు.

మరి ఈ పుకార్లు కనుక నిజం అయితే విజయసాయిరెడ్డి అత్యంత కీలకమైన పదవి అయిన గవర్నర్ అవుతారు అని అంటున్నారు. వైసీపీ అధినాయకత్వానికి దూరంగానే కాదు టోటల్ రాజకీయాలకే దూరంగా ఉంటూ గవర్నర్ గా తన రాజకీయ చరమాంకాన్ని గడిపేయాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు. మరి అదే వాస్తవం అనుకుంటే విజయసాయిరెడ్డి వంటి నేత లేకుండా వైసీపీని ఊహించడం బహు కష్టం అనే అంటున్నారు.