వలంటీర్ వ్యవస్థపై అసెంబ్లీలో చర్చ!
సోమవారం అసెంబ్లీలో వలంటీర్లపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
By: Tupaki Desk | 17 March 2025 1:27 PM ISTఏపీలో వలంటీర్ వ్యవస్థపై అసెంబ్లీలో మంత్రి డోల బాల వీరాంజనేయస్వామి కీలక ప్రకటన చేశారు. 2023 ఆగస్టు నుంచి రాష్ట్రంలో వలంటీర్లు ఎవరూ లేరని మంత్రి స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం తమను రెగ్యులరైజ్ చేస్తుందని ఇన్నాళ్లు ఆశగా ఎదురుచూసిన వలంటీర్లు ఉసూరుమంటున్నారు. సోమవారం అసెంబ్లీలో వలంటీర్లపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో వలంటీర్లు ఎవరూ లేరని మంత్రి డీబీవీ స్వామి తేల్చిచెప్పారు. 2023 ఆగస్టు వరకే రాష్ట్రంలో వలంటీర్లు సేవలు అందించారని, గత ప్రభుత్వం వారిని కొనసాగంచలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వలంటీర్లు విధుల్లో లేనందున తాము వారిని కొనసాగించలేకపోయామని తెలిపారు. దీంతో వలంటీర్లు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.
గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.50 లక్షల మంది వలంటీర్లు పనిచేసేవారు. నెలకు రూ.5 వేల గౌరవ వేతనం చొప్పున సేవలు అందించిన వీరు పింఛన్ల పంపిణీతోపాటు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వానికి సమర్పించేవారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసిన వలంటీర్ల వ్యవస్థపై అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదే సమయంలో వైసీపీ కార్యకర్తలే వలంటీర్ రూపంలో పనిచేయడం వల్ల ఎన్నికల్లో అక్రమాలు జరిగే అవకాశం ఉందని అప్పటి ప్రతిపక్షం టీడీపీ ఆరోపించేది.
ఎన్నికల కమిషన్ కూడా ప్రతిపక్షం ఆందోళనలను పరిగణలోకి తీసుకుని వలంటీర్లను విధుల నుంచి తప్పించింది. ఇదే సమయంలో వలంటీర్ల వల్ల ఎన్నికల్లో నష్టపోకూడదని భావించిన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతోపాటు రూ.10 వేలు గౌరవ వేతనం చెల్లిస్తామని, ఉన్నత విద్యావంతులైన వలంటీర్లను ఇతర విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ఎన్నికలకు 10 నెలల ముందే వారి సేవలను రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వలంటీర్లను కొనసాగించలేకపోయింది. వలంటీర్లు గతంలో నిర్వహించిన పనులన్నీ ప్రస్తుతం వార్డు, గ్రామ సచివాలయ సిబ్బందితో చేయిస్తున్నారు. ఇక అసెంబ్లీలో వలంటీర్ వ్యవస్థపై మంత్రి ప్రకటన చేయడంతో ఏపీలో వలంటీర్ శకం ముగిసినట్లే భావిస్తున్నారు.