కాకినాడ పోర్టు కేసులో సీఐడీ దూకుడు... జగన్ టార్గెట్ ?
ఈ ఫిర్యాదులో కేవీ రావు చెప్పినదేంటంటే కాకినాడ సీ పోర్టు, సెజ్ లోని 3,609 కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్నారు అని.
By: Tupaki Desk | 5 Dec 2024 12:55 PM GMTకాకినాడ సీ పోర్టు వ్యవహారంలో సీఐడీ వైసీపీ నేతల మీద కేసులు నమోదు చేసిన నేపధ్యంలో ఏపీ మాజీ సీఎం వైసీపీ చీఫ్ జగన్ మీద టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ అధినాయకత్వం చుట్టూనే కాకినాడ పోర్టు వ్యవహారం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కర్నాటి వెంకటేశ్వరరావు అలియాస్ కేవీ రావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదుతో అనేక తెర వెనక విషయాలు ఉన్నాయని అంటున్నారు. ఈ ఫిర్యాదులో కేవీ రావు చెప్పినదేంటంటే కాకినాడ సీ పోర్టు, సెజ్ లోని 3,609 కోట్ల వాటాలు బలవంతంగా లాక్కున్నారు అని.
అంతే కాదు తాము ఇచ్చిన దానిని పుచ్చుకుని సంతకాలు చేయాలని కూడా వైసీపీ నేతలు బెదిరించారు అని కేవీ రావు సీఐడీకి చేసిన ఫిర్యాదులో ఉందని అంటున్నారు. తప్పుడు ఆడిట్ నివేదికతో బెదిరించి వాటాలు అరబిందో పరం చేసుకున్నారని ఆయన ఫిర్యాదులో ఉందని చెబుతున్నారు. ఇలా కాకినాడ పోర్టుతో పాటు సెజ్ లోని 2,609 కోట్ల రూపాయల వాటాను వైసీపీ నేతలు తీసుకోవాలని చూశారంటూ కేవీ రావు చేసిన ఫిర్యాదు మీద సీఐడీ కేసు నమోదు చేసింది అని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ఉన్నారని కూడా ఆ ఫిర్యాదులో కేవీ రావు ఆరోపించారు.
తన కుటుంబం మీద తన మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పి నాటి వైసీపీ నేతలు, ప్రభుత్వ పెద్దలు ఈ విధంగా తన వాటాలను అక్రమంగా రాయించుకున్నారు అని కేవీ రావు పేర్కొన్నారు. దీంతో కాకినాడ సీ పోర్టు ప్రైవేట్ లిమిటెడ్ లో 2,500 కోట్ల విలువైన వాటాలను కేవలం 494 కోట్ల రూపాయలకు, అలాగే సెజ్ లోని 1109 కోట్ల రూపాయల విలువైన వాటాలను వాటాలను బలవంతంగా అరబిందోకు రాయించుకున్నారని కేవీ రావు ఫిర్యాదులో ఉందని చెబుతున్నారు.
దీంతో మొత్తం నిందితుల మీద నేర పూరిత బెదిరింపు (ఐపీసీ 508), బెదిరింపు (ఐపీసీ 384), మోసం (ఐపీసీ 420), నెరానికి ప్రేరేపించడం (ఐపీసీ 109), ఫోర్జనీ (ఐపీసీ 467), నేరపూరిత కుట్ర (120బీ),
వ్యవస్థీకృత నేరం ( ఐపీసీ 111) ల కింద అభియోగాలతో సీఐడీ కేసు నమోదు చేసింది.
ఇక వైఎస్ జగన్ కి వరుసకు సోదరుడు అయిన విక్రాంత్ రెడ్డి, అలాగే వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి, ఆయన అల్లుడు సోదరుడు, అరబిందో సంస్థ ప్రతినిధి పి శరత్ చంద్రారెడ్డి, పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం, ఎల్ ఎల్ పీ ఆడిట్ సంస్థలు, అరబిందో రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని డైరెక్టర్లు ఇతరులను ఈ కేసులో సీఐడీ నిందితులుగా చేర్చింది.
ఇక ఈ కేసులో కేవీ రావు అనేక ఫిర్యాదులు చేశారని అంటున్నారు. జగన్ సీఎం అయ్యాక పోర్టుకు సహకారం ఏ విధంగానూ లేకుండా పోయిందని కూడా పేర్కొన్నారు. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ 2014 నుంచి 2019 మధ్యలో భారీగానే ప్రతీ ఏటా లాభాలు గడించిందని కూడా వెల్లడించారు. ప్రతీ ఏటా 421 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా లాభాలు వచ్చేవని కూడా పేర్కొన్నారు. 2019-2020 నాటికి 240 కోట్ల రూపాయల నగదు నిల్వలు కూడా ఉండేవని కూడా తెలియచేశారు.
అదే విధంగా కాకినాడ సెజ్ కి 8,320 ఎకరాల భూములు కూడా పొన్నాడ, మూలపేట, రమణక్కపేటలలో ఉన్నాయని కూడా తెలిపారు. ఈ క్రమంలో గత వైసీపీ ప్రభుత్వం పోర్టుకు సహకారం అందించకపోగా ఈ విధంగా పోర్టులో వాటా కోసం రాజకీయాన్ని చేసిందని కూడా కేవీ రావు ఫిర్యాదులో పేర్కొన్నారని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఈ కేసులో సీఐడీ పట్టు బిగిస్తోంది. కేవీ రావు సమగ్రంగా చేసిన ఫిర్యాదు మేరకు వైసీపీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డిపై లుక్ ఔట్ సర్క్యులర్ జారీ అయింది. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్‌లోని దాదాపుగా 3600 కోట్ల రూపాయాల్ విలువైన వాటాలను కేవీ రావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాక్కున్నారు అని ఆయన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు దీని మీద కేసు నమోదు చేసింది.
దీంతో విజయసాయితో పాటు ఆయన అల్లుడు శరత్ చంద్రారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డిపై లుక్ ఔట్ సర్క్యూలర్ జారీ చేశారు. భయపెట్టి అత్యధిక శాతం షేర్లను అరబిందో సంస్థ పరం చేశారనేది వీరిపై ప్రధాన అభియోగంగా ఉంది.
మరో వైపు ఈ కేసులో వైసీపీ అధినాయకత్వం మీదనే నేరుగా కేసు నమోదు చేయాలని ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ లో ఏ1 గా ఉండాల్సింది విక్రాంత్ రెడ్డి కాదని మొత్తం వ్యవహారం అంతా వైసీపీ అధినాయకత్వం కనుసన్నలలోనే జరిగాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మొత్తం మీద ఈ కేసు అయితే ఏపీ రాజకీయాల్లో దుమారమే రేపుతోంది.