Begin typing your search above and press return to search.

విశాఖలో వైసీపీకి ఎందుకీ దైన్యం ?

అంత గట్టిగా పట్టు సాధించింది కాబట్టే పసుపు పార్టీకి విశాఖలో ఎదురులేదని అంటారు.

By:  Tupaki Desk   |   19 March 2025 10:30 PM IST
విశాఖలో వైసీపీకి ఎందుకీ దైన్యం ?
X

విశాఖ అంటేనే టీడీపీకి కంచుకోట. అటువంటి చోట వైసీపీ పుట్టాక ఇప్పటిదాకా రాజకీయంగా పైచేయి సాధించింది లేనే లేదు. 2019 ఎన్నికల్లో సైతం వైసీపీ ప్రభంజనం అంతటా బలంగా వీచింది. విశాఖ ఏజెన్సీ, విశాఖ రూరల్ లో మొత్తం సీట్లు వైసీపీ పరం అయ్యాయి. కానీ విశాఖ సిటీలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు మాత్రం టీడీపీ గెలుచుకుంది. అంత గట్టిగా పట్టు సాధించింది కాబట్టే పసుపు పార్టీకి విశాఖలో ఎదురులేదని అంటారు.

ఇక వైసీపీ అయిదేళ్ళ పాటు అధికారాన్ని ఏపీలో చలాయించినా విశాఖలో పట్టు సాధించలేకపోయింది. దానికి తోడు వైసీపీ రాజకీయంగా తప్పుడు వ్యూహాలను అనుసరిస్తూ వచ్చింది. విజయసాయిరెడ్డికి విశాఖ బాధ్యతలు అప్పగించాక ఆయన 2019 ఎన్నికల్లో పార్టీ సిటీలో ఓడినా 2021లో మాత్రం తనదైన వ్యూహాలను రూపొందించి విశాఖ కార్పొరేషన్ ని వైసీపీ పరం అయ్యేలా చూశారు.

దాని కోసం ఆయన సామదాన భేద దండోపాయాలను ఉపయోగించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుపుతో అధిక భాగం క్రెడిట్ విజయసాయిరెడ్డికే ఇవ్వాలని అంటారు. అయితే ఆయనను తప్పించి వైవీ సుబ్బారెడ్డికి ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించాక పార్టీ పూర్తిగా దెబ్బతింది అని అంటారు.

విజయసాయిరెడ్డి తెచ్చి టికెట్లు ఇచ్చి గెలిపించిన కార్పోరేటర్లు నాటి నుంచే పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలవడంతో పెద్ద ఎత్తున అటు వైపుగా వెళ్ళిపోయారు ఇపుడు మరింత మంది కూటమి బాటన నడుస్తున్నారు. దాంతో 2021 ఎన్నికల్లో విశాఖలో వైసీపీ గెలిచిన 58 మంది కార్పోరేటర్లలో సగానికి సగం కూడా ఈ రోజున పార్టీ నిలుపుకోలేక పోతుంది. నానా తంటాలు పడినా వైసీపీలో చాలా మంది కొనసాగేందుకు ఇష్టపడటం లేదు అని అంటున్నారు.

లేటెస్ట్ గా ఉత్తరాంధ్ర ఇంచార్జి కురసాల కన్నబాబు విశాఖలో మీటింగ్ పెడితే పాతిక మంది మాత్రమే వచ్చారు అంటే ఆశ్చర్యపోవాల్సిందే అంటున్నారు ఈ వచ్చిన వారిలో చివరాఖరుకు ఎంతమంది మిగులుతారు అంటే అది కూడా డౌటే అంటున్నారు.

మొదటి నుంచి విశాఖ మీద రాజకీయంగా పట్టు సాధించలేకపోవడం కీలక నేతలను దూరం చూసుకోవడం తప్పుడు వ్యూహాల వల్లనే వైసీపీకి ఈ దుస్థితి వచ్చిందని అంటున్నారు. వైసీపీలో మొదట్లో దివంగత ఎంపీ సబ్బం హరి అండగా ఉండేవారు. ఆయనను పార్టీ నుంచి దూరం చేసుకున్నారు. అలాగే మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వంటి వారు పార్టీకి గుడ్ బై కొట్టారు. సీనియర్ నేతలు అనేక మంది చేరినా వారికి గుర్తింపు లేక వెనక్కి పోయారు.

మరో వైపు చూస్తే వైసీపీలో వర్గ పోరు ఉంది. ఎవరి మధ్యన సామరస్యం లేదు. వారిని కో ఆర్డినేట్ చేసే నాయకత్వం లేదు అని అంటున్నారు. పార్టీ బాధ్యులు ఎంతసేపూ మీడియా మీటింగుల్లో బిజీగా ఉంటున్నారు. కూటమి ప్రభుత్వాని విమర్శిస్తే చాలు అన్నట్లుగా వారి వైఖరి ఉంది. దాంతో కార్పోరేటర్లకు నాయకులకు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేల మధ్య కో ఆర్డినేషన్ మిస్ అవుతుంది.

ఇపుడు కొత్తగా రీజనల్ కో ఆర్డినేటర్ అయిన కన్నబాబు ఎంత ఆరాటపడుతున్నా వైసీపీని సిటీలో చురుకు పుట్టించే అవకాశాలు అయితే పెద్దగా లేవు అని అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం తో పాటు ఆ పార్టీ జిల్లాల బాధ్యులే వైసీపీ తాజా పరిస్థితులకు బాధ్యత వహించాలి తప్పించి ఎవరినీ నిందించినా లాభం లేదని అంటున్నారు. రాను రానూ వెరీ వీక్ గా విశాఖలో వైసీపీ మారుతోంది అంటే ఆత్మ విమర్శ చేసుకోవడమే మార్గమని అంటున్నారు. ఇక విశాఖ మేయర్ పీఠం మీద కూటమి తొందరగా కూర్చునేందుకు రంగం సిద్ధమవుతోంది. వైసీపీ అయితే చేష్టలుడిగి ఇవన్నీ చూడాల్సిందే అని అంటున్నారు.