పోతే పోనీ సతుల్ సుతుల్ హితుల్...వైసీపీలో ఇంతేనా ?
అలాగే జగన్ కి దగ్గర బంధువులు సన్నిహితులు ఆయన వెంటనే ఉన్నారు.
By: Tupaki Desk | 19 Sep 2024 3:53 AM GMTవైసీపీలో చాలా మంది నేతలు బయటకు వెళ్ళిపోతున్నారు. ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ నేతల గుడ్ బై స్లొగన్స్ ఉన్నాయి. 2014 నుంచి 2019 దాకా వైసీపీ విపక్షంలో ఉంది. ఆనాడు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. పార్టీలో చాలా మంది నేతలు వెళ్ళిపోయారు. అలాగే 23 మంది ఎమ్మెల్యేలు అయిదుగురు దాకా ఎంపీలు పార్టీని వీడిపోయారు.
అయితే ఆనాడు వైఎస్సార్ విధేయులు వైసీపీతోనే ఉన్నారు. అలాగే జగన్ కి దగ్గర బంధువులు సన్నిహితులు ఆయన వెంటనే ఉన్నారు. అలా కంచుకోటగా వైసీపీ నిలిచింది.అందుకే 2019లో గెలిచింది. కానీ ఇపుడు చూస్తే సీన్ మారుతోంది. బంధాలు లేవు అని అంటున్నారు. అలాగే వైఎస్సార్ పట్ల విధేయత చూపించిన వారు జగన్ ని ప్రేమించిన వారూ పార్టీ గేటు దాటి వెళ్లిపోతున్నారు. మోపిదేవి వెంకట రమణ పార్టీని వీడుతారు అని ఎవరూ అనుకోలేదు. అది జరిగిపోయింది. అలాగే గోదావరి జిల్లాలో వైసీపీకి వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడు అని పేరు పడిన ఆళ్ళ నాని పార్టీకి గుడ్ బై కొట్టేశారు.
ఇంకో వైపు చూస్తే జగన్ కి దగ్గర బంధువు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీని వీడిపోయారు. జగన్ ఎంతో చనువుగా వాసన్న అని పిలిచే బాలినేని వైసీపీతో ఇమడలేను అని అన్నారు. బంధాలు బంధుత్వాలు వేరు, రాజకీయాలు వేరు అని కూడా క్లారిటీ ఇచ్చారు.
అసలు బాలినేని జగన్ బంధుత్వం అని ఆశ్చర్యపోవడం కంటే ముందు సొంత చెల్లెలు షర్మిల వైసీపీని వీడిపోయారు. పైగా ఎదురు నిలిచి 2024 ఎన్నికల్లో భారీ నష్టం చేకూర్చి వైసీపీ ఓటమిలో కూడా ముఖ్య పాత్ర పోషించారు అని అంతా అంటున్న నేపధ్యం ఉంది.
మరో సోదరి వైఎస్ సునీత ఎన్నికల వేళ చేయాల్సిన ప్రచారం చేసి వైసీపీని తీయాల్సిన దెబ్బ తీశారు. వైసీపీ టైం లో ఎన్నో తుఫానులు వరదలు ఏపీని చుట్టుముట్టినా వరద సాయం చెక్కులు ఇవ్వని సునీతమ్మ చంద్రబాబుకు పది లక్షల చెక్కుని ఇవ్వడం చూసిన వైఎస్సార్ అభిమానులు ఏంటిది అని అనుకున్నారు.
ఇలా రక్త బంధం వీడిన తరువాత దగ్గర బంధం వీడింది అని ఎందుకు గుండెలు బాదుకోవడం అన్న నిర్వేదంతో కూడిన చర్చ కూడా వైసీపీలో ఉంది అని అంటున్నారు. ఇక్కడే సరిగ్గా మహాకవి శ్రీశ్రీ రాసిన కవిత గుర్తుకు వస్తుంది.
అదేంటి అంటే పోనీ, పోనీ,సతుల్, సుతుల్, హితుల్ పోనీ వస్తే రానీ కష్టాల్, నష్టాల్, కోపాల్, తాపాల్, శాపాల్, రానీ తిట్లూ, రాట్లూ, పాట్లూ, రానీ అన్న కవిత. అంతే వైసీపీ ప్రస్తుత స్థితికి ఈ కవిత అద్దం పట్టేలా ఉంది అని అంటున్నారు. చూడాలి మరి రానీ రానీ దీపాల కాంతులు కొత్త వసంతాలు వెలుగు దారులు, పూర్వ వైభవాలు అని కూడా వైసీపీలో ధీమా కూడా కావచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇది ఇంతే.