Begin typing your search above and press return to search.

ఆసక్తికరంగా బిలియనీర్ల ఆలోచనలు, అలవాట్లు!

ఈ నేపథ్యంలో వారికున్న కామన్ అలవాట్లు, నమ్మే సిద్ధాంతాలు, ఎంచుకున్న మార్గాలు ఏమిటనేవి ఇప్పుడు చూద్దాం...!

By:  Tupaki Desk   |   10 July 2024 12:30 AM GMT
ఆసక్తికరంగా బిలియనీర్ల ఆలోచనలు, అలవాట్లు!
X

ప్రపంచ వ్యాప్తంగా జనాభా కొన్ని వందల కోట్లు ఉన్నప్పటికీ... పదుల సంఖ్యలో మాత్రమే బిలియనీర్లుగా ఎదిగారు, ఎదుగుతున్నారు! అందుకు వారు ఎంచుకున్న మార్గాలు, తూ.చ. తప్పకుండా పాటించే మంచి అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవితం, నమ్మే సిద్ధాంతాలు కారణం! ఈ నేపథ్యంలో వారికున్న కామన్ అలవాట్లు, నమ్మే సిద్ధాంతాలు, ఎంచుకున్న మార్గాలు ఏమిటనేవి ఇప్పుడు చూద్దాం...!

అవును... ఓ వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించే స్థాయిలో విజయం సాధించాడంటే అతడికి కచ్చితంగా కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి. ఈ సమయంలో వారు ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఆ మంచి అలవాట్లనే పునాదులుగ చేసుకుని ఉంటారు. ఈ సమయంలో వారి విజయం వెనుక వారి అలవాట్లు, లక్షణాలు, మార్గాలు, సిద్ధాంతాలే కీలక భూమిక పోషిస్తుంటాయి. అలాంటి కొంతమంది సక్సెస్ ఫుల్ పీపుల్ గురించి తెలుస్తుకుందాం...!

ఉదయాన్నే నిద్ర లేవడం!:

చిన్నప్పుడు ఒకటో తరగతిలో స్కూల్లో టీచర్ చెప్పే "మంచి అలవాట్లు" అనే పాఠంలో ఇదీ ఒకటి. అయితే నూటికి అతి తక్కువ శాతం మంది మాత్రం ఈ అలవాటును జీవితాంతం కంటిన్యూ చేస్తారు. ఈ నేపథ్యంలో... అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఉదయం 5 గంటలకే నిద్రలేస్తే... చైనీస్ బిజినెస్ మ్యాగ్నెట్ జాక్ మా, హెడ్జ్ ఫండ్ మేనేజర్ రే డాలియో, మీడియా ఎగ్జిక్యూటివ్ ఆఫ్రా మొదలైన బిలియనీర్లు ఉదయం 6 గంటలకు నిద్ర లేస్తారు.

మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్ గేట్స్, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్స్ మస్క్ లు మాత్రం ఉదయం 7 గంటలకు నిద్ర లేస్తారు. ఇక్కడ ఉదయం నిద్రలేచే సమయమే కాకుండా.. రాత్రి వీలైనంత తొందరగా నిద్రపోవడం కూడా మంచిదని చెబుతుంటారు. ఇది ప్రతీ ఒక్కరూ పాటించాల్సిన అలవాటని చెబుతుంటారు.. మానసిక ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుందని అంటారు. ఫలితంగా బ్రెయిన్ కు విశ్రాంతి దొరుకుతుంది.. దీంతో అది మరింత యాక్టివ్ గా పనిచేస్తుంది.

ప్రతీరోజూ వ్యాయామం చేయడం!:

పైన చెప్పుకున్న బిలియనీర్స్ అందరికీ దాదాపుగా ఇది కామన్ అలవాటు. ఇందులో కొంతమంది ఉదయాన్నే జిమ్ లో వర్క్ అవుట్ చేస్తే.. ఇంకొంతమంది థ్రెడ్ మిల్ పై మైళ్లు మేర వాకింగ్/రన్నింగ్ చేస్తారు! వీరిలో బిల్ గేట్స్ ఉదయం లేవగానే థ్రెడ్ మిల్ కి పని చెబుతుండగా... రే డాలియో, ట్విట్టర్ కో ఫౌండర్ జాక్ డోర్సే లు మెడిటేషన్ చేస్తారు.

అంటే... శారీరక వ్యాయామమా, మానసిక వ్యాయామమా అన్నది ప్రధానం కాదు... వ్యాయామం అనేది ముఖ్యం అన్నమాట. ప్రపంచంలోని బిలియనీర్స్ అందరికీ దాదాపుగా ఈ అలవాటు ఉంది.. రూపం మారితే మారొచ్చు!!

పుస్తకాలు చదవడం!:

ఈ జనరేషన్ పాఠ్య పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు చదివే అలవాట్లు దాదాపుగా మరిచిపోయినట్లు చెప్పే రోజులు ఇవి! అయితే... సాఫ్ట్ కాపీలు చదవడం కంటే.. పుస్తకం రూపంలో అచ్చయిన అక్షారాలను చదవడం మంచి అలవాటని, అవి మస్తిష్కంలో ఎక్కువకాలం నిక్షిప్తమై ఉండటంతోపాటు.. మెదడుకు మంచి వ్యాయామాన్ని కలిగిస్తాయని చెబుతుంటారు.

బిలియనీర్ లలో బిల్ గేట్స్ తాను ఏడాదికి సుమారు 50 పుస్తకాలు చదువుతానని చెబుతుంటారు. ఇలా చదవడం వల్ల ఆ పుస్తకంలోని అంశంపై అవగాహనే కాదు.. మానసిక ఎదుగుదల బాగుంటుందని వివరించారు. బిల్ గేట్స్ మాత్రమే కాదు.. ఎంతో మంది బిలియానీర్లకు పుస్తకం పఠనం అలవాటుగా ఉంది. ఇలా పుస్తకాలు చదివే అలవాటు ఉన్నవారు సమర్థవంతంగా పనిచేస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి.

నిండైన నిద్ర!:

శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో, నీరు, గాలి ఇంకెంత ముఖ్యమో.. నిండైన నిద్ర కూడా అంతే అవసరం. ప్రతీ వ్యక్తీ రాత్రి సుమారు 8 గంటలు తగ్గకుండా నిద్రపోవాలని వైద్యులు చెబుతుంటారు. ఫలితంగా వారి ఆలోచనా శైలి, మానసిక స్పష్టతా అధికంగా ఉంటాయని అంటారు. ఈ ప్రపంచంలోని బిలియనీర్లు ప్రతీ రోజూ ఒకే సమయానికి నిద్రపోయి, ఒకే సమయానికి నిద్రలేవడానికి ప్రయత్నిస్తారంట.

ఫ్యామిలీతో నాణ్యమైన సమయం!:

ఒక మనిషి తన జీవితంలో సక్సెస్ కావడానికి అతని కుటుంబ మద్దతు చాలా అవసరం. ఉదయం లేచిన అనంతరం కాసేపు పిల్లలు, జీవిత భాగస్వామి, మొదలైన కుటుంబ సభ్యులతో కలిసి పనులు షేఋ చేసుకొవడం వంటివి చేయడం మంచి అలవాటు. ఇలా ఫ్యామిలీతో నాణ్యమైన సమయాన్ని గడిపితే ఆ రోజంతా చాలా ఉత్సాహంగా సాగుతుంది.. మానసికంగా సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది.

మీరూ కావొచ్చు బిలియనీర్!:

ఇలా ఈ ప్రపంచంలో బిలియనీర్లుగా ఎదిగిన వారంతా ఇలాంటి మంచి లక్షణాలను కలిగి ఉన్నవారే కాదు.. వాటిని క్రమం తప్పకుండా ఆచరించే అలవాటు ఉన్నవారు కూడా. జీవితంలో మీరు కూడా విజయవంతమైన వ్యక్తిగా ఎదగాలనుకుంటే పైన చెప్పిన అలవాట్లను కొన్ని నెలలపాటు క్రమం తప్పకుండా పాటించి చూడండి.. మీలో వచ్చే మంచి ఫలితాలు, మార్పులను మీరే గమనిస్తారు అని అంటున్నారు నిపుణులు! ఆల్ ది బెస్ట్!!