Begin typing your search above and press return to search.

అమరావతి రాజధాని నిర్మాణానికి కౌంట్ డౌన్

అమరావతి రాజధానిని నిర్మించిన తరువాతనే ఎన్నికలకు వెళ్లాలని కూడా చంద్రబాబు పట్టుదల మీద ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 Aug 2024 1:30 AM GMT
అమరావతి రాజధాని నిర్మాణానికి కౌంట్ డౌన్
X

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కొత్త ప్రభుత్వం తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తున్న సంగతి విధితమే. కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత అమరావతి. ఈ టర్మ్ కంప్లీట్ అయ్యేలోగా అమరావతిని పూర్తి చేయాలని కూడా గట్టిగా నిర్ణయించుకుంది అని అంటున్నారు. అమరావతి రాజధానిని నిర్మించిన తరువాతనే ఎన్నికలకు వెళ్లాలని కూడా చంద్రబాబు పట్టుదల మీద ఉన్నారు.

అందుకే అధికారంలోకి వచ్చిన తరువాత డే వన్ నుంచి ఆయన ఇదే పని మీద ఉన్నారు. ఈ విషయంలో కేంద్ర పెద్దలను ఒప్పించారు. ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని భారీ ఎత్తున పొందగలిగారు. ఇక అమరావతి రాజధాని నిర్మాణానికి వడివడిగానే అడుగులు పడుతున్నాయి.

ఆర్ధికంగా దన్ను ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం పూర్తి సానుకూలంగా ఉండడంతో అమరావతికి పెట్టుబడులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. దానికి తోడు చంద్రబాబు పలుకుబడితో కూడా అనేక పరిశ్రమలకు అమరావతి బాట పట్టనున్నాయి. అమరావతికి ఒక రూట్ వేస్తే చాలు అభివృద్ధి అందుకుంటుంది అన్న అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో అమరావతి రాజధాని మీద మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలే చేశారు. తొందరలోనే రాజధాని పనులు మొదలవుతాయని ఆయన ఒక శుభవార్తను అందించారు. అమరావతి రాజధాని పూర్తికి అరవై వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని నారాయణ చెప్పారు. ఈ మొత్తం నిధులు సరిపోతాయని ఆయన భావిస్తున్నారు.

అయితే గతంలో లక్ష కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి కావాలని గత టీడీపీ ప్రభుత్వం అంచనాలు వేసిన సంగతి విధితమే. ఇపుడు మరో అయిదేళ్ళ కాలం గడచిపోయింది కాబట్టి ఆ అంచనా వ్యయం కూడా భారీగా పెరగాలి. కానీ మంత్రి నారాయణ చెబుతున్న దానిని బట్టి చూస్తే సగానికి సగం బడ్జెట్ తగ్గిపోయింది. మరి దానికి కారణం ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది.

అమరావతికి సంబంధించి గత డిజైన్ల మేరకే ముందుకు సాగుతున్నారా లేక వేరే వారికి ఆ బాధ్యతలు అప్పగించి ప్రభుత్వం తాను అనుకున్న విధంగా నిర్మాణం పనులు పూర్తి చేస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఇంకో వైపు చూస్తే అమరావతిలో అయిదు వందల ఎకరాలతో అతి భారీ పార్క్ ని ఏర్పాటు చేస్తున్నారు. మూడు వందల ఏకరాలతో మరో భారీ పార్క్ ని నిర్మిస్తున్నారు.

అంతే కాదు ఇంకో రెండు భారీ పార్కులకు కూడా డిజైన్లలో చోటు ఇచ్చారు. ఇలా చూస్తే కనుక అమరావతి రాజధాని గ్రీన్ అండ్ క్లీన్ గా కూల్ గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అని అంటున్నారు. అమరావతి విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని కూడా ప్రభుత్వం అంటోంది.

అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీన ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతోంది 2028 డిసెంబర్ నాటికి అమరావతి రాజధాని పూర్తి అవుతుందని నారాయణ మాటలను బట్టి అర్ధం అవుతోంది.

ఏది ఏమైనా అమరావతి రాజధానికి అన్నీ శుభ శకునములే అని కలసి వస్తున్నాయి. దాంతో ఏపీకి నవ రాజధాని నిర్మాణం కావడానికి కౌంట్ డౌన్ మొదలైంది. అంతే కాదు అమరావతిని ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది. దాంతో రానున్న కాలంలో సంపద అంతా అమరావతి నుంచే రావచ్చు. ఏపీకి గ్రోత్ ఇంజన్ అంటే అమరావతి అని చెప్పుకునే రోజు వస్తుందని అంటున్నారు.