నాడు కలవలేదు.. నేడు కలుద్దామన్నా రాలేదు..చిన్న బాస్ కు షాక్
దానికి ఫలితంగా ఇటీవలి ఎన్నికల్లో ఓటమి అనే విశ్లేషణలూ వచ్చాయి.
By: Tupaki Desk | 16 July 2024 12:30 PM GMTపదేళ్ల పాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పై ప్రధానంగా వచ్చిన ఆరోపణ.. ఎమ్మెల్యేలను సీఎంగా ఉన్న కేసీఆర్ కనీసం పట్టించుకోలేదని.. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను కలుద్దామంటే గేట్ల ముందే వెయిట్ చేయించారనే అపవాదును ఎదుర్కొన్నారు. మంత్రులను కూడా కనీసం దగ్గరకు రానీయలేదని.. ఈటల రాజేందర్ వంటి వారు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజా యుద్ధ నౌక గద్దర్, తెలంగాణ ఉద్యమకారుడు కోదండరాం వంటి వారికీ ఇదే పరిస్థితి ఎదురైంది. అయితే, ఓ రాజకీయ పార్టీగా, అందులోనూ ప్రాంతీయ పార్టీగా దాని అధినేతగా కేసీఆర్ ఏం ఆలోచించారో కానీ.. ప్రజా ప్రతినిధులను కనీసం తన నివాసానికి రానీయకపోవడం వివాదాస్పదం అయింది. దీనినే అహంకారంగా ప్రచారం చేశారు. దానికి ఫలితంగా ఇటీవలి ఎన్నికల్లో ఓటమి అనే విశ్లేషణలూ వచ్చాయి. మరిప్పుడు..?
కాలం తిరగబడింది..
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనేందుకు ఇదే నిదర్శనం ఏమో..? అధికారంలోకి ఉండగా.. పార్టీ ప్రజా ప్రతినిధులకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఎమ్మెల్యేలు, నాయకులను కోల్పోతూ దయనీయ స్థితికి చేరుతోంది. అది ఎంతలా అంటే.. ఒకసారి మనం కలుద్దాం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కబురు పెట్టినా ప్రజా ప్రతినిధులు పట్టించుకోనంతగా..? అసలే తెలంగాణలో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎప్పుడు పార్టీ మారుతారో తెలియని పరిస్థితి ఉంది. మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నాటికి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేస్తామంటూ కాంగ్రెస్ దూకుడు చూపుతోంది. ఇలాంటి సమయంలో కొందరు ఎమ్మెల్యేలు కేటీఆర్ కు షాక్ ఇచ్చారు.
స్పీకర్ కు కలిసేందుకు రాం.. రాం..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రొటోకాల్ వివాదం, తమ సభ్యుల ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ స్పీకర్ ను కలవాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు-కేటీఆర్ ఆధ్వర్యంలో స్పీకర్ వద్దకు వెళ్లాలని.. అందరూ ఈ కార్యక్రమానికి రావాలని సమాచారం ఇచ్చారు. కానీ, దీనికి 14 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. సరే.. పార్టీ అధినేత కేసీఆర్ సంగతి వదిలేస్తే.. 13 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదన్న చర్చ సాగుతోంది. మరోవైపు బీఆర్ఎస్ కు 38 మంది ఎమ్మెల్యేలుండగా సోమవారం పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. మిగిలిన 28మందిలో 14 మందే స్పీకర్ ను కలిశారు.
డుమ్మా కొట్టినవారిలో కీలక నేతలు
స్పీకర్ ను కలిసే కార్యక్రమానికి డుమ్మా కొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి ఉండడం గమనార్హం. మరి ఈయన అల్లుడు వెళ్లారా?లేదా? అన్నది తెలియరాలేదు. సహజంగా మల్లారెడ్డి లేనిది ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వెళ్లరు. మరి డుమ్మా కొట్టిన మిగతావారిలో ఎక్కువమంది హైదరాబాద్ నగర ఎమ్మెల్యేలు ఉన్నారా? వీరిపైనే పార్టీ మారుతారనే కథనాలు వస్తున్నాయి. మరిప్పుడు పార్టీ కార్యక్రమానికి గైర్హాజరవడం త్వరలో జంపింగ్ కు సంకేతమా? అసలు వచ్చిన వారిలోనూ ఎవరెవరు ఉంటారు? అన్న చర్చ జోరుగా సాగుతోంది.