ఏపీ తెలంగాణా బాగుపడతాయా ఫ్యూచర్ లో ?
మొత్తానికి చూస్తే సౌత్ ఇండియా స్థాయిలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల విషయంలో మాత్రం కొత్త రికార్డులనే సృష్టిస్తున్నాయని అంటున్నారు.
By: Tupaki Desk | 11 July 2024 4:00 PM GMTఉమ్మడి ఏపీ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఏపీ విభజన తరువాత అనేక సమస్యలతో ఈ రోజుకీ అవస్థలు పడుతోంది. తెలంగాణా ఏపీ అంత కాకున్నా దాని స్థాయిలో ఇబ్బందులు పడుతోంది. మొత్తానికి చూస్తే సౌత్ ఇండియా స్థాయిలో ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అప్పుల విషయంలో మాత్రం కొత్త రికార్డులనే సృష్టిస్తున్నాయని అంటున్నారు.
దానికి కారణం కావాల్సినంత ఆదాయం దక్కించుకుని కూడా అప్పుల కోసం ఎగబాకడం. అప్పులు ఎందుకు తేవాల్సి వస్తోంది అంటే ఉచితాల పేరిట పధకాలను అమలు చేయడం వల్ల అని అంటున్నారు. ఎన్నికల్లో గెలవడానికి పోటీలు పడి మరీ ఇస్తున్న హామీలు కాస్తా ఖజానాకు గుది బండలుగా మారి చివరికి అప్పుల కుప్పగా ఈ రాష్ట్రాలు మారడానికి కారణం అవుతున్నాయని అంటున్నారు.
ఇక దేశంలో చూస్తే అనేక రాష్ట్రాలలో సంక్షేమ పధకాలు పెద్దగా లేవు ఈ రోజుకూ వృద్ధాప్య పెన్షన్లు వేయి రూపాయల కంటే ఎక్కువ ఇవ్వని రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే ప్రతీ చిన్న దానికీ ఉచితం అంటూ అనుచితమైన హామీలు ఇచ్చే పరిస్థితి కూడా వేరే చోట లేదు. అక్కడ అభివృద్ధి మీదనే ఎన్నికలు రాజకీయాలు కొనసాగుతున్నాయని అంటున్నారు.
ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో వెల్ఫేర్ స్కీములు తెలుగు రాష్ట్రాల మాదిరిగా లేవని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే అలవి కాని హామీలు ఇచ్చేశారు. పెన్షన్ల వరకూ వృద్ధులకు ఇవ్వడం ఓకే అనుకున్నా అందులో కూడా అనర్హులు చాలా మంది ఉన్నారు. పైగా ఆ పెన్షన్ పెంపుదల కూడా ఏ రకమైన హేతుబద్ధతకు అవకాశం ఇవ్వడం లేదు.
అలాగే రైతులకు ఎంతైనా చేయాల్సిందే. కానీ రుణ మాఫీ లాంటి భారీ హామీలు ఇవ్వడం తగదని అంటున్నారు. వారికి ఆసరగా ఆర్ధిక పరమైన సహాయం చేస్తే బాగుంటుంది అంటున్నారు. విద్యార్థుల కోసం అమ్మ ఒడి తల్లికి వందనం లాంటి పధకాల వల్ల ఎంతవరకూ డ్రాపౌట్స్ తగ్గాయన్న గణాంకాలు లేవు. చదువు విషయంలో కూడా ఈ రోజులలో అవగాహన జనాలకు పెరిగింది. పైగా చాలా మంది ప్రైవేట్ స్కూళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఈ నేపధ్యంలో ఈ పథకాల వల్ల కొత్తగా ఒరిగేది ఏముంది అన్న చర్చ వస్తోంది. దానికి బదులు ప్రభుత్వ పాఠశాలను మరింత మెరుగ్గా చేసి ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటేనే ఈ రాయితీలు అని కండిషన్లు పెడితే కొంతలో కొంత ప్రయోజనం అంటున్నారు. ఉచిత బస్సులు హామీ కూడా అనవసరమైనదిగానే చూస్తున్నారు.
దాని వల్ల ప్రజా రవాణాకు ఆర్ధికంగా గండి కొట్టడం తప్ప మరేమీ ఒనగూడేది లేదని అంటున్నారు. మహిళలకు18 ఏళ్ళ వయసు నుంచి అరవై ఏళ్ళ వయసు దాకా నెలకు పదిహేను వందలని మరో పధకం పెట్టారు. 18 ఏళ్ల వయసు వారు చదువుకుంటారు. చదువు లేని వారికి వృత్తి పరమైన ప్రోత్సాహం ఇవ్వాలి దాని వల్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇక అరవై దాటితే పెన్షన్ ఎలాగూ ఇవ్వాలి. ఎ మధ్యలో వారికి ఒంటరి మహిళ, వితంతు మహిళలకు పెన్షన్లు ఉన్నాయి. మరి కొత్తగా దీని వల్ల మితిమీరిన బరువు తప్ప మరోటి కానే కాదని అంటున్నారు.
అన్నా క్యాంటీన్లు పధకం కూడా ఆకర్షణీయమైనదిగానే ఉంది. పైగా అయిదు రూపాయలకు ఈ పధకం కింద భోజనం అంటే ప్రభుత్వం మీద సబ్సిడీ భారం వందకు వంద అని వేరేగా చెప్పాల్సింది లేదు. ఈ పధకం ద్వారా ప్రజలను మరింతగా సోమరిపోతులుగా మార్చడం అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అలా కాకుండా నిత్యావసర వస్తువుల ధరలను తగ్గినడం, రేషన్ దుకాణాలలో ఇచ్చే సరుకుల జాబితాను పెంచడం ద్వారా పేదలను ఆదుకోవచ్చు అని అంటున్నారు.
ఇక తెలంగాణా కూడా ఇచ్చే ఉచిత పధకాలు ఖజానాని గుల్ల చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఏదో విధంగా అధికారం దక్కించుకోవాలి అన్న ఆలోచనతో రేపటి భవిష్యత్తుని నేతలు పట్టించుకోవడం లేదు అని అంటున్నారు. అభివృద్ధి చేస్తే అది తరాలుగా అందరికీ అనుభవానికి వస్తుంది అదే పధకం ఇస్తే అది ఆ రోజుకు ఆ నెలకు ఆ మనిషికీ లేదా కుటుంబానికే పరిమితం అయి అక్కడితో ఆగిపోతుంది.
మంది మేలు కోరే కార్యక్రమాలను రాజకీయ పార్టీలు శ్రీకారం చుట్టకపోతే అప్పులతోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఇబ్బందులు పడతాయని అంటున్నారు. ప్రతీ నెలా బటన్ నొక్కి పెన్షన్ అందించడానికి వైసీపీ వేల కోట్ల అప్పులు చేసేది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనూ అప్పులు చేసే ఇచ్చారు. మళ్లీ కొత్త నెల పుడుతోంది. దానికి కూడా అప్పులు చేయల్సి రావచ్చు అంటున్నారు.
ఏది ఏమైనా ఉచితాల మాయలో నుంచి సమాజం బయటపడాలి. రాజకీయ పార్టీలు కూడా వాటి జోలికి పోకూడదు. అపుడే అభివృద్ధి సాధ్యపడుతుంది. మేధావులు సైతం ఉచితాలు ఎప్పటికీ మంచివి కావనే అంటున్నారు. పైగా ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే అది ఆయా పార్టీలకు రాజకీయంగా మేలు చేసేది కాదని అంటున్నారు. ఎన్నో పధకాలను అమలు చేసిన వైసీపీ ఎన్నికల్లో ఓటమి పాలు అయింది అంటేనే అర్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. లేకపోతే ఫ్యూచర్ లో ఏపీ తెలంగాణా ఇబ్బందులు పడతాయని అంటున్నారు.