Begin typing your search above and press return to search.

ఉల్లిగడ్డ... బాబుకు చుట్టుకుంటోందా...

ఉల్లిగడ్డకు బంగాళా దుంపకు తేడా తెలియని సీఎం అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసి పారేసింది.

By:  Tupaki Desk   |   10 Dec 2023 3:00 AM GMT
ఉల్లిగడ్డ... బాబుకు చుట్టుకుంటోందా...
X

ఉల్లిగడ్డ అంటే ఉల్లిపాయ అని అందరికీ తెలుసు. మరి ఉర్లగడ్డ అంటే చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఇది ఒక యాసతో ఉపయోగించే పదం. రాయలసీమలో బంగాళాదుంపలను ఉర్లగడ్డలను అంటారు. ఇక ఇదే బంగాళాదుంపలను వేరే చోట ఆలుగడ్డలు అని కూడా అంటారు. ప్రాంతీయ భాషలో యాస ఉంటుంది.

మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమన్నారు. దాన్ని టీడీపీ ఎలా తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ గా ఏలా చేసింది. ఇవన్నీ ప్రశ్నలే. జగన్ తుపాను బాధిత ప్రాంతాలలో పర్యటనకు వెళ్లారు. తిరుపతి పరిసర ప్రాంతాలలో ఆయన బాధితులతో మాట్లాడుతూ వారికి ప్రభుత్వం నిత్యావసరాలుగా ఏమేమి ఇస్తోందో వివరించే ప్రయత్నంలో పొటాటోని తెలుగులో ఏమంటారు అని పక్క వారిని అడుగుతూ ఉర్లగడ్డ కదా అని అన్నారు.

అయితే దాన్ని టీడీపీ సోషల్ వింగ్ వెంటనే అంది పుచ్చుకుంది. ఉల్లిగడ్డకు బంగాళా దుంపకు తేడా తెలియని సీఎం అంటూ రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేసి పారేసింది. ఇపుడు దాని మీద రాయలసీమ వాసులు గుర్రుమంటున్నారు. జగన్ పక్కా రాయలసీమ వాసి ఆయన అన్నది ఏంటి టీడీపీ ర్యాగింగ్ చేస్తున్నదేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఇపుడు సడెన్ గా మధ్యలోకి రాయలసీమ భాషా పరిరక్షణ సమితి రంగంలోకి వచ్చింది. రాయలసీమ భాష ఎంతో విభిన్నం అయినదని, అలాగే విలక్షణం అయినది అని పేర్కొంది. సీమ భాష తెలుగు ప్రజలకు కూడా ఇష్టం అని అంటోంది.

ఇక సినిమాలు నాటకాలు పుస్తకాలలో కూడా రాయలసీమ యాసకు భాషకు ప్రాధాన్యత ఉందని అలాంటి భాషను యాసను తెలుగుదేశం పార్టీ కావాలనే కించ పరుస్తోంది అని రాయలసీమ భాషా పరిరక్షణ సమితి మండిపడుతోంది. రాయలసీమలో పుట్టి నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటున్న చంద్రబాబుకు ఉర్లగడ్డకు ఉల్లిగడ్డకు తేడా తెలియదా అని అంటోంది.

జగన్ అన్న దాన్ని టీడీపీ ఇలా వక్రీకరించి రాయలసీమ ప్రజలను అవమానపరుస్తోంది అని ఫైర్ అయింది. దీనికి గానూ చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేస్తోంది. భాష గురించి యాస గురించి తెలుసుకోకుండా ఇలా కించపరచడం దారుణం అని కూడా అంటోంది. సీమ ప్రతిష్టను దెబ్బ తీస్తే సహించేది లేదు అని కూడా హెచ్చరిస్తోంది.

చంద్రబాబు బేషరతుగా రాయలసీమ ప్రాంతానికి క్షమాపణలు చెప్పాల్సిందే అని అంటోంది. లేకపోతే టీడీపీకి రాయలసీమలో రాజకీయంగా సమాధి కడతామని కూడా హెచ్చరిస్తోంది. రాయలసీమ దెబ్బ ఏంటో బాబుకు చూపిస్తామని అంటోంది. మొత్తానికి ఉల్లిగడ్డతో టీడీపీకి ఇరకాటం వచ్చింది. చంద్రబాబుకి మొత్తం చుట్టుకుంటోంది. బాబు ఏమి చేస్తారో మరి.