Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కు ఉప ఎన్నికలే ఊపిరి.. మరోసారి ఆ ఆస్త్రం తీస్తే..

2001లో తనను సిద్దిపేటలో ఓడించేందుకు రూ.30 కోట్లు చంద్రబాబు ఖర్చుపెట్టారని కేసీఆర్ ఆరోపించారు కూడా.

By:  Tupaki Desk   |   21 July 2024 2:45 AM GMT
బీఆర్ఎస్ కు ఉప ఎన్నికలే ఊపిరి.. మరోసారి ఆ ఆస్త్రం తీస్తే..
X

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్దండులైన వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబునాయుడు వంటి నాయకులు వెలుగులో ఉండగా.. మరెందరో కీలక నేతలు ఫామ్ లో ఉండగా పుట్టింది తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్). 2001లో ఆ పార్టీ వ్యవస్థాపన సందర్భంగా ఎవరూ తెలంగాణ రాష్ట్రం సాధిస్తుందని ఊహించలేదు. కానీ, 2001లోనే సిద్దిపేట నియోజకవర్గానికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో గెలవడం ద్వారా తెలంగాణ వాదానికి బారసాల చేశారు కేసీఆర్. అలా బీఆర్ఎస్ ఆవిర్భావమే ఉప ఎన్నికతో ముడిపడింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీని ఎదుర్కొని మరీ కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచారు. 2001లో తనను సిద్దిపేటలో ఓడించేందుకు రూ.30 కోట్లు చంద్రబాబు ఖర్చుపెట్టారని కేసీఆర్ ఆరోపించారు కూడా.

2006, 2008, 2010 ఉప ఎన్నికల జోరు

టీఆర్ఎస్ గా ఉండగా.. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది ఆ పార్టీ. అప్పట్లో కేసీఆర్ కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచారు. కానీ.. కాంగ్రెస్ నాయకులు కేకే, కాకా వంటి వాళ్ల సవాల్ తో రాజీనామా చేసి 2006లో ఉప ఎన్నికకు వెళ్లారు. అందులో ఘన విజయం సాధించారు. తెలంగాణ వాదానికి దన్నుకోసం మరోసారి 2008లో ఎమ్మెల్యేలతో కలిసి రాజీనామా చేశారు. నాడు చేదు ఫలితాలు ఎదురైనా తట్టుకున్నారు. 2009లో మహా కూటమిలో టీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్లి భంగపడింది. అయితే, సీఎంగా ఉన్న వైఎస్ మరణంతో పరిస్థితులు మారాయి. 2010లో బీఆర్ఎస్ ఉప ఎన్నికల్లో జయభేరి మోగించి ఉనికి చాటుకుంది. ముఖ్యంగా పరకాలలో కొండా సురేఖను ఓడించింది. ఇక 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక బీఆర్ఎస్ కు మరోసారి ఉద్యమ పథంలో ఉప ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం రాలేదు. 2014లో కేసీఆర్ మెదక్ ఎంపీ స్థానానికి రాజీనామా చేశాక, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరిని ఎమ్మెల్సీని చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. వాటిలోనూ బీఆర్ఎస్ గెలిచింది. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడులోనూ విజయం సాధించింది. హుజూరాబాద్, దుబ్బాక లో ఓడింది.

మళ్లీ ఉప ఎన్నికలు తెస్తే..

2023 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ ఇప్పుడు తెలంగాణలో తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. మరో 16 మందినీ చేర్చుకుని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ మిగిలిన తమ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నిలకు వెళ్తే ఎలా ఉంటుంది.. అందులోనూ ఉప ఎన్నికలు ఆ పార్టీకి బాగా కలిసి వచ్చాయి. కష్ట కాలంలో ఊపిరి పోశాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ ఉప ఎన్నికలకు వెళ్తే..?

కొసమెరుపు: బీఆర్ఎస్ ఉప ఎన్నికలకు వెళ్లినా వెళ్లకపోయినా రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక తప్పదనే పరిస్థితి ఉంది. రైతు రుణమాఫీని పూర్తి చేస్తే తాను రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ కీలక నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రకటించడమే దీనికి కారణం.