మళ్ళీ కండువాల సీజన్ : కాంగ్రెస్ కి టచ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు...?
ఇక ఉన్న ఎమ్మెల్యేలు నికరం అని ఆ మీదట ఎవరూ పార్టీ గోడ దూకరని భావించింది.
By: Tupaki Desk | 20 Aug 2024 10:30 PM GMTశ్రావణ మాసం మంచి ముహూర్తం అని పాడుకుంటూ గులాబీ తోట నుంచి ఖద్దరు నీడకు చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉత్సాహం చూపిస్తున్నారు అన్న ప్రచారం ఊపందుకుంది. ఆషాడ మాసం శూన్య మాసం కావడంతో గత కొంతకాలంగా చేరికలు నిలిచిపోయాయి. దాంతో బీఆర్ఎస్ ఊపిరి పీల్చుకుంది. ఇక ఉన్న ఎమ్మెల్యేలు నికరం అని ఆ మీదట ఎవరూ పార్టీ గోడ దూకరని భావించింది.
అయితే అదంతా తప్పు అని తొందరలో తేలబోయే విధంగా కండువాల కప్పే సీజన్ మొదలవుతుంది అని అంటున్నారు. రేవంత్ రెడ్డి అమెరికాలో చాలా రోజులుగా ఉండడం తో కూడా ఈ జంపింగులు ఆగాయని అంటున్నారు. అదే విధంగా మంచి రోజులూ కూడా లేవని ఆగారట. అంతే తప్ప బీఆర్ఎస్ అధినాయకత్వం చెప్పిన మాటని విని నాలుగేళ్ళ పాటు గప్ చుప్ గా గులాబీ పార్టీలో ఉంటారని పార్టీ కోసం పాటు పడతారని అనుకుంటే పొరపాటే అని అంటున్నారు.
ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నుంచి ఇప్పటిదాకా చూస్తే పది మంది ఎమ్మెల్యేలు, ఎనిమిది మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. అందులో కేసీఆర్ తనకు అత్యంత సన్నిహితులు అని భావించిన పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వారు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ కి 2023 ఎన్నికల్లో 39 సీట్లు వచ్చాయి. అందులో ఒక సీటుకు చెందిన మహిళా ఎమ్మెల్యే మరణంతో 38కి ఆ నెంబర్ చేరింది. ఇందులో నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు.
అంటే ప్రస్తుతం ఉన్న నెంబర్ 28 మాత్రమే. ఈ నంబర్ లో నుంచి మరో ఎనిమిది మంది ఈ శ్రావణ మాసం దాటకుండానే కాంగ్రెస్ పార్టీలో చేరుతారు అని అంటున్నారు. అదే కనుక నిజం అయితే మాత్రం బీఆర్ఎస్ నంబర్ 20కి పడిపోతుంది. ఇది శ్రావణం దెబ్బ అని అంటున్నారు. ఆ తరువాత కూడా ఇదే తీరున చేరికలు కాంగ్రెస్ లో కొనసాగుతాయని అంటున్నారు.
అవి ఎక్కడికి ఆగుతాయంటే ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఇక చూస్తే బీఆర్ఎస్ కి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలీ అంటే 12 మంది ఎమ్మెల్యేలు అవసరం. అంటే మరో తొమ్మిది నుంచి పది మంది ఎమ్మెల్యేలను కూడా లాగేస్తే ఆ హోదా కూడా బీఆర్ఎస్ కి పోతుంది. ఆ విధంగా చేయాలని కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేస్తే మాత్రం గులాబీ పార్టీ కి ముళ్ళు గట్టిగా గుచ్చుకోవడం ఖాయమని అంటున్నారు.
ఇక చేరే వారికి ఒక లాజిక్ ఉంది. అధికార పార్టీలో ఉంటే నాలుగేళ్ళ పాటు తమకు బాగా ఉంటుందని ఆ మీదట ఎన్నికలపుడు చూసుకోవచ్చు అన్నది వారి ఆలోచన. కాంగ్రెస్ లో చేరే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరికీ 2028 ఎన్నికల్లో టికెట్లు రావు అని బీఆర్ ఎస్ నేతలు చెబుతున్నారు. కేసీఆర్ రిస్క్ చెసి మరీ టికెట్లు సిట్టింగులకు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
అలా గులాబీ పార్టీ బ్యానర్ మీద గెలిచిన వారు ఇపుడు ప్లేట్ ఫిరాయించడం తగదని కారు పార్టీ పెద్దలు అంటున్నారు. కానీ ఓడిన పార్టీలో ఉండేందుకు అయిదేళ్ల పాటు ఊడిగం చేసేందుకు ఈ రోజులలో ఎవరూ ఇష్టపడడం లేదు. ఈ రోజు ఈ రోజే రేపటి సంగతి ఆ తరువాత చూసుకోవచ్చు అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే చాలా తొందరలోనే రేవంత్ రెడ్డి కారు పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పే సీన్ ఉంటుందా అంటే ఆ విధంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అదే నిజం అయితే మాత్రం బీఆర్ఎస్ కి గట్టి షాక్ తగలబోతోంది అని అంటున్నారు. ఇపుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య సవాళ్ళూ ప్రతి సవాళ్లతో రాజకీయంగా మాటల యుద్ధం సాగుతోంది. దీనిని కొత్త టర్న్ తిప్పాలన్నా బీఆర్ఎస్ ని మాట్లాడకుండా చేయాలన్నా కండువాలు కప్పడమే బెటర్ అని అనుకుంటే మాత్రం తొందరలోనే ఆ ప్రోగ్రాం స్టార్ట్ అయిపోతుంది అని అంటున్నారు.