'ఆమె'గా మారిన కుమారుడు... అసలు కారణం చెప్పిన మస్క్!
ఈ నేపథ్యంలో నాడు ఈ పరిస్థితికి కారణమైన విషయాలను మస్క్ తాజాగా పంచుకున్నారు.
By: Tupaki Desk | 23 July 2024 5:30 PM GMTఎలాన్ మస్క్.. మాజీ భార్య జస్టిన్ విల్సన్ తో 2008లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటికే మస్క్ – జస్టిన్ దంపతులకు జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్పిన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే వారిలో జేవియర్ అలెగ్జాండర్ కొంతకాలం క్రితం ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారారు. ఈ నేపథ్యంలో నాడు ఈ పరిస్థితికి కారణమైన విషయాలను మస్క్ తాజాగా పంచుకున్నారు.
అవును... ఇటీవల కాలంలో లింగ మార్పిడి చికిత్సలు విరివిగా జరుగుతున్నట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కుమారుడు కూడా ఉన్నాడు. అతడి పేరు.. జేవియర్ అలేగ్జాండర్. ఈ నేపథ్యంలో.. తాజాగా తన కుమారుడు లింగమార్పిడి చేసుకోవడంపై మస్క్ స్పందించారు. "వోక్ మైండ్ వైరస్" వల్లే ఇది జరిగిందని అన్నారు. ఈ ప్రక్రియలను తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా స్పందిస్తూ నాటి సంగతులను పంచుకున్న ఎలాన్ మస్క్... తన కుమారుడు తనను మబ్యపెట్టి లింగమార్పిడికి సంతకం చేయించుకున్నాడని తెలిపారు. అప్పుడు ప్రపంచమంతా కోవిడ్ తో బాధపడుతుండటం వల్ల.. తన మైండ్ అంతా గందరగోళంగా ఉండేదని మస్క్ చెప్పుకున్నారు. అయితే ఆ సమయంలో తన కుమారుడు లింగ మార్పిడి చికిత్సపై తనకు ఆందోళన కలిగించే సమాచారం ఇచ్చారని తెలిపారు.
ఇందులో భాగంగా... అతడు లింగమార్పిడి చేయించుకోకపోతే ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని చెప్పారని.. అలా తనకు మొదటి నుంచీ అబద్ధాలే చెప్పారని మస్క్ తెలిపారు. ఇది చాలా దుర్మార్గమని, ఇలాంటివాటిని ప్రోత్సహిస్తున్నవారిని జైలుకు పంపాలి అంటూ మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రితో కలిసి జీవించకపోవడం వల్ల అతని ఆకారం ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలనే జేవియర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఏమిటీ వోక్ మైండ్ వైరస్?:
వోక్ మైండ్ వైరస్ వల్లే తన కుమారుడు తనకు దూరమైనట్లు మస్క్ చెబుతున్నారు. దీంతో... ఏమిటీ వైరస్ అనే చర్చ తెరపైకి వచ్చింది. సామాజిక సమస్యలకు త్వరగా అట్రాక్ట్ అయ్యి, అతిగా స్పందించడం అనే ఉద్దేశ్యంతోనే మస్క్ ఈ "వోక్ మైండ్ వైరస్" అనే పదాన్ని ఉపయోగించారు.
ఆ సంగతి అలా ఉంటే... తన కుమారుడు జేవియర్ తీసుకున్న నిర్ణయం మస్క్ ను తీవ్రంగా కలిచివేసినట్లు మాత్రం తెలుస్తుంది. ఇందులో భాగంగానే... లింగమార్పిడి హక్కులను పరిమితం చేసే చట్టాలకు మద్దతిస్తోన్న రిపబ్లికన్ పార్టీకి మద్దతిస్తున్నట్లు మస్క్ ప్రకటించారని అంటున్నారు.