Begin typing your search above and press return to search.

చైనాతో భార‌త్‌కు పోటీనా తూచ్‌!!

ప్ర‌ధానంగా చైనా ఇప్ప‌టికే ప్ర‌పంచ స్థాయి క‌ర్మాగారంగా అభివృద్ది చెందింద‌ని ఇన్ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ‌మూర్తి వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   29 July 2024 8:30 AM GMT
చైనాతో భార‌త్‌కు పోటీనా తూచ్‌!!
X

చైనాతో భార‌త్ పోటీ ప‌డుతుంద‌ని.. వ‌చ్చే రెండేళ్ల‌లో చైనాను అధిగ‌మించే స్థాయికి చేరుకుంటామ‌ని.. ఇటీవ‌ల కేంద్రం ప్ర‌వేశ పెట్టిన బ‌డ్జెట్ ప్ర‌సంగంలో మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప‌దే ప‌దే చెప్పుకొచ్చారు. అయితే... ఇప్పుడు ఈ విష‌యంపైనే మేధావి వ‌ర్గాలు.. ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా పెద‌వి విరుస్తున్నాయి. ఎలా చూసుకున్నా.. చైనాతో భార‌త్ పోటీ ప‌డే ప‌రిస్థితి క‌నుచూపు మేర‌లో కూడా లేద‌ని అంటున్నాయి. దీనికి ప‌లు కార‌ణాలు కూడా చెబుతున్నాయి. ప్ర‌స్తుతం చైనా త‌యారీ రంగం.. ప్ర‌పంచ వ్యాప్తంగా విస్త‌రించింద‌ని, దీనిని అందుకుని భార‌త్ ముందుకు సాగి, చైనాను వెన‌క్కి నెట్ట‌డం అంత ఈజీకాద‌ని కొట్టి పారేస్తున్నారు.

ప్ర‌ధానంగా చైనా ఇప్ప‌టికే ప్ర‌పంచ స్థాయి క‌ర్మాగారంగా అభివృద్ది చెందింద‌ని ఇన్ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ‌మూర్తి వెల్ల‌డించారు. అంతేకాదు.. ప్ర‌పంచ దేశాల నాడిప‌ట్టుకున్న చైనా ఎవ‌రికి ఏ అవ‌స‌రమో తెలుసుకుని, ఆయా ఉత్ప‌త్తుల్లో మేటిగా ముందుకు సాగుతోంద‌ని పేర్కొన్నారు. 90 శాతం మేర‌కు ఇప్ప‌టికే ప్ర‌పంచ మార్కెట్‌ను చైనా త‌న అదీనంలోకి తెచ్చుకుంద‌న్నా రు. త‌క్కువ ఖ‌ర్చుతో ఉత్ప‌త్తి సాధించ‌డంలోనూ చైనా ముందుంద‌న్నారు. దీనిని అందిపుచ్చుకోవాలంటే.. బార‌త్ మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు అమ‌లు చేయ‌డంతోపాటు ప‌న్నుల వెసులు బాటు క‌ల్పించాల్సి ఉంద‌ని నారాయ‌ణ మూర్తి స‌హా అనేక మంది దేశీయ వాణిజ్య‌వేత్త‌లు కూడా అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

అలానే.. భార‌త స్థూల జాతీయోత్ప‌త్తితో పోల్చుకుంటే(జీడీపీ) చైనా ఆరు రెట్లు ఎక్కువ‌గా ఉంద‌ని నిపుణులు తెలిపారు. దీనిని చేరుకునేందుకు భార‌త్‌కు 10 నుంచి 20 ఏళ్లు ప‌ట్టినా ఆశ్చ‌ర్యం లేద‌న్నారు. అంతేకాదు.. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ చైనాలో పార‌ద‌ర్శ‌కంగా ఉంద‌న్నారు. ప్ర‌భుత్వానికి జ‌వాబుదారీ త‌నం, స్ప‌ష్ట‌త‌, రాజ‌కీయ దుమారం, ఒత్తిళ్లు, అవినీతి, లంచాలు వంటివి లేని వ్య‌వ‌స్థ ఆదేశంలో కొన‌సాగుతోంద‌న్నారు. ఇలాంటి విష‌యాల్లో భార‌త్ మ‌రిన్ని సంవ‌త్స‌రాలు పోరాటం చేయాల్సిన అవ‌స‌రం, అంత‌ర్గ‌త శ‌త్రువుల‌తోనూ.. అననుకూల‌త‌ల‌తోనూ రాజీ లేని విధంగా ముందుకు సాగాల‌ని సూచిస్తున్నారు.

త‌యారీ రంగంలో స‌ర్కారు జోక్యం త‌గ్గించ‌డంతోపాటు మ‌రిన్ని స‌ర‌ళీక‌ర‌ణ‌లు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న‌ది నిపుణుల మాట‌. అంతేకాదు.. సృజ‌నాత్మ‌క‌త‌కు పెద్ద‌పీట వేయ‌డంతోపాటు.. యువ‌త‌ను భాగ‌స్వామ్యం చేయాల్సి ఉంద‌న్నారు. చైనాలో 62 శాతం మంది యువ‌త త‌యారీ రంగంలో ఉంటే.. ఈ సంఖ్య భార‌త్‌లో 21 శాతంగానే ఉంద‌ని పేర్కొన్నారు. అదేవిధంగా ప్ర‌పంచ మార్కెట్ల‌ను అంచ‌నా వేయ‌డంలోనూ భార‌త్ వెనుక‌బ‌డి ఉంద‌న్నారు. దీనిని అధిగ‌మించ‌కుండా.. జీడీపీ వృద్ధి సాధించ‌డం సాధ్యం కాద‌నే విష‌యాన్ని గుర్తించాల‌ని చెబుతున్నారు. చైనా కూడా మూడు ద‌శాబ్దాల పాటు అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొని ముందుకు సాగుతోంద‌ని.. కాబ‌ట్టి.. చైనాను అధిగ‌మించడం అనే ల‌క్ష్యం మంచిదే అయినా.. దీనిని సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌, దీనికి అనుస‌రించాల్సిన వ్యూహాలు మాత్రం చాలానే ఉన్నాయ‌ని చెబుతున్నారు.