Begin typing your search above and press return to search.

ఆ తీవ్ర కల్లోలిత ప్రాంతంలో నలుగురు భారతీయులు.. రావడం కష్టమే?

నలుగురు ఉన్నారట..?ప్రపంచంలోనే జీవనం అత్యంత కష్టమైన గాజాలో నలుగురు భారతీయులు ఉన్నారట.

By:  Tupaki Desk   |   20 Oct 2023 9:01 AM GMT
ఆ తీవ్ర కల్లోలిత ప్రాంతంలో నలుగురు భారతీయులు.. రావడం కష్టమే?
X

ప్రపంచంలో అత్యంత జన సాంద్రత ఉన్న ప్రదేశం అది.. అత్యంత పేదలు ఉన్న చోటూ అదే.. కిక్కిరిసిన జీవనం.. భయంకర ఉగ్రవాదం కలిసిపోయి ఉంటాయక్కడ. తాగునీరే కాదు.. పిడికెడు బువ్వకూ పొరుగు (శత్రు) దేశంపై ఆధారపడాల్సిందే. ఏదైనా ఉపద్రవం సంభవిస్తే .. ఐక్యరాజ్య సమితి శిబిరాల్లో తలదాచుకోవాల్సిందే. మొత్తానికి అక్కడ నిత్యం ప్రాణభయమే.

ప్రాణం గజగజ ఇజ్రాయెల్ భీకర దాడుల్లో గాజా ప్రాంతం చెల్లాచెదురు అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 7న ఉదయం హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ లోకి చొరబడి మారణకాండకు పాల్పడ్డారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఆ ఉగ్ర సంస్థ.. అత్యంత భీకరంగా దాడి చేయగల ఇజ్రాయెల్ తో తలపడడం అంటే పెద్ద ముప్పే. కానీ, ఇదేమీ లెక్క చేయని హమాస్.. దుస్సాహసానికి ఒడిగట్టింది. ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులతో 13 రోజులుగా తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో?ఇజ్రాయెల్ హెచ్చరికలతో ఉత్తర గాజా నుంచి లక్షలాది మంది ప్రాణాలు అరచేత పట్టుకుని వెళ్లిపోతున్నారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్ తన లక్ష్యాలపై దాడి చేస్తోంది. ఇందులో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే,ఇజ్రాయెల్ లో ఇప్పటివరకు 18 వేల మంది భారతీయులు ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆపరేషన్ అజయ్’ కింద 5 విమానాల్లో 18 మంది నేపాలీ పౌరులు సహా 1,200 మందిని తరలించింది. కాగా, ఇదంతా ఇజ్రాయెల్ లో ఉన్నవారి కథ. సంక్షుభిత గాజాలో ఉన్న భారతీయులు ఎందరు? అనేది ఇప్పటివరకు తెలియరాలేదు.

నలుగురు ఉన్నారట..?ప్రపంచంలోనే జీవనం అత్యంత కష్టమైన గాజాలో నలుగురు భారతీయులు ఉన్నారట. ఈ మేరకు ఇంగ్లిష్ మీడియా గత వారమే పేర్కొంది. తాజాగా దానిని ధ్రువీకరిస్తూ భారత విదేశాంగ శాఖ స్పష్టత ఇచ్చింది. గాజాలో గతంలో నలుగురు భారతీయులు ఉండేవారని.. ప్రస్తుతం ఎందరు ఉన్నారన్న సంఖ్యపై స్పష్టత లేదని చెప్పింది. గాజా నుంచి వారిని తరలించే పరిస్థితి లేదని, అవకాశం దొరికితే బయటకు తీసుకొస్తామని పేర్కొంది.

వెళ్లిపోయినవారిలో ఉన్నారా?గాజాలోని ఈ నలుగురు భారతీయులు ఎలా ఉన్నారన్నదీ చెప్పడం కష్టమే. వారంతట వారు స్పందించి సమాచారం ఇస్తే తప్ప.. యోగ క్షేమాలు కనుక్కోవడం దుర్లభమే. కాగా, ఈ నలుగురూ గాజాలో ఏ ప్రాంతంలో ఉన్నదీ తెలియాల్సి ఉంది. యుద్ధం జరుగుతున్న ఉత్తర గాజాలోనా? కాస్త తేలికపాటి వాతావరణం ఉన్న దక్షిణా గాజాలోనా? అన్నది తెలియాల్సి ఉంది.