Begin typing your search above and press return to search.

అమరావతికి రుణమా... ఆర్ధిక సాయమా ?

ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారం మోసినా అయ్యే పని కాదు, కేంద్రం చేయి చేసుకోవాల్సిందే.

By:  Tupaki Desk   |   23 July 2024 9:07 AM GMT
అమరావతికి రుణమా...  ఆర్ధిక  సాయమా ?
X

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అమరావతికి 15 వేల కోట్ల రూపాయలను ఇస్తున్నట్లుగా ప్రకటించడం మంచి పరిణామం గానే చూస్తున్నారు. గత పదేళ్ళుగా ఏపీకి రాజధాని అన్నది లేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత భారం మోసినా అయ్యే పని కాదు, కేంద్రం చేయి చేసుకోవాల్సిందే.

ఢిల్లీకి మించిన రాజధానిని నిర్మించి ఇస్తామని 2014 ఎన్నికల ముందు ఏపీ అంతా తిరుగుతూ నాటి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. అయితే ఆ తరువాత చూస్తే అమరావతికి శంకుస్థాపన చేయడానికి వచ్చిన మోడీ నీళ్ళు మట్టి ఇచ్చి వెళ్లారని విమర్శలు వెల్లువెత్తాయి.

కేంద్రం అయితే అమరావతికి 2,500 కోట్ల రూపాయలను ఇచ్చామని చెబుతోంది. అయితే ఆ నిధులు ఏ మూలనా సరిపోవు అన్నది తెలిసిందే. అమరావతి రాజధానిని ఏపీ ప్రభుత్వం డిజైన్ చేసిన తీరుని చూస్తే లక్ష కోట్ల దాకా ఖర్చు అవుతాయి. కనీసం తొలి దశ నిర్మాణం పూర్తి కావాలన్నా యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి.

ఈ బడ్జెట్ లో అమరావతికి స్పెషల్ గ్రాంట్స్ కింద ముప్పయి వేల రూపాయలు అయినా ఇస్తారని అంతా అనుకున్నారు. కేంద్రం అందులో సగం నిధులను ప్రకటించింది. అయితే ఈ నిధులు స్పెషల్ గ్రాంట్ గా ఇస్తున్నారా లేక రుణాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారా అన్నది తెలియడం లేదు. తరచి చూస్తే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటనలో వివిధ ఫైనాన్స్ ఏజెన్సీల ద్వారా రుణ సాయాన్ని ఏపీకి అమరావతి కోసం ఇప్పిస్తామని అన్నట్లుగా ఉందని అంటున్నారు.

అంటే ఆ రుణ భారం ఏపీ ప్రభుత్వానిదే అవుతుంది అన్న మాట. రుణ సాయం కింద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, క్రెడిట్ గ్యారంటీ అండ్ కేంద్ర ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీ, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పోరేషన్, మల్టీ లేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటే ఏజెన్సీ ఇలా ప్రపంచ బ్యాంక్ అనుబంధ సంస్థలు చాలానే ఉన్నాయి.

వాటి ద్వారా ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం రుణ సాయం ఇప్పించేందుకే కేంద్రం ఆలోచిస్తోంది అని అంటున్నారు. మరి అదే నిజం అయితే ఏపీ పూర్తిగా అప్పుల పాలు కావడం తప్ప మరోటి ఉండదని అంటున్నారు. పోనీ ఇంత చేసినా ఈ రుణ సాయం అయినా సరిపోతుందా అంటే కానే కాదు అని అంటున్నారు.

మరింత రుణాలను ఏపీ ప్రభుత్వం సొంతంగా చేయాల్సి ఉంటుంది. దాంతో అమరావతి రాజధాని నిర్మాణం అంటే తలకు మించిన భారంగానే ఉండబోతోందా అన్న చర్చ వస్తోంది. ఏపీ అమరావతికి నిధుల వరద పారిస్తోందని ఒక వైపు టీడీపీ మరో వైపు జనసేన సంబరాలు చేసుకుంటున్నాయి.

కేంద్రం మాత్రం ఈ విషయంలో సందిగ్దతతో కూడిన ప్రకటననే చేస్తోంది అని అంటున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలోనే పదిహేను వేల కోట్ల రూపాయలు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఈ నిధులు అమరావతి నిర్మాణానికి ఎంత మేరకు సరిపోతాయన్నది చూడాల్సి ఉంది. అదే సమయంలో అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు అవుతాయని కూడా చెబుతున్నారు. మరి అయిదేళ్ల క్రితం అధికారంలో నుంచి దిగిపోయిన టీడీపీ ప్రభుత్వం ఇపుడు మళ్లీ అమరావతి నిర్మాణానికి పూనుకుంటోంది.

కొత్త అంచనాలలో నిర్మాణం వ్యయం పెరుగుదల ఉంటుంది. దాంతో అమరావతి రాజధాని పరిపూర్తికి ఎంత మేర నిధులు ఖర్చు అవతాయి దానికి కేంద్రం ఇచ్చే సాయం ఎంత అనేది కచ్చితంగా తెలియాల్సి ఉంది. అదే సమయంలో కేంద్రం ప్రత్యేక నిధులు ఆర్ధిక సాయం అన్నది స్పష్టంగా చెబితేనే తప్ప అమరావతికి వరాలు ఇచ్చినట్లుగా అర్ధం కాదు.

ఏది ఏమైనా బడ్జెట్ లో పెట్టే కేటాయింపులు ఆచరణలోకి వచ్చేసరికి ఎన్ని మలుపులు తిరుగుతాయో అందరికీ తెలిసిందే. ప్రస్తుత ఆర్ధిక సంవస్తరంలో నికరంగా మిగిలినది ఏడు నెలలు మాత్రమే. కేంద్రం ఉదారంగా ఏపీ రాజధానికి నిధులు ఇవ్వాలని అనుకుంటే మాత్రం స్పష్టమైన ప్రకటన చేయాలి. ఆ ఇచ్చే నిధులను 2024 ముగియక ముందే కేటాయిస్తేనే అమరావతి పరుగులు తీసేది. ఏది ఏమైనా కేంద్ర బడ్జెట్ లో చెప్పిన విషయాలు కంఫ్యూజన్ గానే ఉన్నాయని అంటున్నారు. రుణమా ఆర్ధిక సాయమా అన్నది స్పష్టంగా తేలాల్సి ఉందని కూడా మేధావులు అంటున్నారు.