సోషల్ మీడియాలో దూసుకుపోతోందా ?
గ్రూపులతో పాటు వార్ రూములను నిర్వహించేవారితో కేటీయార్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటు ఎప్పటికప్పుడు అవసరమైన దిశానిర్దేశం చేస్తున్నారు.
By: Tupaki Desk | 24 Oct 2023 6:16 AM GMTఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంలో దూసుకుపోతోంది. అందుబాటులో ఉన్న ప్రతి సోషల్ మీడియా వేదికను నూరుశాతం ఉపయోగించుకోవాలని మంత్రి కేటీయార్ స్పష్టంగా ఆదేశించారు. ఈ ప్రచారం కూడా రెండు విధాలుగా ఉండాలని చెప్పారు. మొదటిదేమో ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు విస్తృతమైన ప్రచారం కల్పించటం. ఇక రెండో పద్దతేమో ప్రత్యర్ధులపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడటం. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలోను ప్రత్యేకంగా ఒక వార్ రూమ్ ను ఏర్పాటు చేశారు.
అలాగే ప్రతి గ్రామంలోను వీలైనన్ని వాట్సప్ గ్రూపులను ఏర్పాటుచేసి ప్రచారాన్ని మానిటర్ చేయబోతున్నారు. ఈ వార్ రూములకు, సోషల్ మీడియా గ్రూపులను కేంద్ర కమిటితో అనుసంధానం చేశారు. ఈ కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేశారు. 24 గంటలూ అభ్యర్ధుల ప్రచారాన్ని, పార్టీ మద్దతు ప్రచారాన్ని ఇక్కడినుండే పర్యవేక్షించాలని కేటీయార్ డిసైడ్ చేశారు. ఇందుకోసం ప్రత్యేకంగా కేంద్ర కార్యాలయంలో 400 మందితో పెద్ద టీమునే ఏర్పాటుచేశారు.
గ్రూపులతో పాటు వార్ రూములను నిర్వహించేవారితో కేటీయార్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటు ఎప్పటికప్పుడు అవసరమైన దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో కూడా కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రచారం చేయటం కోసం ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాల పనేమిటంటే ఎన్నికల ప్రచారం ముగిసేంతవరకు 24 గంటలూ పై రెండుపార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటమే. వ్యతిరేక ప్రచారం కూడా ఎప్పటికప్పుడు జనాలను ఆకట్టుకునేట్లుగా సెటైర్లు, మీమ్స్, జోక్స్ తదితరాలతో ఉండాలని కేటీయార్ ఆదేశించారు.
సోషల్ మీడియా అంటే వాట్సప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ తదితరాల్లో అభ్యర్ధుల తరపున వార్ రూములు, వాట్సప్ గ్రూపులు విస్తృతంగా పనిచేయబోతున్నాయి. అధికారంలో ఉందికాబట్టి ఖర్చులకు ఏమాత్రం వెనకాడటంలేదు. అందుకనే ప్రతిగ్రామంలోనే వందమందితో వాట్సప్ గ్రూపులను ఏర్పాటుచేసి ప్రత్యర్దులను ఉక్కిరిబిక్కిరి చేయాలని పెద్ద ప్లాన్ చేశారు. ప్రచారం చేసే క్రమంలో ఎవరు కూడా ఎన్నికల కమీషన్ నిబంధనలను ఉల్లంఘించి సమస్యలను కొనితెచ్చుకోవద్దని స్పష్టంగా కేటీయార్ చెప్పారు. లీగల్ సమస్యల్లో ఇరుక్కోవద్దని కూడా వార్నింగ్ ఇచ్చారు.