అసంతృప్త నేతతో అసమ్మతికి అడ్డుకట్ట.. సాధ్యమేనా?: టీ-కాంగ్రెస్‌లో గుసగుస
ఈ క్రమంలో ఎవరైనా తమకు టికెట్ రాలేదని, తాము సూచించిన వారికి ప్రాధాన్యం రాలేదని అసంతృప్తివ్యక్తం చేస్తే.. వారిని దారిలో పెట్టేందుకు జానారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.
By: Tupaki Desk | 12 Oct 2023 6:01 AM GMTఅసలే ఆయన అసంతృప్తితో కొట్టు మిట్టాడుతున్నారు. తనకు పార్టీలో మునుపటి ఆదరణ కనిపించడం లేదని, తన కుటుంబానికి ఆదరణ రావడం లేదని.. తరచుగా కూడా చెబుతున్నారు. పార్టీ పగ్గాలు వేరే వారికి అప్పగించే ముందు కనీసం పార్టీ తనకు మాట మాత్రంగా కూడా చెప్పలేదనే ఆవేదన కూడా ఆయలో ఉంది. అంతేకాదు.. ఉప ఎన్నికలో ఓటమి తర్వాత.. ఏకంగా.. అధికార పార్టీలోకి జంప్ చేస్తారనే చర్చ కూడా సాగింది. అలాంటి నాయకుడికి ఇప్పుడు ఎన్నికల ముంగిట అసమ్మతి నేతలను బుజ్జగించే పని అప్పగించడంపై సర్వత్రా సొంత పార్టీలోనే విస్మయం వ్యక్తమవుతోంది.
ఆయనే మాజీ మంత్రి, కాంగ్రెస్ వృద్ధ నాయకుడు కుందూరు జానా రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడం ప్రారంభించింది. ఈ అభ్యర్థుల ఎంపిక తుదిదశకు చేరుకున్న తరుణంలో అసమ్మతి చెలరేగకుండా పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఎవరైనా తమకు టికెట్ రాలేదని, తాము సూచించిన వారికి ప్రాధాన్యం రాలేదని అసంతృప్తివ్యక్తం చేస్తే.. వారిని దారిలో పెట్టేందుకు జానారెడ్డి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ ఇప్పటికే కొందరు నాయకులతో సమాలోచనలు జరిపింది. జాబితా ప్రకటించిన తర్వాత ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చించింది. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(ఈయన కూడా బీఆర్ ఎస్ వైపు చూస్తున్నారనే చర్చ కొన్నాళ్లు హల్‌చల్ చేసింది) నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించింది. అయితే.. తాజాగా జానా రెడ్డి నేతృత్వంలోని కమిటీపై కాంగ్రెస్‌లోని పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వంటి సీనియర్లు పెదవి విరుస్తున్నారు.
``ఆయనే అసంతృప్తిలో ఉన్నాడు. తనకు, తన కొడుక్కి కూడా టికెట్ అడుగుతున్నాడు. మరి పార్టీ ఇద్దరి కీ టికెట్ ఇస్తుందా? అలా జరిగితే మా కుటుంబంలోనూ రెండు టికెట్ లు ఇవ్వాలి. ఇవ్వకపోతే.. జానా రెడ్డి ఊరుకుంటాడా. ఈయనే అసంతృప్తిలో ఉన్నాడు. మా అసంతృప్తి ఈయనేం తీరుస్తాడు`` అని ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కీలక నాయకుడు మీడియా ముందు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అభిప్రాయాన్ని చాలా మంది సీనియర్లు వ్యక్తం పరచడం గమనార్హం.