అంబటి అంత పెద్ద ఒట్టేసారేంటబ్బా...?
ఆయన ఎపుడో మూడున్నర దశాబ్దాల క్రితం అంటే 1989లో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యారు.
By: Tupaki Desk | 14 Nov 2023 5:42 PM GMTవైసీపీ మంత్రి అంబటి రాంబాబుకు పెద్ద నోరు ఉంది అని అంటారు. రాజకీయ జోరు కూడా అలాగే ఉంది అని చెబుతారు. ఆయన ఎపుడో మూడున్నర దశాబ్దాల క్రితం అంటే 1989లో మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఆయన మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడానికి మూడు దశాబ్దాల కాలం పట్టింది.
అలా ఆయన 2019లో గెలిచారు. జగన్ ఆయనకు 2014లో టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. అయితే జగన్ వేవ్ లో 2019లో గెలవడమే కాదు, రెండవ సారి విస్తరణలో మంత్రి కూడా అయ్యారు. అలా రెండు సెంటిమెంట్ అచ్చి వచ్చిన మంత్రిగా ఆయన ఉన్నారు.
ఆరున్నర పదుల వయసులో మంత్రి హోదాలో వెలిగిపోతున్న అంబటి రాంబాబు 2024లో మరోసారి పోటీ చేయాలని చూస్తున్నారు. అది కూడా తనను ఇంతకాలానికి ఆదరించి అసెంబ్లీకి పంపించిన సత్తెనపల్లి నుంచి పోటీకి తయారు అంటున్నారు.
మరి హై కమాండ్ ఏ విధంగా ఆలోచిస్తుందో తెలియదు కానీ అంబటికి టికెట్ వస్తుంది అని కొందరు రాదు అని మరికొందరూ అంటున్నారు. మొత్తానికి అంబటికి టికెట్ అన్నది ఊహాగానాలకు పరిమితం అవుతోంది. ఒక్క అంబటికి మాత్రమే కాదు చాలా మందికి ఈసారి టికెట్ దక్కదు అని అంటున్నారు.
ఆ జాబితాలో ప్రస్తుత మంత్రులలో కొందరు అలాగే మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారని టాక్ నడుస్తోంది. మరి టికెట్ దక్కని వారు సహజంగా ఏమి చేస్తారో అందరికీ తెలిసిందే. పక్క పార్టీలోకి దూకుతారు. ఏపీలో పక్క పార్టీ అంటే ఒక్కటే కనిపిస్తోంది. అదే తెలుగుదేశం పార్టీ.
జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అలా అటూ ఇటూ రెండే పార్టీల మోహరింపులా 2024 ఎన్నికలు కూడా ఉండబోతున్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో టికెట్ దక్కని వారు చాలా మంది పక్క చూపులు చూస్తున్నారు అని వైసీపీ లోపలా బయటా ప్రచారం అయితే సాగుతోంది. మరి ఆ జాబితాలో ఎవరున్నారో బయటకు తెలియకపోయినా సడెన్ గా అంబటి మాత్రం ఓపెన్ అయిపోయారు.
అతి పెద్ద ఒట్టేసారు. అది కూడా తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఆయన మనసు విప్పేశారు. తాను పార్టీ మారను అని ఒకే ఒక్క బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. నేను బతికి ఉన్నన్ని నాళ్ళు జగన్ వెంటే అని చెప్పేశారు. జగన్ తోనే నా రాజకీయ జీవితం నా ప్రయాణం అని అంబటి పేర్కొన్నారు.
మరి ఎవరు అడిగారని అంబటి ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు అన్నదే ఇపుడు చర్చగా ఉంది. నిజానికి అంబటి రాంబాబు విషయంలో ఎవరికీ వేరే ఆలోచనలు కూడా లేవు. ఆయన వైఎస్సార్ కి కట్టుబడి ఉన్న నాయకుడు. ఆయన ఆ అభిమానంతోనే జగన్ పార్టీ పెట్టిన వెంటనే ఆయనతో పాటు నడిచారు. వైసీపీ 2014లో ఓడినా తాను ఓడినా కూడా ఆ పార్టీలోనే ఉన్నారు.
ఇక 2019లో గెలిచి మంత్రి కూడా అయ్యారు. 2024లో టికెట్ ఆయనకు ఏ కారణం చేత నిరాకరించినా పార్టీలోనే ఉంటారు అని అంతా అంటారు. కానీ ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వెనక విధేయతను మరోసారి చాటుకునే
ఉద్దేశ్యం ఉందని అంటున్నారు. తనకు టికెట్ కచ్చితంగా వస్తుందని ఆయన నమ్ముతున్నారు. ఒక వేళ ఏమైనా హై కమాండ్ ఆలోచిస్తే మాత్రం తన విధేయత మంత్రాన్ని ఉపయోగించడానికే ఆయన ఈ ప్రకటన ఇచ్చారని అంటున్నారు. తన జీవితం జగన్ కి అంకితం అని చెప్పడం ద్వారా ఆయన హై కమాండ్ కి తన మనసు పరచారు అని అంటున్నారు.
మొత్తానికి అంబటి రాంబాబు పార్టీ అయితే మారరు. వైసీపీలోనే ఉంటారు. మరి ఇంతకీ ఆయనకు టికెట్ వస్తుందా రాదా అంటే అది మాత్రం ఎవరూ చెప్పలేరేనే అంటున్నారు. పార్టీలో ఉన్నా మారినా కూడా జగన్ తీసుకునే నిర్ణయం ఒకేలా ఉంటుందని ఆయన గురించి ఎరిగిన వారు అనే మాట. మొత్తానికి విధేయతకు ఎపుడూ జగన్ పెద్ద పీట వేస్తారు. ఒక వేళ టికెట్ నిరాకరించినా అంబటికి వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే తగిన గౌరవం ఇస్తారని కూడా అంటున్న వారూ ఉన్నారు.