మాల్దీవుల ఎపిసోడ్ లో భారత్ దే పైచేయి నిజమేనా?
ఈ ఎపిసోడ్ లో మాల్దీవులు భారతదేశాన్ని తప్పుడు రీతిలో చూపించే ప్రయత్నం చేసింది.
By: Tupaki Desk | 12 Feb 2024 3:00 AM GMTమాల్దీవుల ఎపిసోడ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ లోని మోడీ ప్రభుత్వ వ్యతిరేక నినాదంతో ఎన్నికలకు వెళ్లి.. విజయం సాధించిన అక్కడి ప్రభుత్వం.. తాను అధికారం చేపట్టిన నాటి నుంచి భారత్ మీద తనకున్న అక్రోశాన్ని వెల్లగక్కే ప్రయత్నం చేయటం తెలిసిందే. ఇందులో భాగంగా.. భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్ష ద్వీప్ పర్యటన వేళ.. ఆయన చేసిన ట్వీట్ కు క్రూరమైన స్పందనను ప్రదర్శించారు ఆ దేశ అధికార పక్ష నేతలు. అందుకు బదులు వారి పదవులు కోల్పోవటం ద్వారా తగిన శాస్తి జరిగింది.
ఈ ఎపిసోడ్ లో మాల్దీవులు భారతదేశాన్ని తప్పుడు రీతిలో చూపించే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఆ దేశంలో ఉన్న భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని పేర్కొంది. ఆ దేశంలో భారత్ సైన్యం అంటే ఎంతో అనుకుంటే తప్పులో కాలేసినట్లే. మొత్తంగా 60కు మించరు. ఇంత తక్కువమంది ఉండి చేసేదేమీ లేకున్నా.. భారత్ మీద ఉన్న అక్కసుతో మాల్దీవుల్లో ఉన్న సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని పేర్కొనటంతో పాటు.. అందుకు గడువును నిర్దేశించింది.
అయితే.. భారత్ కు మాల్దీవులు వ్యహాత్మక భాగస్వామి మాత్రమే కాదు.. చైనా లాంటి శత్రుదేశాల టార్గెట్ నుంచి తప్పించుకునే వీలు సైన్యాన్ని ఉపసంహరించుకుంటే పోతుంది. ఈ నేపథ్యంలో మాల్దీవుల ప్రభుత్వ నిర్ణయాన్ని మోడీ సర్కారు ఎలాంటి ప్రభావితం చేస్తుందన్న ఆసక్తి అందరిలో వ్యక్తమైంది. దీనికి తగ్గట్లే భారత్ తన పైచేయిని ప్రదర్శించింది. మాల్దీవులు చెప్పినట్లే తన సైన్యాన్ని ఉపసంహరించుకుంటూనే.. అందుకు బదులుగా వారి స్థానంలో భారత టెక్నికల్ టీంను అక్కడకు పంపేలా నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్వయంగా ప్రకటించారు. భారత సైనికులు మాల్దీవుల్లో ఉండి ఏం చేశారో.. అలాంటి పనుల్నే తాజాగా వెళ్లే టెక్నికల్ టీం సభ్యులు చేయనున్నారు. తాజా నిర్ణయంతో మాల్దీవుల విషయంలో మధ్యే మార్గాన్ని కనుగొనే విషయంలో మోడీ సర్కారు పైచేయి సాధించినట్లేనని చెప్పాలి.
భారత సైనికులు మాల్దీవుల్లో ఉండకపోవచ్చు కానీ వారు చేసే పనిని భారత సాంకేతిక సభ్యులు చేస్తారని చెబుతున్నారు. భారత సైన్యం ఉపసంహరణ విషయంలో మొదట్లో కాస్తంత మొండిగా ఉన్న మాల్దీవుల ప్రభుత్వం.. తర్వాత మాత్రం అందుకు భిన్నమైన నిర్ణయాన్ని తీసుకోవటం చాలా పెద్ద విషయంగా అభిప్రాయ పడుతున్నారు. ఏమైనా.. మాల్దీవుల ఎపిసోడ్ లో భారత్ పైచేయి సాధించిందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.