ఓటమి వేళ కేసీఆర్ అండ్ కోను ఫాలో కాని జగన్ అండ్ కో!
ఎందుకంటే.. ప్రతికూల పరిస్థితిని హ్యాండిల్ చేయటం అంత తేలికైన విషయం కాదు.
By: Tupaki Desk | 19 Jun 2024 6:29 AM GMTఅధికార బదిలీ జరిగిన తర్వాత.. పరిస్థితుల్ని ఎలా హ్యాండిల్ చేయాలన్నది అంత తేలికైన విషయం కాదు. ఓవైపు ఓటమి వేధిస్తుంటే.. మరోవైపు నిండుగా కమ్మేసే నిరాశ.. నిస్ప్రహ నుంచి బయటకు రావటం అంత ఈజీ కాదు. ఇలాంటి వేళలో ఇరిటేషన పీక్స్ లో ఉంటుంది. అప్పటివరకు చేతిలో ఉన్న అంతులేని అధికారం దూరం కావటం.. ఐదేళ్లుగా అలవాటైన పరిస్థితులు ఏవీ దరిదాపుల్లో ఉండకపోవటాన్ని జీర్ణించుకోవటం చాలా కష్టమైన ప్రక్రియ.
దీనికి తోడు.. అధికారం చేతిలో ఉన్నప్పుడు నిండుగా ఉండే ఆత్మవిశ్వాసంతో పాటు.. అప్పటి ఆలోచనలకు భిన్నమైన పరిస్థితి ఓటమి వేళ ఉంటుంది. అందుకే అంటారు.. అధికారం ఉన్నప్పుడు కాదు విపక్షంలో ఉన్నప్పుడు వ్యవహరించే ధోరణే గొప్పగా చెబుతారు. ఎందుకంటే.. ప్రతికూల పరిస్థితిని హ్యాండిల్ చేయటం అంత తేలికైన విషయం కాదు. ఏపీలో ఎన్నికలకు దాదాపు ఆర్నెల్ల ముందే తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరటం.. పదేళ్లు అప్రతిహతంగా సాగిన కేసీఆర్ సర్కారుకు చెక్ పెడుతూ కాంగ్రెస్ కు అధికార పగ్గాలు అప్పజెప్పారు తెలంగాణ ప్రజలు.
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండో రోజు నుంచే కేసీఆర్ అండ్ కో ఆయన్ను టార్గెట్ చేయటం కనిపించింది. తాము అధికారంలో ఉన్న పదేళ్లలో విపక్షం నోరెత్తితే చాలు.. విరుచుకుపడటమే కాదు.. వారిని పలు విధాలుగా వేధింపులకు గురి చేసిన గులాబీ బ్యాచ్.. విపక్షంలో ఉండటాన్ని సహించలేకపోవటం కొట్టొచ్చినట్లుగా కనిపించింది.
కొత్త సర్కారు కొలువు తీరిన తర్వాత.. వారు ఊపిరి పీల్చుకోవటానికి అవసరమైన సమయాన్ని ఇవ్వకపోవటం.. తమ పాలన గురించి గొప్పలు చెబుతూ.. రేవంత్ సర్కారుపై నిందలు వేయటం వెగటుగా మారింది. పదేళ్లు పవర్ లో ఉన్నారు. చేయాల్సింది చేశారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన వారికి కాస్తంత టైం కూడా ఇవ్వకపోవటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. నిత్యం నెగిటివ్ గా వ్యవహరిస్తూ.. నిజాలు మాట్లాడే కన్నానిందలు వేయటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటమే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల వేళ ఒక్క సీటు కూడా లేకుండా ఓడించింది.
ప్రజల పక్షాన పోరాడాలన్న స్ప్రహ విపక్షానికి ఉండాలే కానీ.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని తమ కోసం పోరాటం చేయాలన్నట్లుగా వ్యవహరించటం ఏ మాత్రం సరికాదు. ఈ చిన్న లాజిక్ ను మిస్ అయిన కేసీఆర్.. కేటీఆర్.. హరీశ్ రావులు అదే పనిగా రేవంత్ సర్కారుపై విమర్శలు గుప్పించటమే పనిగా పెట్టుకున్నారు. దీన్ని.. తెలంగాణ ప్రజలు తమ తాజా ఓటుతో వారి తీరును తప్పు పట్టారని చెప్పాలి.
అధికార బదిలీ జరిగిన సమయంలో విపక్షంగా మారిన అధికారపక్షం ఎలా వ్యవహరించాలన్న దానికి నిలువెత్తు రూపంగా నిలుస్తారు గులాబీ బలగం. ఈ విషయంలో వైసీపీ ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుందని చెప్పాలి. తొందరపాటుకు పోకుండా.. ప్రజల తీర్పును సమీక్షించుకుంటూ తదుపరి కార్యాచరణను సిద్ధం చేయాలన్నట్లుగా జగన్ తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటివరకైతే కేసీఆర్ అండ్ కో మాదిరి రియాక్టు కానీ జగన్ అండ్ కో తీరు ఉంది. ఇకపై వేసే అడుగులు సైతం ఆచితూచి అన్నట్లుగా వేయాలి. రాజకీయ ప్రత్యర్థులు అవకాశం ఇచ్చే వరకు వెయిట్ చేయటం ముఖ్యం. అందుకు కాస్త సమయం గడిచినా ఫర్లేదన్నది మాత్రం మిస్ కాకూడదు.