Begin typing your search above and press return to search.

''రండి.. క‌లిసి కుమ్మేద్దాం''.. జ‌గ‌న్ ధ‌ర్నా.. 'డ‌ర్నా'!!

ఇదంతా.. రాజ‌కీయాల‌ను రాజ‌కీయంగా చూసిన కార‌ణంగా తెచ్చుకున్న గొప్ప సానుభూతి.

By:  Tupaki Desk   |   22 July 2024 4:48 AM GMT
రండి.. క‌లిసి కుమ్మేద్దాం.. జ‌గ‌న్ ధ‌ర్నా.. డ‌ర్నా!!
X

ఒక కాకి ఏడుస్తుంటే.. దాని చుట్టూ చేరి మ‌రో ప‌దికాకులైనా ఏడుస్తాయి. రాజకీయాల్లో ఒక‌ప్పుడు ఈ సంస్కృతి ఉండేది. ప్ర‌త్య‌ర్థి అయినా.. రాజ‌కీయంగానే చూసేవారు త‌ప్ప‌.. వ్య‌క్తిగ‌తంగా త‌ప్పులు ఎంచేవారు కాదు. కుటుంబాల జోలికి వెళ్లేవారు కూడా కాదు. టంగుటూరి వీరేశ‌లింగం పంతులు ఇంట్లో శుభ‌కార్యం అయితే.. క‌మ్యూనిస్ట‌లు వెళ్లి.. ఏర్పాట్లు చేసిన సంస్కృతి మ‌న ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉండేది. రామారావుపై నిప్పులు చెరిగిన నాయ‌కులు కూడా ఆయ‌న‌తో క‌లిసి ప‌క్క‌న ప‌క్క‌న కూర్చుని భోజ‌నాలు చేసిన సంప్ర‌దాయం కూడా మ‌న‌కే సొంతం. ఇదంతా.. రాజ‌కీయాల‌ను రాజ‌కీయంగా చూసిన కార‌ణంగా తెచ్చుకున్న గొప్ప సానుభూతి. మంచిత‌నం!!

కానీ, గ‌త ఐదేళ్ల ఏపీ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే.. దుర్రాజ‌కీయాలే రాజ్య‌మేలాయి. ఫ‌లితంగా.. నాయ‌కుల హ‌క్కుల‌కే కాదు.. సామాన్యుల హ‌క్కుల‌కు కూడా దిక్కులేని దైన్య ప‌రిస్థితిని ఎదుర్కొనాల్సి వ‌చ్చింది. వాటి కార‌ణంగా.. పాలిత వైసీపీ.. ప్ర‌జ‌ల ప్ర‌కోపాగ్ని కార‌ణంగా 11కు ప‌డిపోయింది. ఇదిలావుంటే.. గ‌త నెల రోజుల్లో రాష్ట్రంలో జ‌రిగిన హింస‌.. హ‌త్య‌లు.. ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయ‌ని పేర్కొంటూ.. నిప్పులు చెరిగిన మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. ఢిల్లీలో ధ‌ర్నాకు రెడీ అయ్యారు. ఈ నెల 24న ఆయ‌న ఢిల్లీలో ధ‌ర్నారు సిద్ధ‌మ‌య్యారు. ఈ నేప‌థ్యంలోనే క‌మ్యూనిస్టుల కామ్రెడ్ల‌కు క‌బురు పంపారు.

``రండి.. క‌లిసి కుమ్మేద్దాం`` అంటూ జ‌గ‌న్ పిలుపు పంపించారు. అయిన‌ప్ప‌టికీ క‌మ్యూనిస్టులు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు.. క‌లిసి వ‌చ్చేందుకు ఇంకా స‌మ‌యం ఉంద‌ని ఒక కీల‌క కామ్రెడ్ వ్యాఖ్యానించారు. కానీ, అస‌లు సిస‌లు కీల‌క స‌మ‌యంలో మాత్ర‌మే త‌న‌కు క‌లిసి రావాల‌న్న‌ది జ‌గ‌న్ తర‌ఫు వాద‌న‌. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ రియాక్ట్ కాలేదు. మ‌రోవైపు.. వైసీపీ క‌నుక క‌లిసి వ‌చ్చి హోదా కోసం ధ‌ర్నా చేస్తే.. తాము గ‌ళం విప్పుతామ‌ని.. కాలు క‌దుపు తామ‌ని కాంగ్రెస్ నేత జ‌య‌రాం వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్న‌ది రాష్ట్ర ప్ర‌యోజ‌నం కాదు.. పార్టీ ప్ర‌యోజ‌నం కోసం..!

దీంతో రాష్ట్రంలోనే కాకుండా.. జాతీయ స్థాయిలోనూ జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు కొర‌వ‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఉన్న మేధావులు కూడా.. మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు. క‌నీసం ఒక్క సంఘం కూడా.. జ‌గ‌న్‌కు జై కొట్ట‌లేదు. ఆయ‌న‌తో క‌లిసి వ‌స్తామ‌ని చెప్ప‌లేదు. పైగా.. ఇప్పుడు తొంద‌రెందుకు? అని వ్యాఖ్యానించిన వారే ఎక్కువ‌గా ఉన్నారు. సో.. ఎలా చూసుకున్నా.. జ‌గ‌న్ ధ‌ర్నా.. డ‌ర్నాగానే మార‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పైన చెప్పుకొన్న‌ట్టుగా ఒక్క కాకికి క‌ష్టం వ‌స్తే.. ప‌ది కాకులు పోగ‌వ్వాలి. కానీ, ఏపీలో గ‌త ఐదేళ్ల `ఏకాకి` పాల‌న కార‌ణంగా క‌లిసి వ‌చ్చేందుకు చేతులు క‌లిపేందుకు ఎవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం.