Begin typing your search above and press return to search.

జగన్ ప్రతిపక్ష హోదా పదిలమేనా ?

అయితే ఆ తరువాత ప్రధాన ప్రతిపక్ష నేత హోదా తమకు ఇవ్వాలని స్పీకర్ కి జగన్ లేఖ రాసారు.

By:  Tupaki Desk   |   16 July 2024 3:40 AM GMT
జగన్ ప్రతిపక్ష హోదా పదిలమేనా ?
X

ఏపీ అసెంబ్లీలో జగన్ రోల్ ఏమిటి ఎలా ఉండబోతోంది అన్నది పెద్ద చర్చగానే ఉంది. గత నెలలో ఏపీ అసెంబ్లీ సమావేశం జరిగింది. సభ్యులు అంతా ప్రమాణం చేశారు. స్పీకర్ ఎన్నిక సైతం జరిగింది. తొలి రోజు వచ్చి ప్రమాణం చేసి జగన్ వెళ్ళిపోయారు. రెండవ రోజు స్పీకర్ ఎన్నికకు ఆయన గైర్ హాజరు అయ్యారు.

అయితే ఆ తరువాత ప్రధాన ప్రతిపక్ష నేత హోదా తమకు ఇవ్వాలని స్పీకర్ కి జగన్ లేఖ రాసారు. దాని మీద స్పీకర్ అయ్యన్నపాత్రుడు నుంచి స్పందన రాలేదు కానీ టీడీపీ నేతలు మాత్రం ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.

తక్కువ సీట్లు తెచ్చుకుని ఎలా ప్రతిపక్ష నేత హోదా అడుగుతారు అని వారు ప్రశ్నించారు. జగన్ కి ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఆ తీర్పుకే ఆయన కట్టుబడి ఉండాలని సూచించారు. మొత్తం మీద విషయం అక్కడే ఉంది.

ఇంతలో ఏపీ బడ్జెట్ సమావేశాలు తోసుకుని వస్తున్నాయి. ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి మొదలు కానున్నాయి. కనీసంగా వారం నుంచి పది రోజుల పాటు ఈ సమావేశాలు జరగవచ్చు. ఈ మధ్యలో జగన్ బెంగళూరు ప్రయాణం కట్టారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అని మరో కొత్త చర్చ కూడా సాగుతోంది.

ఇక ఏపీ అసెంబ్లీలో చూస్తే పూర్తిగా అధికార పక్షమే అంతటా పరచుకుని ఉంది. టెక్నికల్ గా అయినా విపక్షం లేదు. అయితే ఇది మంచి విధానం కాదని రాజ్యాంగ నిపుణులు గతంలో స్పీకర్లుగా పనిచేసిన వారు అంటున్నారు.

అసెంబ్లీ అంటే అధికార పక్షం ప్రతిపక్షం ఉండాలని అంటున్నారు. అపొజిషన్ చెప్పాలి. అధికార పక్షం పని చేయాలి అన్నదే ప్రజాస్వామ్యంలో మౌలిక సూత్రం అని అంటున్నారు. ఇక ఉమ్మడి ఏపీకి స్పీకర్ గా పనిచేసిన సురేష్ రెడ్డి మంచి స్పీకర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆయన తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ ని ప్రతిపక్ష నేతగా గుర్తించడం అన్నది ప్రోటోకాల్ పద్ధతి అని అన్నారు.

కానీ ట్రెడిషనల్ గా జరిగేది చూసుకుంటే ఆయనే అపొజిషన్ లీడర్ గా ఉంటారు అని అంటున్నారు. జగన్ ని ప్రతిపక్ష నేతగానే చూడాలని అన్నారు. ప్రధాన ప్రతిపక్షం అంటే హోదా కాదని ఎంత సమయం ఇచ్చారని వాయిస్ ఎంతగా వినిపించేలా చేశారు అన్నదే ఇంపార్టెంట్ అని అన్నారు.

గతంలో 1994లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ కి 26 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా అప్పటి కాంగ్రెస్ పక్ష నాయకుడు పీజేఆర్ కి అధికారికంగా విపక్ష నేత హోదా ఇవ్వకపోయినా కావాల్సినంత సమయం మాట్లాడేందుకు ఇచ్చేవారని అన్ని విషయాల్లో ఆయనతో సంప్రదించేవారు అని అన్నారు.

ఇక లోక్ సభలో గత రెండు పర్యాయాలు కాంగ్రెస్ కి ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా కాంగ్రెస్ నేతలకు మాట్లాడేందుకు ఎక్కువ సమయం ఇచ్చి వారితోనే బిజినెస్ అడ్వైజర్ కమిటీలలతో పాటు అనేక విషయాల్లో చర్చించేవారు అని గుర్తు చేశారు.

ఇవన్నీ సంప్రదాయాలు అని దానిని బట్టి చూస్తే ఏపీలో అనుభవం కలిగిన వారు స్పీకర్ గా ఉన్నారు కాబట్టి విపక్ష నేతకు తగిన గౌరవం మర్యాద దక్కుతాయనే తాను భావిస్తున్నాను అన్నారు. ఇక జగన్ కి సైతం పెద్ద బాధ్యత ఉందని అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద ఆయనే విపక్ష వాణిని బలంగా వినిపించాలని సురేష్ రెడ్డి కోరారు. మొత్తం మీద చూస్తే జగనే విపక్ష నేత అంటున్నారు అంతా. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. మరి జగన్ సభకు వెళ్తేనే కదా స్పీకర్ ఆయనకు ఎంత సమయం ఇస్తారు ఎలా చూస్తారు అన్నది అర్థం అయ్యేది అంటున్నారు. మొత్తానికి అంతా ఈ నెల 22వ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.