పాత సామెతను గుర్తుకు తెచ్చేలా మాట్లాడుతున్న జగ్గారెడ్డి?
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తుందన్న చర్చ సాగుతూ.. కొన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని.. మరికొన్ని.. దగ్గర్లోకి వస్తాయని చెబుతున్న వేళ.. జగ్గారెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు ఆ పార్టీకి నష్టం వాటిల్లేలా చేస్తాయంటున్నారు.
By: Tupaki Desk | 24 Oct 2023 4:41 AM GMTఆలూ లేదు సూలు లేదు మొగుడు పేరు సోమలింగం అన్నట్లుగా మారింది కాంగ్రెస్ నేత కమ్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అంతా బాగుందన్న భావన కలిగినంతనే.. మొత్తంగా చెడగొట్టే విషయంలో కాంగ్రెస్ నేతలు ముందు ఉంటారన్న ప్రచారానికి తగ్గట్లే ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఎవరో ప్రత్యేకంగా శత్రువులు ఉండరని.. వారికి వారే శత్రువులు అన్నట్లుగా బిహేవ్ చేయటం మామూలే. తాజాగా జగ్గారెడ్డి అలాంటి తీరునే ప్రదర్శించారని చెబుతున్నారు.
దసరా సందర్భంగా నిర్వహించిన వేఢుకలకు హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖతమేనని.. తెలంగాణ డెవలప్ మెంట్ సంకనాకిపోతుందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు తగ్గట్లే.. జగ్గారెడ్డి మాటలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఇంతకూ ఆయన నోటి నుంచి వచ్చిన మాటల్ని చూస్తే.. ‘‘వచ్చే పదేళ్లలో నేను తెలంగాణకు ముఖ్యమంత్రిని అవుతా. విజయదశిమి నాడు నా మనసులో మాట చెబుతున్నా. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి. దీన్ని ఎవరైనా కాదనగలరా?’’ అంటూ వ్యాఖ్యానించారు.
గడిచిన కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ గాలి వీస్తుందన్న చర్చ సాగుతూ.. కొన్ని సర్వేలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని.. మరికొన్ని.. దగ్గర్లోకి వస్తాయని చెబుతున్న వేళ.. జగ్గారెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలు ఆ పార్టీకి నష్టం వాటిల్లేలా చేస్తాయంటున్నారు. కీలకమైన ఎన్నికల వేళ.. పార్టీ గెలుపు కోసం శ్రమించాల్సింది పోయి అందుకు భిన్నంగా తాను ముఖ్యమంత్రిని అవుతానని వ్యాఖ్యానించటం పార్టీకి నష్టం వాటిల్లేలా చేస్తుందంటున్నారు. తమకు ఒక్క ముఖ్యమంత్రేనని.. అదే కాంగ్రెస్ కు అయితే పది మంది ముఖ్యమంత్రులంటూ మంత్రి కేటీఆర్ తరచూ వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ వాదనకు బలం కలిగేలా జగ్గారెడ్డి మాటలు ఉన్నాయంటున్నారు. జగ్గారెడ్డి తరహా నేతల కారణంగా పార్టీకి లాభం కలుగకపోగా.. నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు. ఎన్నికల వేళలో ఆచితూచి మాట్లాడాల్సింది పోయి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే జరిగే నష్టం గురించి జగ్గారెడ్డి ఆలోచించరా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా జగ్గారెడ్డి మాటలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలాన్ని రేపుతున్నాయి. జగ్గారెడ్డి మాటలకు కౌంటర్ ఇచ్చే క్రమంలో ఇంకెవరు బయటకు వచ్చి.. మరేం మాట్లాడతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.