Begin typing your search above and press return to search.

జమిలి ఇప్పటికిప్పుడు సాధ్యమా? నిపుణులు చెబుతున్నదేంటి?

ఇంతకాలం రాజకీయ వర్గాల చర్చల్లో మాత్రమే వినిపించే జమిలి ఎన్నికలకు సంబంధించి మోడీ నాయకత్వంలోని కేంద్ర సర్కారు అనూహ్యంగా తెర మీదకు తీసుకురావటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Sep 2023 6:51 AM GMT
జమిలి ఇప్పటికిప్పుడు సాధ్యమా? నిపుణులు చెబుతున్నదేంటి?
X

ఇంతకాలం రాజకీయ వర్గాల చర్చల్లో మాత్రమే వినిపించే జమిలి ఎన్నికలకు సంబంధించి మోడీ నాయకత్వంలోని కేంద్ర సర్కారు అనూహ్యంగా తెర మీదకు తీసుకురావటం తెలిసిందే. దీంతో.. ఇప్పుడు చర్చ మొత్తం జమిలి చుట్టూనే జరుగుతోంది. మోడీ సర్కారు అనుకున్నట్లుగా జమిలి ఎన్నికల్ని త్వరలో నిర్వహించే వీలుందా? అంటే.. లేదనే మాట బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇంత పెద్ద దేశంలో ఒకేసారి లోక్ సభ ఎన్నికలతో పాటు 28 రాష్ట్రాల్లో (అన్ని కాకున్నా వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో) ఎన్నికల్ని ఒకే దఫా నిర్వహించటం అంటే అంత మామూలు విషయం కాదు.

ఒకవేళ.. అన్ని రాష్ట్రాలు కాకున్నా.. మెజార్టీ రాష్ట్రాలు అనుకున్నా.. అదెంత తేలికైన విషయం కాదు. ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వారు మోడీ సర్కారు నిర్ణయంపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకూ వారేం చెబుతున్నారు? అన్న విషయంలోకి వెళితే..ఒకే దేశం.. ఒకే ఎన్నికలు మాట వినేందుకు బాగానే ఉన్నా.. ఆచరణలో అంత తేలికైన విషయం కాదంటున్నారు.

ఒకేసారి ఎన్నికలకు సిద్ధం కావాలంటే కనీసం ఒకట్రెండు సంవత్సరాల ప్రణాళిక.. కార్యాచరణ ఉండాలని చెబుతున్నారు. గతంలోనూ ఒకేసారి ఎన్నికల్ని నిర్వహించే సామర్థ్యం ఉన్నా.. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువని గుర్తు చేస్తున్నారు. 1952-1967 మధ్యలో పెద్ద టెక్నాలజీ అందుబాటులో లేకున్నా దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికల్ని నిర్వహించిన ట్రాక్ రికార్డు ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాకుంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవొచ్చని చెబుతున్నారు.

అన్నింటికి మించి ఇప్పటికిప్పుడు మూడు నాలుగు నెలల్లో ఎన్నికల్ని నిర్వహించటం సాధ్యం కాదని.. దానికి కనీసం ఒక ఏడాది నుంచి వర్కువుట్ చేస్తే కానీ జమిలి ఎన్నికల్ని నిర్వహించే వీలుంది. గతంలో అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగేవి. తర్వాతి కాలంలో ఆయా రాష్ట్రాల్లో చోటు చేసుకునే పరిణామాలు.. కేంద్రంలోని ప్రభుత్వ బలాబలాలు మారటంతో ఆ షెడ్యూల్ గాడి తప్పింది. దీంతో.. ప్రతి ఏడాది ఎన్నికల మీద ఎన్నికలు రావటంతో.. కేంద్రం పాలన మీద కంటే రాజకీయ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. దీంతో.. తిరిగి జమిలి ఎన్నికల దిశగా అడుగులు వేయాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు.

అయితే.. ఒకేసారి ఎన్నికల్ని నిర్వహించేందుకు అన్ని పార్టీల మద్దతు అవసరం. దీంతో పాటు రాజ్యాంగానికి.. ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలి. వీటితో పాటు భారీ స్థాయిలో కేంద్ర పోలీసు బలగాలు.. ఈవీఎంలు.. వీవీ ప్యాట్లు అవసరం అవుతాయి. వాటి తయారీకి భారీగా నిధులు అవసరమవుతాయి. ఇవన్నీ చేసేందుకు కనీసం ఏడాది నుంచి రెండేళ్లు అవసరమవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ వ్యాప్తంగా 25 లక్షల లోపు ఈవీఎంలు ఉన్నాయి. కానీ.. ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం 40 లక్షల ఈవీఎంలు అవసరం అవుతాయి. మరి.. అన్ని తయారు చేయించాలంటే భారీ బడ్జెట్ అవసరపడుతుంది. ఇలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్న నేపథ్యంలో జమిలి ఎన్నికలు ఇప్పటికిప్పుడు సాధ్యం కాదంటున్నారు. లేదంటే.. మిని జమిలి ఎన్నికలు జరిపి.. ఎన్నికలు నిర్వహించని రాష్ట్రాలను ఏకం చేసి.. వాటికి సపరేటుగా ఎన్నికలు నిర్వహించేలా చేయాల్సి ఉంటుంది. కానీ.. ఆ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సానుుకూలంగా స్పందిస్తాయా? అన్నది మరో ప్రశ్న. మొత్తంగా ఒక దేశం.. ఒక ఎన్నిక అన్న నినాదం.. మాట చెప్పినంత ఈజీ కాదని మాత్రం చెప్పక తప్పదు.