కేసీఆర్ జగన్ : అసెంబ్లీ ఎంత దూరమో...?
ఈ ఇద్దరు నేతలూ అధికారంలో ఉన్నపుడు చాలా దూకుడుగా ఉండేవారు అని చెబుతారు.
By: Tupaki Desk | 26 Jun 2024 7:41 AM GMTరెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఇద్దరు కీలక నేతలు, ప్రాంతీయ పార్టీల అధినేతలకు ఒకే రకమైన పరిస్థితి ఏర్పడింది. ఆ ఇద్దరూ ఎవరో కాదు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వైసీపీ అధినేత జగన్. ఈ ఇద్దరు నేతలూ అధికారంలో ఉన్నపుడు చాలా దూకుడుగా ఉండేవారు అని చెబుతారు.
తామే శాశ్వతంగా అధికారంలో ఉంటామని వారు బహుశా అనుకున్నారో ఏమో కానీ ప్రత్యర్ధులను అసలు పట్టించుకోలేదు. ప్రతిపక్షాలను ఏ మాత్రం ఖాతరు చేయలేదు పదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన కేసీఆర్ ప్రతిపక్షాలను చీల్చి చెండాడారు. విపక్షం అన్నది అసెంబ్లీలో లేకుండా చేశారు.
కాంగ్రెస్ టీడీపీ వైసీపీ ఇలా అన్ని పార్టీలను చీల్చి బీఆర్ఎస్ లో కలిపేసుకున్నారు. ఇక 2018లో కాస్తా ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్ కి విపక్ష హోదా లేకుండా ఆ ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. అలా రాజ్యం చేసిన కేసీఆర్ అనూహ్యంగా 2023 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు.
దాంతో ఆయన మాజీ అయ్యారు. ఇక ఆరు నెలలు అయింది మాజీ సీఎం అన్న ట్యాగ్ ని కేసీఆర్ అసలు భరించలేక పోతున్నారు అని అంటున్నారు. ఆయన అసెంబ్లీకి రావడమే మానుకున్నారు. సీఎం గా పనిచేసిన చోట విపక్షంగా ఉండడం ఏమిటి అని ఆయన ఆలోచిస్తున్నట్లుగా ఉంది. దాంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నారు.
సీఎం గా రేవంత్ రెడ్డి ఉంటే ఆయనని ఫేస్ చేయడం కూడా ఇష్టం లేనట్లుగా కేసీఆర్ వైఖరి ఉంది. దాంతో అసెంబ్లీ సమావేశాలు ఉంటే కేటీఆర్ హరీష్ రావు వెళ్ళి వస్తున్నారు. వారే విపక్ష నేత పాత్ర పోషిస్తున్నారు. అలా కేసీఆర్ అసెంబ్లీకి దూరం అయిపోయారు.
సీన్ కట్ చేస్తే ఏపీలో జగన్ పరిస్థితి అలాగే ఉంది. ఆయన కూడా అసెంబ్లీకి రాకూడని అన్నట్లుగా సాకులు వెతుక్కుంటున్నారు అని అంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా కావాలని ఆయన కోరుతున్నారు. నిజానికి ఈ హోదా కావాలని అడిగిన పార్టీలు అయితే ఇప్పటిదాకా లేవనే అంటున్నారు.
హోదా ఇవ్వడం అన్నది సంఖ్యా బలం బట్టి ఉంటుందని సభా సంప్రదాయాలు చెబుతున్నాయి. రాజ్యాంగం ఏమి చెప్పింది చట్టాలు ఏమిటి అన్నది ఎవరూ లోతుగా వెళ్లి చూడటం లేదు. అసలు దేశంలో ఏమి జరుగుతోంది, ఎక్కడ ఏ విధంగా దానిని అనుసరిస్తున్నారు అనే చూస్తున్నారు. ఆ విధంగా చూస్తే కనుక మొత్తం చట్టసభలో పదవ వంతు వచ్చిన పార్టీకే విపక్ష హోదా ఇస్తారు. అదే ఆనవాయితీగా వస్తోంది.
దాంతో హోదా సంగతి పక్కన పెట్టి ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో చర్చించడానికి జగన్ కి ఏమిటి అభ్యంతరం అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అయితే జగన్ అసెంబ్లీలో సీఎం ప్లేస్ లో చంద్రబాబుని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. 151 సీట్లతో అయిదేళ్ల పాటు ఆయన తిరుగులేని అధికారాన్ని నడిపారు. అసెంబ్లీలో వైసీపీ హవా సాగింది. ఆనాడు విపక్ష స్థానంలో ఉన్న చంద్రబాబుని వైసీపీ నేతలు దారుణంగా విమర్శించారు, అవమానించారు.
అపుడు అలాంటి పరిస్థితులు జరగడం వల్లనే ఇపుడు వైసీపీ అసెంబ్లీకి వెళ్ళేందుకు ఆలోచిస్తోంది అని అంటున్నారు. అసలే 11 మంది ఎమ్మెల్యేలు దాంతో సభలో ఎలా అన్నది ఒక విషయం అయితే సభలోకి వెళ్ళేందుకు అహం అడ్డు వస్తోందని కూడా అంటున్నారు.
ఇలా అక్కడ కేసీఆర్ ఇక్కడ జగన్ ఇద్దరూ కూడా తమ దూకుడు రాజకీయం తో తామే చట్ట సభలకు దూరం అవుతున్నారు అని అంటున్నారు. ప్రజా సేవకు నెగ్గామని అనుకుని ఉంటే ప్రజలే అంతిమ ప్రభువులు అని భావించి ఉంటే విపక్షాన్ని గౌరవించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా అని అంటున్నారు.
పొరుగున ఉన్న ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ హాయిగా విపక్షంలో కూర్చుంటారు. ఆయనను అధికార బీజేపీ కూడా గౌరవిస్తోంది. దానికి కారణం ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా మిడిసి పడలేదు, విపక్షం గౌరవం వారికి పూర్తిగా ఇచ్చారు. అందువల్లనే ఆయనకు తిరిగి ఆ గౌరవం లభిస్తోంది. ఓడలు బళ్ళు కావడం సహజం. మరి అది తెలిసి కూడా అంతా తామే అన్నీ తామే అని అనుకోబట్టే ఈ ఇబ్బందులు అని కేసీఅర్ జగన్ లను చూసిన వారు అనుకుంటున్నారు.