ఇస్లామాబాద్ దిగ్బంధనం.. ఇంటర్నెట్ సేవలు నిలిపివేత..అసలు కారణం అదే..
పేరుకు మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కి మనకు మధ్య చాలా తేడా ఉంది.
By: Tupaki Desk | 5 Oct 2024 9:28 AM GMTపేరుకు మన పొరుగు దేశమైన పాకిస్తాన్ కి మనకు మధ్య చాలా తేడా ఉంది. మనదేశంలో ఉన్నంత స్వాతంత్రం అక్కడ ప్రజలకు లేకపోవడం పలు సందర్భాల్లో మనం గమనిస్తున్నాం. అయితే అక్కడ కూడా కాస్త పరిస్థితులు మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. తాజాగా పాకిస్తాన్లో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ కేసుల్లో అరెస్ట్ అయి ఇప్పుడు జైలు శిక్ష అనుభవిస్తున్న.. మాజీ క్రికెటర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను తక్షణమే విడుదల చేయాలి అంటూ ప్రజలు భారీ ఎత్తున ఆందోళన చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చి నిరసన చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పాక్ ప్రభుత్వం భద్రత ఏర్పాట్లు చేపట్టడంతో పాటు ప్రజలపై ఆంక్షలు కూడా విధించింది.
పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లోకి ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ప్రవేశించకుండా కట్టుదిట్టం చేసింది. సెల్‌ఫోన్, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేసింది. దీంతో ఇప్పుడు ఇస్లామాబాద్‌కు మిగిలిన ప్రాంతాలతో ఎటువంటి సంబంధం లేకుండా పోయింది.
కథ కోతికాలంగా పాకిస్థాన్లో అనూహ్యంగా తెహ్రీకీ ఇన్సాఫ్ - పీటీఐ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్‌కు ప్రజలలో భారీ మద్దతు పెరిగింది. ఈ విషయం అధికారంలో ఉన్న షెహాబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారడంతో అణిచివేయడానికి ఎంతో ప్రయత్నించారు. అయితే ఈ నిరసన సెగ రాజధాని వరకు రాకుండా ఉండడం కోసం గట్టిగా చర్యలు చేపడుతున్నారు.
2022 లో జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అనంతరం ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. అయితే తన పదవి పోవడానికి అమెరికా సహాయంతో పాక్ సైన్యం కుట్ర చేసింది అని అప్పట్లో ఇమ్రాన్ ఆరోపించారు.అనంతరం దేశద్రోహం, అవినీతి లాంటి వివిధ ఆరోపణల తో ఇమ్రాన్ ఖాన్ పై మొత్తం 150 కేసులు నమోదయ్యాయి. దీంతో 2023 నుంచి ఆయన జైలుకే అంకితం అయ్యారు.ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇస్లామాబాద్ లోకి చొరబడి అతని విడుదల చేయాలి అని భారీ ఎత్తున నిరసన చేపడుతారు అనే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇస్లామాబాద్ తో పాటుగా రావల్పిండి, కరాచీ వంటి కీలక నగరాలలో కూడా ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.